పర్యావరణ రక్షణ పేరుతో కొల్లేరు ధ్వంసం
సీపీఎం నేత మంతెన ఆందోళన
భీమవరం : పర్యావరణ రక్షణ పేరుతో కొల్లేరు సరస్సును ధ్వంసం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మంతెన సీతారామ్ ఆందోళన వ్యక్తం చేశారు. భీమవరంలో శనివారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బి బలరాం అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన కొల్లేరు సరస్సు ప్రాంత ప్రజలు ఏళ్ల తరబడి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నేటి కొల్లేరులోని కాలుష్యం ప్రధానంగా పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని భారీ పరిశ్రమలు నుంచి పారిశ్రామిక వ్యర్థ జలాలే కారణమన్నారు. కొల్లేరు ప్రజలు వల్ల కాలుష్యం కావడం లేదని స్పష్టం చేశారు. ఫ్యాక్టరీలు నుంచి వచ్చే కాలుష్యాన్ని అరికట్టాలని ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తున్నా పాలక వర్గాలు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని సీతారామ్ మండిపడ్డారు. 2006లో ఆపరేషన్ కొల్లేరు పేరుతో వేలాది ఎకరాలు ఆక్వా చెరువులను అమానుషంగా అప్పటి ప్రభుత్వాలు రద్దు చేశాయని అవేదన వ్యక్తం చేశారు. 86వేల ఎకరాలు చెరువులు, 7,500 ఎకరాల సొసైటీ చెరువులు, 13 వేల జిరాయితీ భూముల చెరువులను అప్పటి ప్రభుత్వం ధ్వంసం చేసిందని గుర్తుచేశారు. కొల్లేరు భూములపై స్థానిక ప్రజలకే హక్కు ఉందని సరస్సును 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు కుదించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కొల్లేరు ప్రజలపై శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీర్పుపై ఇంప్లీట్ పిటిషన్ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని, కొల్లేరు ప్రజల ఉపాధిని కాపాడాలని సీతారామ్ డిమాండ్ చేశారు. కొల్లేరు సరస్సు కోసం ప్రజలు చేసే అన్ని పోరాటాలకు సీపీఎం అండదండలు అందిస్తుందన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్ మాట్లాడుతూ సీపీఎం జిల్లా మహాసభల్లో చర్చించన మేరకు భవిష్యత్ పోరాటాలను నిర్మించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉండి నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లు, చిరు వ్యాపారుల షాపులను తొలగించడం అన్యాయమన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు చింతకాయల బాబురావు, కేతా గోపాలన్, బి వాసుదేవరావు, కౌరు పెద్దిరాజు, దూసి కళ్యాణి, పొగాకు పూర్ణ, కేతా పద్మజ, జక్కంశెట్టి సత్యనారాయణ, సూర్నీడు వెంకటేశ్వరరావు, గొర్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment