![638 సెల్‌ఫోన్ల రికవరీ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/12elr121-600791_mr-1739414911-0.jpg.webp?itok=4A5dajxx)
638 సెల్‌ఫోన్ల రికవరీ
బాధితులకు అందజేత
ఏలూరు టౌన్: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో బుధవారం సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న, చోరీకి గురైన వాటిని రికవరీ చేసి బాధితులకు ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చెప్పారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ విలువైన సెల్‌ఫోన్లు రికవరీ చేసి అందజేయడం పట్ల వారంతా సంతోషం వ్యక్తం చేశారు. గత మూడు నెలలుగా చోరీకి గురైన, పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను భారీ ఎత్తున రికవరీ చేశారు. 14వ దఫాలో భారీగా 638 సెల్‌ఫోన్లు రికవరీ చేసి బాధితులకు ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. రికవరీ చేసిన సెల్‌ఫోన్ల విలువ సుమారుగా రూ.76.56 లక్షలు ఉంటుందని అంచనా. పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, విశాఖపట్నం, తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాలతోపాటు తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలకు సైతం పోలీసులు వెళ్ళి సెల్‌ఫోన్లు రికవరీ చేశారు. ఈ ఐదేళ్ళ కాలంలో సుమారుగా 2,398 సెల్‌ఫోన్లు రికవరీ చేయగా.. వాటి విలువ మార్కెట్‌లో సుమారు రూ.4.06 కోట్ల పైనే ఉంటుందని అంచనా. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చోరీ కేసుల్లోని వస్తువులు కొనుగోలు చేసినా.. విక్రయించినా కఠినమైన శిక్ష తప్పదని హెచ్చరించారు. సైబర్ నేరాలు పెరుగుతోన్న తరు ణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. సెల్‌ఫోను చోరీ చేసే నేరగాళ్ళు ప్రధానంగా మీ అటెన్షన్ డైవర్ట్ చేస్తూ బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు, రైతు బజార్లు, రద్దీ ప్రదేశాల్లో చోరీలు చేస్తారని చెప్పారు. సెల్‌ఫోన్ రికవరీలో ప్రతిభ చూపిన పోలీస్ అధికారులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో సీసీఎస్ సీఐ సీహెచ్ రాజశేఖర్, వన్‌టౌన్ సీఐ జీ.సత్యనారాయణ, త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment