ట్రిపుల్‌ ఐటీలో మెస్‌, ఫుడ్‌కోర్టు పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీలో మెస్‌, ఫుడ్‌కోర్టు పరిశీలన

Published Thu, Feb 13 2025 8:50 AM | Last Updated on Thu, Feb 13 2025 8:50 AM

ట్రిపుల్‌ ఐటీలో మెస్‌, ఫుడ్‌కోర్టు పరిశీలన

ట్రిపుల్‌ ఐటీలో మెస్‌, ఫుడ్‌కోర్టు పరిశీలన

నూజివీడు: నూజివీడు ట్రిపుల్‌ ఐటీని బుధవారం కాలేజీయేట్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ నారాయణ్‌ భరత్‌ గుప్తా సందర్శించారు. దీనిలో భాగంగా క్యాంపస్‌లోని విద్యార్థులకు భోజనాలు పెట్టే డైనింగ్‌హాల్స్‌, కిచెన్‌, స్టోర్‌ రూమ్‌ పరిశీలించారు. అనంతరం ఫుడ్‌కోర్టును సందర్శించి అక్కడి స్టాక్‌రూమ్‌ను తనిఖీ చేశారు. ఫుడ్‌కోర్టులో ఆహార పదార్ధాలు, ధరలు, నాణ్యత, లభించే పరిమాణం తదితర విషయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుంచి అకడమిక్‌ బ్లాకుల్లోని తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో సంభాషించారు. వారి విద్యకు సంబంధించిన వివరాలను, ఆహారం, వసతి, ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ సండ్ర అమరేంద్రకుమార్‌ క్యాంపస్‌లో చేపట్టిన చర్యల గురించి వివరించారు.

ఇంటర్‌ ప్రయోగ పరీక్షలకు 5,441 మంది హాజరు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ప్రయోగ పరీక్షలకు బుధవారం 5,441 మంది హాజరయ్యారు. జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులకు 55 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు మొత్తం 5,635 మందికి 5441 మంది హాజరయ్యారు. 194 మంది గైర్హాజరయ్యారు. వీరిలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహించిన పరీక్షకు 3107 మందికి 2972 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహించిన పరీక్షకు 2528 మందికి గాను 2469 మంది హాజరయ్యారు.

కొల్లేటికోట హుండీ ఆదాయం రూ.9,93,961

కై కలూరు: రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కొల్లేటికోట పెద్దింట్లమ్మ హుండీల ఆదాయం రూ.9,93,961గా లెక్కించామని ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాస్‌ బుధవారం చెప్పారు. 113 రోజులకు భక్తులు కానుకుల రూపంలో హుండీలో వేశారన్నారు.

ఇంటింటా న్యాయ సేవలు

ఏలూరు (టూటౌన్‌): రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.సునీల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఇంటింటా న్యాయ సేవలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్‌ తెలి పారు. జిల్లా న్యాయసేవా సదన్‌ భవన్‌లో బుధవారం ఆయన మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 62 టీంలు ఏర్పాటు చేశామన్నారు. ఈ టీం సభ్యులు గ్రామాల్లో తిరుగుతూ బాలల సంక్షేమం, విభిన్న ప్రతిభావంతుల సౌకర్యాలపై తెలియజేస్తామన్నారు.

ఉద్రిక్తతకు దారి తీసిన స్థల వివాదం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక గన్‌బజార్‌ పెన్షన్‌ మహల్లా మసీద్‌ సమీపంలో ఓ ఇంటి స్థలం వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. పెన్షన్‌ మహల్లా మసీద్‌ కమిటీ సభ్యులు ఆ స్థలం మసీదుకు చెందుతుందని, వక్ఫ్‌ బోర్డు గెజిట్లో ఉందని పేర్కొంటున్నారు. ఆ ఇంట్లో ఉంటున్న వారు తాము కోర్టులో గెలిచామని ఇంజెక్షన్‌ ఆర్డర్‌ ఉందని ఇంటికి మరమ్మత్తు చేసుకుంటుం డగా మసీదు కమిటీ వారు వచ్చి నిలిపివేస్తున్నారని తెలిపారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో స్వల్ప తోపులాట జరిగింది. ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

నేడు కలెక్టరేట్‌లో సమావేశం

ఏలూరు(మెట్రో): తూర్పు–పశ్చిమ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా అభ్యర్ధులకు సూచనలు చేసేందుకు 13న సాయంత్రం 4 గంటలకు కలెక్టర్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. అభ్యర్ధులు తప్పక హాజరు కావాలని సహాయ రిటర్నింగ్‌ అధికారి కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement