పది పరీక్షలకు ఏర్పాట్లు
గుంటూరు ఎడ్యుకేషన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల నుంచి 28,358 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో రెగ్యులర్ 27,458 మంది ఉండగా, గతంలో పరీక్షల్లో తప్పిన మరో 900 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 150 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏడు పేపర్ల విధానంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్న 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం మార్పులు తెచ్చింది. రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా దూరవిద్య అభ్యర్థులకు సైతం పబ్లిక్ పరీక్షలను నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. గతేడాది వరకు రెగ్యులర్ టెన్త్ విద్యార్థులకు ఉదయం పూట పబ్లిక్ పరీక్షలు ముగిసిన తరువాత ఓపెన్ స్కూల్ సొసైటీ అభ్యర్థులకు వారి సంఖ్య ఆధారంగా అవే కేంద్రాల్లో మధ్యాహ్నం నుంచి దూరవిద్య పరీక్షలు నిర్వహించేవారు. అయితే, ప్రస్తుతం గత విధానంలో మార్పులు తీసుకువచ్చిన విద్యాశాఖాధికారులు రెగ్యులర్ టెన్త్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులతో పాటు దూరవిద్య టెన్త్ అభ్యర్థులకు అవే కేంద్రాల్లో ప్రత్యేకంగా మరొక గదిలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రెగ్యులర్‌తో పాటు దూరవిద్యకు కలిపి నిర్వహణ మార్చి 17 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు 150 కేంద్రాల ఏర్పాటు
అక్రమాలకు ఆస్కారం లేకుండా పరీక్షల నిర్వహణ
టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో తప్పిదాలు, అక్రమాలకు ఆస్కారం లేకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాం. రెగ్యులర్ విద్యార్థులతో పాటు దూరవిద్య అభ్యర్థులకు కలిపి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నాం. తద్వారా పరీక్షల నిర్వహణపై మరింత నిఘాను పెంచేందుకు అవకాశం కలుగుతుంది. అన్ని యాజమాన్యాల్లోని ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న టెన్త్ విద్యార్థులను పూర్తిస్థాయిలో పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేయాలి.
– సీవీ రేణుక, జిల్లా విద్యాశాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment