గుంటూరు
శుక్రవారం శ్రీ 15 శ్రీ నవంబర్ శ్రీ 2024
గుంటూరు ఎడ్యుకేషన్: విద్య వజ్రాయుధమని, బాగా చదువుకుని జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కస్టమ్స్ అండ్ సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి చెప్పారు. గురువారం పట్టాభిపురంలోని మాతృశ్రీ చిల్డ్రన్స్ హోంలో ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో బాలల దినోత్సవం వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసింహారెడ్డి చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు పిల్లల చేతుల్లోనే ఉందని బలంగా నమ్మిన తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ బాలల నేస్తంగా మారారని అన్నారు. చిన్నతనం నుంచే పిల్లలను సక్రమ మార్గంలో ముందుకు తీసుకెళ్లడం ద్వారానే వారిని క్రమశిక్షణ గల పౌరులుగా తీర్చిదిద్దవచ్చునని చెప్పారు. ఉన్నతస్థాయికి చేరుకోవడం విద్యతోనే సాధ్యమని, కృషి, పట్టుదలతో చదువుకుని ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ఎదగాలని సూచించారు. చిన్ననాటి నుంచి తన విద్యాభ్యాసం తెలుగు మీడియంలోనే సాగిందని, పక్కా భవనాలూ లేని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన తాను ఈస్థాయికి వచ్చినట్లు విద్యార్థులకు చెప్పారు. చదువు ఒక్కటే జీవితాన్ని మార్చగలిగే మహత్తరమైన ఆయుధమని తెలుసుకుని, ఇష్టపడి చదవాలని సూచించారు. నరసింహారెడ్డి తన సొంత ఖర్చుతో బ్లాంక్లెట్లు, ఇతర సామగ్రితో కూడిన కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. చిల్డ్రన్స్ హోంలో ఆశ్రయం పొందుతున్న బాలల్లో నూతనోత్తేజాన్ని నింపేందుకు వారి మధ్య బాలల దినోత్సవాన్ని జరిపిన ‘సాక్షి’ని ప్రశంసించారు. హోంలో ఆశ్రయం పొందుతున్న చిన్నారుల్లో పలువురు తల్లిదండ్రులను కోల్పోయిన వారు ఉన్నారని తెలుసుకుని ఆయన చలించిపోయారు. ఇటువంటి చిన్నారుల్లో ఆనందోత్సాహాలను నింపేందుకు ‘సాక్షి’ చేసిన ప్రయత్నం గొప్పదని కొనియాడారు.
నవ్వులు పూయించిన కృష్ణంరాజు
ప్రముఖ మిమిక్రీ కళాకారుడు కాసుల కృష్ణంరాజు మిమిక్రీ, వెంట్రిలాక్విజంతో చిన్నారుల మో ముల్లో నవ్వులు పూయించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు నాట్య, గాన కళలతో ఆకట్టుకున్నారు.
సాక్షి టీం కిట్లు పంపిణీ
సాక్షి టీం ఆధ్వర్యంలో మాతృశ్రీ చిల్డ్రన్స్ హోంలోని చిన్నారులకు దుప్పట్లు, ఆట వస్తువులు, బిస్కెట్లు, చాక్లెట్లను పంపిణీ చేశారు. అరండల్‌పేటలోని ఆర్‌ఆర్ బుక్స్ అండ్ స్టేషనరీ నిర్వాహకుడు కె.అశోక్‌కుమార్ విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చిల్డ్రన్స్ హోం నిర్వాహకుడు జీవన్‌కాంత్, కస్టమ్స్, జీఎస్టీ కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి, సాక్షి బ్యూరో ఇన్‌చార్జ్ డి.రమేష్‌బాబు, సాక్షి గుంటూరు సిటీ రిపోర్టర్ల బృందం పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేది చదువే
పేద విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎదగాలి కస్టమ్స్, జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి ‘సాక్షి’ ఆధ్వర్యంలో వైభవంగా బాలల దినోత్సవం గుంటూరులోని మాతృశ్రీ చిల్డ్రన్స్ హోంలో నిర్వహణ ‘‘సాక్షి’’ కృషిని ప్రశంసించిన కమిషనర్ నరసింహారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment