![సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీఓ శ్రీకర్ - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/14/13ptp01-150121_mr_1.jpg.webp?itok=_TmOA95S)
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీఓ శ్రీకర్
● మీ ఇన్‌చార్జి చెప్పినవి చేస్తూనే ఉన్నాం కదా.. ● టీడీపీ నాయకులపై ఆర్డీఓ శ్రీకర్ ఆగ్రహం
ప్రత్తిపాడు: ‘ఏం నన్ను భయపెడుతున్నారా.. అంటూ గుంటూరు ఆర్డీఓ పి.శ్రీకర్, టీడీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడులో మంగళవారం రాజకీయ పార్టీల నాయకులతో ఆర్డీఓ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి టీడీపీ నుంచి నియోజకవర్గంలోని ఐదు మండలాల నాయకులు హాజరయ్యారు. ఓట్ల తొలగింపునకు సంబంధించి వీరు ఒకరి తరువాత ఒకరు రకరకాల సమస్యలు పదే పదే చెబుతున్నారు. స్పందించిన ఆర్డీఓ మీ వద్ద ఆధారాలుంటే ఇవ్వండి. విచారించి అర్హత లేకుంటే తొలగిస్తాం. అంతేగానీ మీరంతా ఇలా ఒక్కసారి మూకుమ్మడిగా ప్రశ్నలు అడిగితే మేం సమాధానం ఎలా చెప్పాలంటూ ప్రశ్నించారు. అయినప్పటికీ ఆగకుండా ఇలా పదేపదే పలు సమస్యలు లేవనెత్తుతుండటంతో ఆర్డీఓ తీవ్ర అసహనానికి గురయ్యారు. మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకునేట్లయితే బయటకు వెళ్లిపోవచ్చని చెప్పారు. దీంతో టీడీపీ నాయకులు అలా అయితే కలెక్టర్‌కు, ఎన్నికల కమిషన్‌కు మీపై ఫిర్యాదు చేస్తామంటూ ఆర్డీఓను బెదిరించేలా మాట్లాడంతో.. ఆర్డీఓ స్పందించారు. ఏం నన్ను బెదిరిస్తున్నారా.. మీ ఇన్‌చార్జి చెప్పినవి చేస్తున్నాం. కదా అంటూ ఆగ్రహించారు.
టీడీపీ నాయకుల విడ్డూరం..
టీడీపీ నాయకుల తీరు విచిత్రంగా ఉంది. ఫిర్యాదు చేసి, దానిపై జరిగే విచారణపై కూడా వారే అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. ప్రత్తిపాడు మండలం గొట్టిపాడులో ఓట్ల తొలగింపునకు సంబంధించి వచ్చిన అర్జీలపై గతంలో ఇదే సమావేశంలో టీడీపీ నాయకులు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఫిర్యాదుతో స్పందించి ప్రత్తిపాడు సీఐ నిసార్‌బాషా సంబంధిత ఓటర్లుకు ఫోన్లు చేసి పారదర్శకంగా విచారణ చేస్తున్నారు. ఈ పారదర్శక విచారణ టీడీపీ శ్రేణులకు మింగుడు పడినట్లు లేదు. సీఐ ఫోన్లు చేసి ఓట్లు తొలగిస్తామని బెదిరిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని ప్రత్తిపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గింజుపల్లి శివరాంప్రసాద్ ఆర్డీఓను కోరారు. స్పందించిన ఆయన డీఎస్పీతో మాట్లాడుతానని చెప్పారు. ఓటర్ల జాబితాలో చిన్న చిన్న తప్పులు ఉన్నమాట వాస్తవమేనని, వాటిని సరిదిద్దుతున్నామని చెప్పారు. ఎక్కడైనా సమస్య ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని ఆర్డీఓ నాయకులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment