![నారసింహునికి చందనోత్సవం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/12jrgdwa01-290069_mr-1739414911-0.jpg.webp?itok=uirOuQJV)
నారసింహునికి చందనోత్సవం
ద్వారకాతిరుమల: ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామికి చందనోత్సవాన్ని బుధవారం కనుల పండువగా నిర్వహించారు. ఈ వేడుకతో ఉగ్ర రూపంలో ఉన్న నారసింహుడు చందనలేపంతో సేదతీరారు. ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయానికి దత్తత దేవాలయమైన ఈ ఆలయంలో భీష్మ ఏకాదశి పర్వదినం నాడు ప్రారంభమైన స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున ఆలయంలో నిత్యహోమాలు, మూలమంత్ర హవనాలు జరిగాయి. అనంతరం స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకాలను ఆలయ అర్చకులు, పండితులు ఘనంగా నిర్వహించారు. ఆ తరువాత స్వామి మూలవిరాట్‌కు చందన మహోత్సవాన్ని వేద మంత్రోచ్ఛరణలతో వైభవంగా నిర్వహించారు. ఉగ్రరూపంలో ఉండే లక్ష్మీనారసింహుడిని శాంతింపజేసే క్రమంలో జరిగిన ఈ ఉత్సవాన్ని వీక్షించిన భక్తులు పరవశించారు. పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, నీరు, తేనెతో ముందుగా స్వామిని అభిషేకించారు. మహా పూర్ణాహుతి, కలశోద్వాసన, అపబృదం, ధ్వజ అవరోహణ కార్యక్రమాలు కనులపండువగా జరిగాయి. పెద్ద ఎత్తున మహిళా భక్తులు సుందరగిరిపై పాలపొంగళ్లను వండి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment