నేరాల నియంత్రణకు పటిష్ట నిఘా
నగరంపాలెం: జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్ట నిఘా ఉండాలని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. జిల్లా కోర్టు రోడ్డులోని జిల్లా క్రైం పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఆయన తనిఖీలు చేశారు. నేరాల దర్యాప్తు, నేరస్తుల సంఖ్య, వారి గుర్తింపు, పనితీరు, చోరీ కేసుల్లో సొత్తు స్వాధీనం తదితర అంశాలపై ఆరా తీశారు. నేరాల నియంత్రణకు అనుసరించాల్సిన మెళకువలను సీసీఎస్ పోలీస్ అధికారులు, సిబ్బందికి వివరించారు. వేలిముద్రలు, బాధితుల నుంచి వివరాల సేకరణ, అనుమానితులపై ఆరా, చోరీలు జరిగిన తీరును బట్టి దొంగలు ఎవరనేది ముందస్తుగా ఆలోచన చేయాలని తెలిపారు. కొద్దిపాటి క్లూ లభించినా, ఆ దిశగా కేసు దర్యాప్తు వాయువేగంతో చేపట్టాలని చెప్పారు. విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నేరస్తులు కొత్త పద్ధతుల్లో చోరీలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. నేరాల కట్టడికి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సీసీఎస్ పోలీసులు ఉపయోగించాలని చెప్పారు. ఎల్‌హెచ్‌ఎంఎస్ విధానంపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.ఊరెళ్లినప్పుడు దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించే దిశగా ప్రజల్లో చైతన్యం తేవాలని సూచించారు. నేరాల దర్యాప్తు, విధి నిర్వహణలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు దృష్టికి తేవాలన్నారు. ఇటీవల జిల్లాలో పగలు, రాత్రి వేళల్లో జరుగుతున్న దోపిడీలు, దొంగతనాలు, బంగారపు గొలుసులు తెంచుకెళ్లడం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ స్పష్టం చేశారు. కేసుల్లో అరెస్ట్ అయిన వారికి శిక్షలు పడేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఆయన వెంట జిల్లా ఏఎస్పీ (క్రైం) కె.సుప్రజ, డీఎస్పీ శివాజీరాజు, సీఐలు సుబ్బారావు, అనురాధ ఉన్నారు.
జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment