మాజీ ఎమ్మెల్యే బాలరాజుకు మాతృవియోగం
బుట్టాయగూడెం: మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాతృమూర్తి తెల్లం మల్లమ్మ(80) శనివారం సాయంత్రం మృతి చెందారు. తల్లి మృతితో బాలరాజు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మల్లమ్మ మృతిపై పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. అలాగే ఏటీఏ నాయకులు మల్లమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
మద్యం దుకాణంలో చోరీ
ద్వారకాతిరుమల: మండలంలోని వెంకటకృష్ణాపురంనకు వెళ్లే మార్గంలో ఉన్న మద్యం దుకాణంలో శనివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు శ్రీశ్రీనివాసా దుకాణం పైకప్పు రేకులను తొలగించి, లోపలికి వెళ్లి సీసీ కెమేరాలు, హార్డ్ డిస్క్‌ను ధ్వంసం చేశారు. అలాగే దుకాణంలోని రూ. 50 వేల నగదు, రెండు మద్యం బాటిళ్లను తస్కరించి, అక్కడి నుంచి ఉడాయించారు. ఉదయం దుకాణం తెరిచేందుకు వెళ్లిన నిర్వాహకులు చోరీ జరిగినట్టు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై టి.సుధీర్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య
ఏలూరు టౌన్: ఏలూరు శివారు వట్లూరు సమీపంలో రైలుకింద పడి ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధితులు తెలిపిన వివరాల మేరకు ఏలూరు తంగెళ్ళమూడి ప్రాంతానికి చెందిన షేక్ సుబానీ (39) భార్య పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. సుబానీ ఫైనాన్స్ పద్ధతిపై మంచాలు, కుర్చీలు విక్రయిస్తూ వారం వారం డబ్బులను వసూలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి కారణాలు ఏమిటో తెలియదు కానీ వట్లూరు సమీపంలో రైలు పట్టాలపై వెళుతూ రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
దెందులూరు: కదులుతున్న రైలు నుంచి జారిపడి అస్సాం రాష్ట్రం పర్యటపూర్ ప్రాంతానికి చెందిన దీపాంకర్ సోనోవాల్ (36) మృతి చెందాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ జయ సుధాకర్ తెలిపిన వివరాలివి. శనివారం అస్సాం నుంచి బెంగుళూర్ వెళుతున్న రైలు దెందులూరు రైల్వే గేట్ సమీపానికి వచ్చేసరికి సోనోవాల్ ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి తీవ్ర గాయాలై మృతి చెందాడన్నారు. అతడి మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment