రంగస్థలంపై నవలావణ్యం
తెనాలి: తెలుగు నవలలు కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయి. దృశ్య రూపాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అటు పాఠకాదరణతోపాటు ఇటు ప్రేక్షకాదరణకు నోచుకుంటున్నాయి. అందులో మన రాష్ట్రానికి చెందిన తెనాలికి ప్రత్యేక గౌరవమే దక్కిందని చెప్పాలి. ఇక్కడి ప్రఖ్యాత రచయితల విశిష్ట నవలలు నాటకాలుగా రూపాంతరం చెంది విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అందులో ప్రధానంగా సాహితీ రంగంలో చరిత్ర సృష్టించిన చలం ‘మైదానం’, రావూరి భరద్వాజ కలం నుంచి వెలువడిన ‘పాకుడురాళ్లు’, తాజాగా వాసిరెడ్డి సీతాదేవి రచించిన ‘మట్టిమనిషి’ నవలలు నాటకాలుగా మారాయి.
రైతుకు భూమితో ఉన్న అనుబంధాన్ని తెలిపే ‘మట్టిమనిషి’
తెనాలి పాత తాలూకాలోని చేబ్రోలుకు చెందిన సుప్రసిద్ధ రచయిత డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి నవల ‘మట్టిమనిషి’ రంగస్థల నాటకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రైతుకు, భూమికి గల అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా చెప్పిన ఈ నవలను తెనాలి నాటక రచయిత వల్లూరు శివప్రసాద్ నాటకీకరించారు. డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి మెమోరియల్ ఫౌండేషన్ సహకారంతో ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రదర్శించారు. ఈ నాటకానికి చక్కని స్పందన లభించింది. త్వరలో గుంటూరు, తెనాలిలో ప్రదర్శనలకు నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. మట్టిమనిషి నవల 1972లో ప్రచురితమైంది. 1995–2000లో ఉస్మానియా యూనివర్శిటీ ఎంఏ ఫైనల్ విద్యార్థులకు పాఠ్యాంశంగా మారింది. నేషనల్ బుక్‌ట్రస్ట్ ఆఫ్ ఇండియా 14 భారతీయ భాషల్లోకి అనువదించి ప్రచురింపజేశారు. మాస్టర్ పీసెస్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ అనే కాలంలో ప్రస్తావించిన – నన్నయ నుంచి నేటివరకు వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంలో వచ్చిన గొప్ప రచనల్లో మట్టిమనిషి నవలను 13వదిగా గుర్తించారు.
సినీ మాయ తెరలకు కథారూపం ‘పాకుడురాళ్లు’
సాహితీవేత్త రావూరి భరద్వాజకు 2013లో అత్యంత ప్రతిష్టాకరమైన జ్ఞానపీఠ్ అవార్డును తెచ్చిపెట్టిన ‘పాకుడురాళ్లు’ నవల కూడా నాటకంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా పరిశ్రమ కథా వస్తువుగా తెలుగులో 1978లో వెలువడిన తొలి నవల ఇది. సినీ ప్రపంచంలోని మాయతెరలను బహిర్గతం చేసింది. ఈ నవలపై పరిశోధనలు జరిగాయి. ఆరు వందల పేజీల సుదీర్ఘమైన నవలలో అనేక పాత్రలు, పలు సంఘటనలు, వ్యక్తులు, మోసాలు, కుతంత్రాలు, కపట ప్రేమలు, ఆవిరైపోతున్న కలలు... ఇలా ఎన్నో భావోద్వేగాలు కలగలిశాయి. నవలను పది దృశ్యాలుగా కుదించి 1.45 గంటల నాటకంగా హైదరాబాద్ రంగ్ భూమిలో తొలి ప్రదర్శన ఇచ్చారు. ఏడో ప్రదర్శనను గుంటూరులోని శ్రీవేంకటేశ్వర విజ్ఞానమందిరంలో జరిగిన గుంటూరు కళా పరిషత్ రజతోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ మహోత్సవంలో ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ సౌజన్యంతో ఇచ్చారు.
సీ్త్ర వాదానికి ఊతమిచ్చే ‘మైదానం’
వీటికి ముందు చలం రచించిన ‘మైదానం’ నవలను ఒక సవాలుగా స్వీకరించి రంగస్థలంపైకి తీసుకురావటం మరో గొప్ప ప్రయోగం. ‘సీ్త్రకి కూడా శరీరం ఉంది.. దానికి వ్యాయామం ఇవ్వాలి.. సీ్త్రకి కూడా మనసు ఉంటుంది.. దానికి జ్ఞానం ఇవ్వాలి.. సీ్త్రకి కూడా హృదయం ఉంది.. అనుభవం ఇవ్వాలి’ అనే అంశంతో చలం రాసిన నవలల్లో అత్యంత ప్రసిద్ధమైనదీ, అత్యంత వివాదాస్పదమైనదీ ‘మైదానం’. దీనికీ నాటకరూపం కల్పించారు. ఇది విమర్శకుల ప్రశంసలను అందుకోవడం విశేషం.
నాటకాలుగా రూపొందుతున్న ప్రసిద్ధ నవలలు నాటకీకరణకు నోచుకున్న మైదానం, మట్టిమనిషి, పాకుడురాళ్లు తెనాలి రచయితలకు దక్కిన అరుదైన గౌరవం
Comments
Please login to add a commentAdd a comment