ఆంధ్రప్రదేశ్‌లోని రెండు పరిణామాల నేపథ్యంలో న్యాయవ్యవస్థ సామాన్య ప్రజల్లో అనేక సందేహాలను రేపింది. నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్‌గా ఉన్నప్పుడు అవసరం లేని కోడ్ ఇప్పుడే కావాలని ప్రతిపక్షాలు ఎందుకు డిమాండ్ చేశాయి? ఎన్నికలను బహిష్కరించామని చెప్పిన టీడీపీ కోడ్ అంటూ కోర్టుకు ఎందుకు వెళ్లింది? నిమ్మగడ్డ ఎన్నికలను పూర్తి చేయకపోవడంలో ఉన్న కుట్ర ఏమిటని ఏ కోర్టు ఎందుకు ప్రశ్నించలేదు? మరోవైపు రఘురామకృష్ణరాజు లాంటి కేసుల్లో మరికొందరికి బెయిల్ రానప్పుడు ఈయనను ప్రత్యేకంగా చూడవలసిన అవసరం ఏమిటి? న్యాయ వ్యవస్థ ఇలాంటి సందేహాలకు ఆస్కారం ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను హైకోర్టు రద్దు చేయడం, నరసా పురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు కఠిన షరతులతో బెయిల్ ఇవ్వడం... ఈ రెండు ఘటనలు చర్చనీయాంశం అయ్యాయి. ఏపీలో స్థానిక ఎన్నికలు గత ఏడాదికాలంగా నలుగుతున్నాయి. అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రతి చర్యను న్యాయవ్యవస్థ దాదాపు సమర్థించింది. ఆయన కరోనా కేసులు తక్కువగా ఉన్న సమయంలో ఎన్నికలు వాయిదా వేస్తే, ప్రభుత్వం అప్పీలుకు వెళ్లినా కమిషన్ నిర్ణయాలలో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానాలు ప్రకటించాయి. తిరిగి కరోనా కేసులు వేల సంఖ్యలో వస్తున్న సమయంలో నిమ్మగడ్డ ఎన్నికలు పెడుతున్నట్లు ప్రకటిం చారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఎన్నికలు పెట్టుకో వచ్చని ప్రభుత్వం కోర్టును ఆశ్రయిస్తే ఒక్క సింగిల్ బెంచ్ కోర్టు తప్ప, డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టు కూడా ఎన్నికల కమిషనర్ చర్యనే సమర్థించాయి. అప్పుడు కూడా ఎన్నికల కమిషన్ నిర్ణయాలలో జోక్యం చేసుకోబోమని అన్నారు. అయితే నిమ్మగడ్డ ముందుగా పెట్టవలసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కాకుండా పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలను నిర్వహించారు. దానికి ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదు. ఆ ఎన్నికలలో అత్యధికంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గెలుచుకుంది. కారణం ఏమైనా నిమ్మగడ్డ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టలేదు సరికదా ఎన్నికల కోడ్‌ను కుట్రపూరితంగా ఎత్తివేశారు.
ఆ తర్వాత వారం రోజులకు కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సహానీ రావడం, ఆమె అదే రోజు ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడే విపక్షాలు లిటిగేషన్ పెట్టాయి. కోర్టులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేశాయి. గతంలో సుప్రీంకోర్టు ఎన్నికల కోడ్ సుదీర్ఘంగా కొనసాగడం సరికాదని, ఎన్నికలకు నాలుగువారాల ముందు పెట్టుకుంటే సరిపోతుందని నిమ్మగడ్డ కమిషనర్‌గా ఉన్నప్పుడు వ్యాఖ్యానించింది. ఈ పాయింట్ ఆధారంగా విపక్షాలు నాలుగు వారాలు కోడ్ అమలు చేశాకే ఎన్నికలు పెట్టాలని కోర్టుకు వెళ్లాయి. నిజానికి అంతకుముందు నుంచి ఎన్నికల కోడ్ ఉంది. మధ్యలో ఒక వారం మాత్రం కోడ్ ఎత్తివేశారు. నిమ్మగడ్డ, టీడీపీ కలిసి ఈ కుట్ర చేశారన్నది వైసీపీ అభియోగం. ఎన్నికల కోడ్ పాయింట్‌పై హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కమిషన్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి ఎన్నికలను ఆపుచేయాలని ఆదేశించింది. అంతకుముందు ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థ అని పేర్కొన్న న్యాయ వ్యవస్థ ఈసారి మాత్రం ఎన్నికలనే ఆపేసింది. దానిపై ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేశాయి. డివిజన్ బెంచ్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కౌంటింగ్ మాత్రం సింగిల్ బెంచ్‌లో నిర్ణయించుకోవాలని తీర్పు ఇచ్చింది. దాంతో ఎన్నికలు జరిగి, ఓట్ల లెక్కింపు ఆగిపోయింది. ఈ తరుణంలో మళ్లీ సింగిల్ బెంచ్ ఏకంగా ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
గతంలో నిమ్మగడ్డ కూడా నెలరోజుల నిబంధనను పాటించ లేదు. మరి అప్పుడు అవసరం లేని కోడ్ ఇప్పుడే కావాలని ప్రతి పక్షాలు ఎందుకు డిమాండ్ చేశాయి? ఒక వైపు ఎన్నికలను బహిష్క రించామని చెప్పిన టీడీపీ కోడ్ అంటూ కోర్టుకు ఎందుకు వెళ్లింది? మరోవైపు డివిజన్ బెంచ్ ఎందుకు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది? సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం నెలరోజుల కోడ్ కచ్చితంగా పాటించాలని ఉంటే డివిజన్ బెంచే ఎన్నికలను ఆపి ఉంటే కోట్ల రూపాయల వ్యయం, ఎంతో ప్రయాస ఉండేవి కావు కదా? లేదా కౌంటింగ్‌కు సంబంధించి కూడా ఆదేశాలు ఇచ్చేసి ఉంటే ఇప్పుడు ఈ వివాదం ఉండేది కాదు కదా? మళ్లీ సింగిల్ బెంచ్ జడ్జి వద్దకు ఎందుకు వెళ్లమన్నారు? ఒకసారి డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకగా సింగిల్ బెంచ్ ఎన్నికల రద్దు తీర్పు ఇవ్వవచ్చా? అంతేకాక అప్పటి కమిషనర్ నిమ్మగడ్డ ఎందుకు ఎన్నికలను పూర్తి చేయలేదని, అందులో ఉన్న కుట్ర ఏమిటని ఏ కోర్టు ఎందుకు ప్రశ్నించలేదు. గతంలో నిమ్మగడ్డ నెలరోజుల కోడ్ అనుసరించక పోయినా ఎందుకు తప్పుపట్టలేదు? కానీ కొత్త కమిషనర్ నీలం సహానిపై అంత తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉందా?
ఇక రఘురామకృష్ణరాజు కేసు విషయానికి వద్దాం. అరెస్టు చేసిన వెంటనే ఆయన వాయువేగంతో హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేయడం, దానిపై హైకోర్టు విచారించి బెయిల్ నిరాకరించడం, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు కూడా అంతే వేగంగా వెళ్లడం, షరతులతో బెయిల్ ఇవ్వడం ఆసక్తికరమైన అంశమే. బెయిల్ కోసం వేల పిటిషన్లు పెండింగులో ఉన్నాయని ఏపీ సీఐడీ తరపు న్యాయవాది దుష్యంత్ దవే చెప్పడమే దీనికి ఉదాహరణ. అరెస్టు అయిన మరుసటి రోజు మధ్యాహ్నం వరకు తనను పోలీసులు కొట్టినట్లు చెప్పని రఘురామకృష్ణరాజు హైకోర్టులో బెయిల్ రాలేదని తెలిసిన తర్వాత, మేజిస్ట్రేట్ కోర్టులో తనను పోలీసులు కొట్టారని ఆరోపించారు. తన కాళ్లు కూడా చూపించారు. కానీ ఆయన అంతకుముందు కారులో దిగి ఏ ఇబ్బంది లేకుండా నడవగలిగారు. చిత్రంగా ఆ కోర్టు వారు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేసిన తర్వాత రమేష్ ఆస్పత్రికి తరలించి కూడా పరీక్షలు చేయించాలని ఆదేశించారు. అది చట్ట ప్రకారం చెల్లదన్నది న్యాయ నిపుణుల వాదన. ఈలోగా ఏపీ హైకోర్టువారు ఈ అంశాన్ని స్వీకరించి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ బోర్డువారు పరీక్షలు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఈలోగా కేసు సుప్రీంకోర్టుకు చేరింది. అక్కడ రఘురామ కృష్ణరాజును సీఐడీ పోలీసులు కొట్టారన్న ఆరోపణను కోర్టు సీరియస్‌గా తీసుకుంది. వారు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడికి ఎంపీ తన సొంతకారులో వెళ్లడం విశేషం. ఆర్మీ నివేదికలో గుంటూరు వైద్యుల నివేదికలోని అంశాలతో పాటు కాలివేలుకు గాయం ఉన్నట్లు రాశారు. అది ఎలా ఏర్పడిందన్నది తెలపలేదు. రాజు తరపు న్యాయవాది సీఐడీ వారే కొట్టారని వాదించగా, ప్రభుత్వ న్యాయవాది ఎంపీనే ఆ గాయం చేసుకుని ఉండవచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. వాదోపవాదాలు జరిగిన తర్వాత కోర్టువారు ఈ అంశాన్ని పక్కన పెట్టడం ఆసక్తికరం. ఎంపీ ఆరోగ్య పరిస్థితిని గమనంలోకి తీసుకుని బెయిల్ ఇస్తున్నామని చెప్పింది. అయితే ఆయన మీడియాతో మాట్లాడరాదని, సీఐడీ విచారణకు హాజరు కావాలని కండిషన్లు పెట్టింది. కానీ రాజు మీద ఏ సెక్షన్‌లు అయితే పోలీసులు పెట్టారో, అవే సెక్షన్‌లతో కేసులలో ఉన్న మరికొందరికి ఇదే కోర్టు ఇంతవరకు బెయిల్ ఇవ్వలేదట. అలాంటప్పుడు రఘురామకృష్ణరాజును ప్రత్యేకంగా చూడవలసిన అవసరం ఏమిటన్న ప్రశ్న వస్తుంది. కండిషన్లు పెట్టిన తీరు మాత్రం ప్రభుత్వానికి కొంత ఉపశమనమే. బెయిల్ ఇచ్చినా, కేసును కోర్టు తోసిపుచ్చలేదన్నమాట.
అంటే రఘురామకృష్ణరాజు, ఆ తర్వాత రెండు టీవీ చానళ్లు భవిష్యత్తులో మళ్లీ ఏవైనా తీర్పులు వస్తే తప్ప ఈ కేసును ఎదుర్కోవలసి ఉంటుందని భావించవచ్చు. ఈలోగా హైకోర్టులో కూడా ఈ కేసు విచారణ జరిగింది. చిత్రంగా కింది కోర్టులో రమేష్ ఆస్పత్రికి రాజును పంపించాలని ఆదేశిస్తే ఎందుకు పంపలేదని డివిజన్ బెంచ్ ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగించింది. అక్కడితో ఆగకుండా సీఐడీ ఉన్నతాధికారికి, మరికొందరికి కోర్టు ధిక్కార నోటీసులు ఇస్తున్నామని చెప్పడం విస్మయపరిచింది. ఒక పక్క సుప్రీంకోర్టు ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని ఆదేశాలు ఇచ్చిన తర్వాత హైకోర్టు ఇలాంటి ఆదేశాలు ఇవ్వవచ్చా? న్యాయ వ్యవస్థ ఇలాంటి సందేహాలకు ఆస్కారం ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్లు కనిపించాలన్నది ఒక సూత్రం. మరి మన దేశంలో న్యాయ వ్యవస్థ అలాగే ఉందా?
వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్ పాత్రికేయులు
తీర్పుల తీరుతెన్నులపై సందేహాలెన్నో!
Published Wed, May 26 2021 3:00 AM | Last Updated on Wed, May 26 2021 3:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment