అనేక రకాల పోరాటాల ఫలితంగా భారతదేశంలో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టినది యూపీఏ–1 ప్రభుత్వం. అప్పట్లో ఆ పథకాన్ని యూపీఏలోని నయా ఉదార వాద లాబీ తీవ్రంగా వ్యతి రేకించింది. అయినప్పటికీ, ఆ ప్రభుత్వపు మనుగడ వామ పక్షాల మద్దతు మీద ఆధారపడి ఉంది కాబట్టి వామపక్షాలు గట్టిగా పట్టు పట్టడంతో... ప్రభుత్వానికి ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపెట్టక తప్పలేదు. మొదటి నుంచీ అమలులో ఈ పథకాన్ని చిన్నచూపు చూస్తూ వచ్చారు. ఒక ఏడాది కాలంలో కేవలం 100 రోజుల పని కల్పించడానికి మాత్రమే గ్యారంటీ ఇచ్చారు. అది కూడా కుటుంబంలోని ఒక వ్యక్తికి మాత్రమే కల్పిస్తామన్నారు. ఈ పరిమితులు ఉన్నప్పటికీ, ఆ పథకం ప్రజలకు ఒక ఆర్థిక హక్కును కల్పించింది. ఉపాధి కల్పించడాన్ని ప్రభుత్వం నిరాక రించడం కుదరదు. ఒక నిర్ణీత కాలంలోపు గనుక ఉపాధిని కల్పించకపోతే ఆ ఉపాధి కోరుకున్న వ్యక్తికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కానీ నేడు కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని రోజు రోజుకీ నీరుగారుస్తున్న వైనం చూస్తుంటే, ఈ పథకం మనుగడే ప్రశ్నార్థకం అనిపిస్తున్నది.
యూపీఏ–2 హయాం నుండే ఉపాధి హామీ పథ కాన్ని నీరుగార్చడం మొదలైంది. చాలా సంవత్సరాల పాటు బడ్జెట్లలో ఈ పథకానికి కేటాయింపు రూ. 60,000 కోట్ల దగ్గరే ఉండిపోయింది. అంటే పెరిగే ధరలకు అనుగుణంగానైనా కేటాయింపులను పెంచలేదన్నమాట. పార్లమెంటులో పెంపుదల గురించిన ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ఉపాధి కోరిన ప్రతీ వారికీ ఈ పథకంలో పని కల్పించాలి గనుక బడ్జెట్‌లో ఎంత కేటాయించామనేది ప్రాధాన్యం లేని అంశమని, ఎంత మంది ఉపాధి కోరితే అంతమందికీ పని కల్పించేలా వాస్తవ కేటాయింపులు ఉంటాయని ప్రభుత్వం సమా ధానం చెప్తూ ఉండేది. దాటవేత ధోరణి అనుసరిస్తూ ఉంది.
ఇక ఈ విషయంలో మోదీ ప్రభుత్వ ధోరణి సంగతికి వస్తే... ఉపాధి హామీ పథకాన్నే తొలినాళ్ళలో మోదీ వ్యతిరేకించారు. అయితే అధికారంలోకి వచ్చాక దానిని రద్దు చేసే సాహసం చేయలేదు. కానీ అంతకంతకూ తక్కువ కేటాయింపులతో ఆ పథకానికి ఉచ్చు బిగిస్తూ వచ్చారు. 2019–20లో ఆ పథకం కింద అయిన వాస్తవ ఖర్చు రూ. 71,687 కోట్లు. కానీ 2020–21లో కేటాయించింది రూ. 61,500 కోట్లు మాత్రమే. నిజానికి ఆ సంవత్సరంలో లాక్‌డౌన్ కార ణంగా పట్టణాల్లో పనులు పోయి గ్రామాల బాట పట్టినవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వారందరూ తలదాచుకునే చోటు గాని, చేయడానికి పనిగాని లేక అల్లల్లాడిపోయారు. ఎంతో కొంతమేరకు వారిని ఆదుకున్నది ఉపాధి హామీ పథకం మాత్రమే. దాంతో ఉపాధిహామీ పథకానికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.
ప్రభుత్వం ఆ ఏడాది వాస్తవంగా రూ. 1,11,500 కోట్లు కేటాయించక తప్పలేదు. ఆ మరుసటి ఏడాది, అంటే 2021–22లో మళ్ళీ బడ్జెట్ కేటాయింపు కోత పెట్టి రూ. 73,000 కోట్లకే పరిమితం చేశారు. ఇది ఆ ముందటి ఏడు చేసిన వాస్తవ ఖర్చు కన్నా రూ. 38,500 కోట్లు తక్కువ. అయితే నవంబరు 25న ప్రభుత్వం మరో రూ. 10,000 కోట్లను కేటాయి స్తామని ప్రకటించింది. కానీ ఇది ఏ మూలకూ చాలదు. నవంబరు 25 నాటికే కూలీలకు రూ. 9,888 కోట్లు బకాయిపడింది ప్రభుత్వం. ఇప్పుడు అదనంగా కేటాయించినది ఆ బకాయిలకే సరిపోతుంది. మరి ఏడాది పొడవునా పథకాన్ని కొనసాగించడం ఏ విధంగా సాధ్య పడుతుంది!
నిజానికి ప్రభుత్వం ఈ పథకం కింద ఖర్చుపెట్టే నిధుల్లో చాలా వరకు ప్రజల కొనుగోళ్ల ద్వారా జీఎస్టీ రూపంలో చాలావరకు తిరిగి ప్రభుత్వానికే చేరుతున్నదనే సంగతిని గుర్తించాలి.
- భూక్య నాగేశ్వరరావు
సామాజిక ఉద్యమకారుడు
Comments
Please login to add a commentAdd a comment