నేటి నుంచి వీవీఐటీలో బాలోత్సవ్
పెదకాకాని: చిన్నారుల్లో సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించడమే బాలోత్సవ్ ముఖ్య ఉద్దేశమని వీవీఐటీ కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ చెప్పారు. పెదకాకాని మండలంలోని నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఈనెల 15న శుక్రవారం నుంచి బాలోత్సవ్–2024 నిర్వహించనున్నట్టు వెల్లడించారు. మూడు రోజులపాటు ఈ ఉత్సవం జరుగుతుందని వివరించారు. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. బాలోత్సవ్‌లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 650 పాఠశాల ల నుంచి 13 వేలమంది విద్యార్థులు ఇప్పటికే తమ పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. 20 అంశాలు, 61 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని, దీనికోసం వీవీఐటీ ప్రాగణంలో 30 వేదికలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇతర రాష్ట్రాలు, దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు సహాయం చేసే నిమిత్తం గుంటూరు, విజయవాడ నగరాల్లోని బస్టాండ్, రైల్వే స్టేషన్లలో సేవా కేంద్రాలు ఏర్పాటు చేశామని, వారిని కళాశాల బస్సుల ద్వారా బాలోత్సవ్ ప్రాంగణానికి తరలిస్తామని చెప్పారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఉచిత వసతి, భోజన ఏర్పాట్లూ చేస్తున్నామని పేర్కొన్నారు. కళాశాలకు చెందిన స్టూడెంట్ యాక్టివిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో 600 మంది ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు సేవా కార్యక్రమాలు చేపడతారని వెల్లడించారు. 300 మంది ఎన్‌సీసీ విద్యార్థులు రక్షణ బాధ్యతలు తీసుకుంటారని వివరించారు. వేల సంఖ్యలో విద్యార్థులు పాల్గొంటున్న నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరిగేతే ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తగా పెదకాకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గుంటూరు ఆస్టర్ రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో అంబులెన్సును ఏర్పాటు చేశామన్నారు. బాలోత్సవ్‌లో పాల్గొనే వారు తమ వెంట జనరల్ మెడిన్స్‌తోపాటు బాలోత్సవ్ కమిటీ నిర్ణయం మేరకు ప్లాస్టిక్ రహిత వాటర్ బాటిల్‌ను తెచ్చుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment