బాహుమూలాల్లో గడ్డలు! ఎందువల్ల వస్తుందనేది క్లారిటీ లేదు కానీ.. | Hidradenitis suppurativa Symptom And Causes | Sakshi
Sakshi News home page

బాహుమూలాల్లో గడ్డలు! ఎందువల్ల వస్తుందనేది క్లారిటీ లేదు కానీ..

Published Sun, Jul 2 2023 8:49 AM | Last Updated on Sun, Jul 2 2023 8:49 AM

Hidradenitis suppurativa Symptom And Causes - Sakshi

హైడ్రడెనైటిస్‌ సపరేటివా అనే సమస్య ఎందుకు వస్తుందో ఇదమిత్థంగా తెలియకపోయినా... సాధారణంగా వెంట్రుకలు ఎక్కువగా ఉండేవారిలో, అధికంగా చెమటలు పట్టేవారిలో, కుటుంబ చరిత్రలో అప్పటికే ఈ సమస్య ఉన్నవారి పిల్లల్లో ఇది ఎక్కువగా వస్తున్న దాఖలాలు ఉన్నాయి.

పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య మూడింతలు ఎక్కువగా ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. పైగా వాళ్లలో అదనంగా రొమ్ము మడతల్లోనూ వచ్చే అవకాశం ఉంది. యౌవనం (ప్యూబర్టీ) నుంచి 40 ఏళ్లలోపు ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. ఇన్‌ఫ్లమేషన్‌తో ఎర్రగా కనిపించే ఈ గడ్డలను చూస్తే... అది అంటుకుంటాయేమోనన్న ఆందోళన కలుగుతుంది. కానీ ఇది అంటువ్యాధి కానేకాదు. 

‘హైడ్రడెనైటిస్‌ సపరేటివా’కు దారితీసే మరికొన్ని కండిషన్స్‌ 

  • మహిళల్లో స్రవించే ఈస్ట్రోజెన్, పురుషుల్లోని యాండ్రోజెన్‌ హార్మోన్లలో అసమతౌల్యత;
  • పొగతాగే అలవాటు
  • స్థూలకాయం 

గడ్డలు వచ్చే మరికొన్ని ప్రదేశాలు... 
పైన పేర్కొన్న చంకలు, గజ్జలు, రొమ్ముప్రాంతాలే కాకుండా... నడుము చుట్టూరా,  లోతొడలు, పిరుదులు, మలద్వారం ప్రాంతంలోనే కాకుండా మెడ దగ్గర కూడా రావచ్చు. 

హెచ్‌ఎస్‌తో కనిపించే ఇతర దుష్ప్రభావాలు... 

  • రిపీటెడ్‌ ఇన్ఫెక్షన్స్‌
  • మలద్వారం వద్ద గడ్డలు వచ్చినప్పుడు ఫిస్టులా వంటి కండిషన్లకు దారితీయవచ్చు. 

చికిత్స: ఇది పూర్తిగా తగ్గిపోవడానికి నిర్దిష్టంగా చికిత్స లేదుగానీ... నియంత్రణకు, ఇబ్బంది/నొప్పి తగ్గించడానికి మందులు వాడాల్సి ఉంటుంది. సమస్య తీవ్రతనూ, ఇబ్బంది ఉన్న చోటిని బట్టి డాక్టర్లు మందులు సూచిస్తారు.

ఉదాహరణకు...  

  • చర్మరక్షణ (స్కిన్‌ కేర్‌)కు...  
  • బాగా చెమటలు పట్టేవారిలో యాంటిపెరిస్పిరెంట్స్‌
  • సమస్య వచ్చిన చోట శుభ్రం చేసేందుకు యాంటిసెప్టిక్‌ వాష్‌
  • ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించేందుకు విటమిన్‌–ఏ వంటి వాటిని సూచించాల్సి ఉంటుంది. 

నొప్పి నివారణకు... 

  • నొప్పిని తగ్గించేందుకు నొప్పి నివారణ మందులు (పెయిన్‌ కిల్లర్స్‌)
  • గడ్డలు పగిలిన చోట ఇన్ఫెక్షన్స్‌ నివారించేందుకు యాంటీబయాటిక్స్‌
  • వేడి కాపడం పెట్టడం 

‘హైడ్రడెనైటిస్‌ సపరేటివా’ నివారణ ఇలా... 

హెచ్‌ఎస్‌ నివారణ కోసం సూచనలు...  
ఆహార నియమాల్లో భాగంగా చాకెట్లు, స్వీట్లు, వేపుళ్లు (ఫ్రైడ్‌ ఫుడ్స్‌), జంక్‌ఫుడ్స్‌ తగ్గించుకోవడం మంచిది.
బాగా చెమటలు పట్టే గుణం ఉన్నవారు  చెమటలు తగ్గించుకునేందుకు వీలుగా ఎప్పుడూ చల్లటి చోట్ల ఉండాలి.
ఇందుకు వీలుగా వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.
స్థూలకాయులు, ఎక్కువ బరువున్నవారు ఎత్తుకు తగినట్లుగా బరువు ఉండేలా నియంత్రించుకోవాలి.
పొగతాగే అలవాటు ఉన్నవారు తక్షణం ఆ అలవాటు మానేయాలి. మద్యం కూడా మానేయడం అవసరం. 

లక్షణాలు... 
వెంట్రుక మొదల్లో స్వేదరంధ్రం దగ్గర నల్లటి మొటిమ (బ్లాక్‌హెడ్‌)లా వృద్ధి చెందడం..  
బఠాణీ గింజ సైజులో గడ్డ వస్తుంది. మొదట ఒకటిగా మొదలై... తర్వాత వారాలు, నెలలు గడిచేకొద్దీ గుత్తుల్లా కనిపించవచ్చు.
గడ్డ బాగా పెరిగాక ఒక్కోసారి పగిలి చీము, నెత్తురు స్రవించే అవకాశమూ ఉంది.
ఇలా పగిలిన చోటి నుంచి చర్మం కింద సన్నటి దారుల్లా (టన్నెల్స్‌లా) ఏర్పడే అవకాశముంది. ఈ లక్షణాలన్నీ ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపిస్తాయి. కొంతమందిలో లక్షణాలు చాలా తక్కువగా ఉంటే, మరికొందరిలో తీవ్రంగా కనిపించవచ్చు. ఇది ప్రాణాంతకం కాకపోయినప్పటికీ తీవ్రమైన నొప్పి కలిగిస్తుంది. సమస్య తీవ్రత ఎక్కువగా ఉండటం, కదలడానికీ, కాళ్లు, చేతులు కదిలించడానికి ఇబ్బంది పడటం, ఒకేచోట గుత్తులు గుత్తులుగా రావడం, పగిలాక చారలు (స్కార్స్‌) ఏర్పడి నొప్పి, ఇబ్బందితో పాటు కాస్మటిక్‌గా అసహ్యంగా కనిపించినప్పుడు డర్మటాలజిస్ట్‌ను తప్పక సంప్రదించాలి. 

అదనంగా వాడాల్సిన మరికొన్ని మందులు... 
ఇమ్యూనిటీని మెరుగుపరచేందుకు అడాలిముమాబ్‌ వంటి బయలాజికల్స్‌ వాడాల్సి ఉంటుంది.
ఇన్ఫెక్షన్స్‌ను అరికట్టేందుకు ఓరల్‌ యాంటిబయాటిక్స్‌ వాడాల్సి వస్తుంది.
వీటితో పాటు బొటాక్స్‌ ఇంజెక్షన్లతోనూ, లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ ప్రక్రియలతోనూ, లేజర్‌ చికిత్సల ద్వారా కూడా చికిత్సలు అందించాల్సి వస్తుంది.  





---డాక్టర్‌ స్వప్న ప్రియ,
   సీనియర్‌ డర్మటాలజిస్ట్‌


(చదవండి: నిరంతరం కాళ్లు కదిలిస్తూ ఉండే..రెస్ట్‌లెస్‌ లెగ్‌ సిండ్రోమ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement