ఈ ఉగాది సంవత్సరాన ఈ రాశి వారికి ప్రమోషన్‌ అవకాశమే | Sakshi
Sakshi News home page

ఈ ఉగాది సంవత్సరాన ఈ రాశి వారికి ప్రమోషన్‌ అవకాశమే

Published Sun, Apr 7 2024 11:00 AM

Ugadi Panchangam 2024 - Sakshi

మకర రాశి

ఆదాయం–14 , వ్యయం–14 , రాజయోగం–3  , అవమానం–1 .
ఉత్తరాషాఢ 2,3,4 పాదములు (బొ, జా, జీ)
శ్రవణం 1,2,3,4 పాదములు (జే, జో, ఖా, ఖొ)
ధనిష్ఠ 1,2 పాదములు (గా, గి)

గురువు మే 1 వరకు మేషం (చతుర్థం)లోను తదుపరి వృషభం (పంచమం)లోనూ సంచరిస్తారు. శని కుంభం (ద్వితీయం)లోను రాహువు మీనం (తృతీయం)లోను కేతువు (భాగ్యం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో ఎక్కడా ఆటంకాలు ఉండవు. సమయపాలన బాగా చేస్తుంటారు. ఏలినాటి శని చివరి సమయంలో ఉన్నది. గురుబలం అనుకూలత దృష్ట్యా అంతా మంచి ఫలితాలు ఉంటాయి. మీ వ్యక్తిగత గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ఉండేలాగ మీరు సహవాసాలు నడుపుకోండి. తరచుగా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనవలసి ఉంటుంది. స్వబుద్ధితో చేసే కార్యములు అన్నీ విజయమే అందిస్తాయి. తరచుగా పుణ్యక్షేత్ర సందర్శన నిమిత్తం ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగ విషయాలలో అధికంగా తిరగవలసి ఉంటుంది. మార్కెటింగ్‌ వారికి మరీ ఎక్కువగా ఈ తిరుగుడు ఉంటుంది. అయితే అది లాభదాయకమే. 

ప్రమోషన్, ట్రాన్స్‌ఫర్‌ ప్రయత్నాలు మే నెల తరువాత చాలా సానుకూలం అవుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో ఊహాతీతంగా లాభదాయక వార్తలు వింటారు. వ్యాపారులు స్వబుద్ధి, స్థిరబుద్ధి ప్రదర్శించిన వారికి మే నెల నుంచి అంతా శుభపరిణామాలే ఉంటాయి. కుటుంబ విషయాలు చూస్తే స్వంత బంధువర్గం మిమ్మల్ని అపార్థం చేసుకోవడం లేదా మీరు వారిని అపార్థం చేసు కోవడం జరుగుతుంది. అయితే క్రమేణా గురుబలం వలన అవి సమసి పోతాయి. పిల్లల విషయంలో మీ అంచనాలు చక్కటి ప్రతిఫలం చూపుతాయి. మీ కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో కూడా అనుకూలం అవుతాయి. అనుకోకుండానే వాహన లాభం పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే గురుబలం దృష్ట్యా మంచి ఫలితాలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలలో ఉన్నవారికి వేగంగా పనులు పూర్తవుతాయి. 

పాత ఋణాలు తీర్చే విషయంలోను, అవసరమైన కొత్త ఋణాలు పొందే విషయంలోనూ గ్రహచారం బాగా అనుకూలిస్తుంది. తరచుగా శుభవార్తలు వింటారు. గురువులను పూజ్యులను కలుస్తారు. విద్యార్జనపై ఆసక్తి కలుగుతుంది. ఆరోగ్య విషయంగా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఏదేని పాత సమస్యలు ఉంటే వాటికి మంచి వైద్యం లభిస్తుంది. బాగా జాగ్రత్తలు వహించి ఎటువంటి సమస్యలు రాకుండా కాలక్షేపం చేస్తారు. ఈ రాశికి చెందిన స్త్రీలకు అన్ని రంగాలలోనూ అభివృద్ధి ఉంటుంది. ప్రధానంగా గురుబలం దృష్ట్యా కుటుంబ విషయాలలో మంచి విజయం అందుకుంటారు. అలంకరణ వస్తు కొనుగోలు కోరిక తీరుతుంది.

గర్భిణీ స్త్రీల విషయమై అంతా శుభపరిణామాలే గోచరిస్తున్నాయి. చక్కటి ఆరోగ్యస్థితి ఉంటుంది. షేర్‌ వ్యాపారులకు లాభదాయకమైన కాలం. ఎటువంటి చాంచల్యమూ లేని స్థిర ఆలోచనలు విజయాన్నిస్తాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి కాలం కలసి వస్తుంది. విద్యా విషయంగా వెళ్ళేవారికి లాభం ఎక్కువ. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి పనులు ఆలస్యం. శ్రమాధిక్యతతో లాభాన్నిస్తాయి. విజయం తథ్యము. స్థిరాస్తి కోనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు పూర్తి అవుతాయి కానీ ఆలస్యం చోటు చేసుకుంటుంది. విద్యార్థులకు విద్యా వ్యాసంగం మీద దృష్టి స్థిరంగా ఉంచితే గురుబలం వలన మంచి విజయాలు అందుకుంటారు. రైతుల విషయంలో అంతా శుభప్రదమే. మంచి సూచనలు, సలహాలు అందుకుని లాభం పొందుతారు.

ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3,4 వారు నిత్యం చేసే పనికి పొందే ఫలితానికి పొంతనలేని స్థితి ఉంటుంది. ఖర్చులు నియంత్రించలేక ఇబ్బంది పడతారు. అవసరానికి కావలసిన ధనం సర్దుబాటు కాక పనులు వాయిదా వేయవలసిన స్థితి ఉంటుంది. శ్రవణం నక్షత్రం వారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి, ఆలస్యంగానైనా ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో అద్భుత ఫలితాలు అందుకుంటారు. ఖర్చులు నియంత్రించడంలో విఫలం అవుతారు.  ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలవారు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి పనిలోనూ వాయిదా వేసే లక్షణాలు ప్రదర్శిస్తారు. అనవసర విషయాలలో చర్చలు భయం, అవమానం కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది.

శాంతి మార్గం: అమ్మవారి అర్చన చేయండి. రోజూ సుబ్రహ్మణ్య, దుర్గాపూజలు చేస్తుండండి. ‘శ్రీమాత్రే నమః’ నామంతో ధ్యానం చేయడం, సుందరకాండ శ్రవణం చేయడం మంచిది. శని జపం చేయించండి.

ఏప్రిల్‌: ఈనెల అన్ని రంగాలవారికీ కాలం కలసి వస్తుంది. 3వ వారంలో కొన్ని సమస్యలు ఎదురైనా, మనోధైర్యంతో ఎదుర్కొంటారు. స్థిరాస్తి ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహంలో కొంత అలజడి ఉంటుంది. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. షేర్‌ వ్యాపారులు లాభపడతారు. విదేశీ ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. స్థిరాస్తి ప్రయత్నాలలో కాలం అనుకూలం.

మే: ఈ నెల పనులు సానుకూలంగా సాగుతాయి. ఆర్ధిక స్థితిగతులు మెరుగుపడతాయి. విలాస జీవితం గడుపుతారు. కుటుంబంలో స్వల్ప మనస్పర్థలు ఏర్పడతాయి. శివ–విష్ణు స్తోత్రపారాయణ శుభప్రదం. విదేశీ ప్రయత్నాలలో మంచి సలహాలు అందవు. షేర్‌ వ్యాపారులకు అనుకూలం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త పథకాల రూపకల్పనకు, స్థిరాస్తి కొనుగోలుకు మంచి కాలం. పెద్దవారి ఆరోగ్యం బాగుండటం, పిల్లల అభివృద్ధి వలన సుఖపడతారు.

జూన్‌: ఈ నెల అత్యంత అనుకూలం. అన్ని రంగాలవారు అభివృద్ధి చెందుతారు. ఉద్యోగంలో బదిలీలు అనుకూలం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. మొండి బాకీల వసూలవుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలలో ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. షేర్‌ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. 

జులై: ఈనెల గ్రహ సంచారం ప్రతికూలంగా ఉంది. ఎదుటి వారి మేలు కోసం మీరు చేసే పనుల వలన ఇబ్బందులు తప్పవు. అందరూ మీతో విరోధిస్తారు. వ్యాపారం గతం కన్నా తగ్గుతుంది. నవగ్రహారాధన మంచిది. ఋణ సమస్యలు విచిత్రంగా ఉంటాయి. ఇతరుల సహకారం తక్కువగా ఉంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువ అయినా, ఇబ్బంది ఉండదు. షేర్‌ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు ఇబ్బందులు ఉండవు.

ఆగస్ట్‌: ఈనెల ప్రథమార్ధం ఎటువంటి సమస్యలు లేక సామాన్యంగా ఉంటుంది. ద్వితీయార్ధంలో పనులన్నిటా ఆటంకాలు ఎదురవుతాయి. 4వ వారంలో శుభాలు కలుగుతాయి. వృత్తిలో రాణిస్తారు. అనవసర విషయాలలో కలగ చేసుకొని కలహాలు తెచ్చుకుంటారు. మీ మాటకు గౌరవం తగ్గుతుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఉంటుంది. షేర్‌ వ్యాపారులకు, రైతులకు, విద్యార్థులకు అనుకూలత తక్కువ. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది.

సెప్టెంబర్‌: ఈ నెల అనేక శుభాలు జరుగుతాయి. వ్యాపార లబ్ధి. వృత్తిలో ఆటంకాలను అధిగమిస్తారు. స్థిరాస్తి, కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. భూ వాహన కొనుగోలుకు అనుకూలం. శుభకార్య ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. గురువులను సందర్శిస్తారు. షేర్‌ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం.

అక్టోబర్‌: ఉద్యోగ వ్యాపారాలలో రాణిస్తారు. అధికారయోగం ఉంది. రాజకీయవేత్తలకు అనుకూలం. ప్రభుత్వ సంబంధ పనులు పూర్తవుతాయి. దాంపత్య జీవితంలో తెలియని అశాంతి. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారులకు అనుకోని లాభాలు. విద్యార్థులకు మంచి కాలం. షేర్‌ వ్యాపారులు అద్భుతంగా రాణిస్తారు. నెల అంతా పుణ్య, శుభకార్యాలు నిర్వహిస్తారు.

నవంబర్‌: ఈనెల శుభ ఫలితాలు కలుగుతాయి. రాజకీయవేత్తలకు ఉన్నత పదవులు. ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. ఇప్పటి నుంచి 5 నెలల పాటు జీవిత, వ్యాపార భాగస్వాములతో విభేదాలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కుజ శాంతి చేయాలి. అధికారుల సహాయంతో ప్రమోషన్లు, స్థానచలనాల్లో లాభం అందుకుంటారు. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి ప్రయత్నాలు లాభదాయకం. షేర్‌ వ్యాపారులకు అనుకూలం. పుణ్యక్షేత్ర సందర్శన, గురువుల సందర్శన చేసుకుంటారు. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారు.

డిసెంబర్‌: ఈనెల అన్ని రంగాలవారికీ అనుకూలమే. వ్యాపారలబ్ధి. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. 16వ తేదీ తరువాత స్వయంకృతాపరాధం అన్నట్లుగా కొన్ని పనులు పాడు చేసుకుంటారు. కోర్టు వ్యవహారాలు, ఇతర చికాకులు 16వ తేదీ నుంచి పెరుగుతాయి. షేర్‌ వ్యాపారులకు, ఫైనాన్స్‌ వ్యాపారులకు, విద్యార్థులకు మంచి జరుగుతుంది. 

జనవరి: ఈనెల వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారం మధ్యస్థంగా ఉంటుంది. అకాల భోజనం వలన ఆరోగ్య సమస్యలు. షేర్‌ వ్యాపారులకు అనుకూలం కాదు. ఫిబ్రవరి: వ్యాపారం లాభ దాయకంగా ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వ్యవహార ప్రతిబంధకాలు ఉంటాయి. ఉద్యోగులు ప్రమోషన్‌ కోసం చేసే ప్రయత్నం సఫలం అవుతుంది. షేర్‌ వ్యాపారులకు, ఫైనాన్స్‌ వ్యాపారులకు, విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఫలితాలుంటాయి. మార్చి : ఈ నెల ఎక్కువ శుభపరిణామాలు జరుగుతాయి. అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. నూతన పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విష్ణు ఆరాధన శ్రేయస్కరం.

Advertisement
Advertisement