![పోలింగ్ విధులు బాధ్యతగా నిర్వర్తించాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/12elr100-290007_mr-1739414911-0.jpg.webp?itok=C6C6p4lO)
పోలింగ్ విధులు బాధ్యతగా నిర్వర్తించాలి
ఏలూరు(మెట్రో): ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ విధులను బాధ్యతగా స్వీకరించి నిష్పక్షపాతంగా పనిచేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి పోలింగ్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికలపై పీఓలు, ఏపీఓలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో వెట్రిసెల్వి, ఎన్నికల పరిశీలకురాలు కె. సునీత, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికకు ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. 3,14,984 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకుంటారని తెలిపారు. ఏలూరు జిల్లా పరిధిలో 62 పోలింగ్ కేంద్రాల్లో 42,282 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో పురుషులు 24,704 మంది, మహిళలు 17,571 మంది, ట్రాన్స్‌జెండర్లు ఏడుగురు ఉన్నారని తెలిపారు. పోలింగ్ ముందురోజు ఏలూరులో డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో పోలింగ్ సామగ్రిని అందజేస్తామని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ అనంతరం బ్యాలెట్ బాక్సులు పోలింగ్ సామగ్రితో సహా ఏలూరులో ఉన్న స్ట్రాంగ్ రూంకి జాగ్రత్తగా చేర్చాలన్నారు.
మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం
ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని ఎన్నికల పరిశీలకురాలు కె.సునీత పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన మొదటి శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ కె.వెట్రిసెల్వితో కలిసి ఆమె పాల్గొన్నారు.
నేడు నామినేషన్ల ఉపసంహరణ
ఏలూరు(మెట్రో): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియలో భాగంగా నేడు నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం జరగనుంది. ఇంతవరకు 54 మంది నామినేషన్‌లు దాఖలు చేయగా, 11 మంది నామినేషన్లు తిరస్కరించారు. గురువారం సాయంత్రం తుది జాబితా అందనుంది. 27 న పోలింగ్ నిర్వహించనుండగా, మొత్తం 3,14,984 అభ్యర్థులు ఓటు హక్కును వినియోగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment