రేపు విశ్రాంత బ్యాంక్ ఉద్యోగుల ధర్నా
కొరిటెపాడు(గుంటూరు): యునైటెడ్ బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్, ఏపీ బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ సంయుక్త పిలుపు మేరకు అనేక ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న బ్యాంక్ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 19వ తేదీన విజయవాడలోని అలంకార్ కూడలి వద్ద రాష్ట్రస్థాయి మహాధర్నాను చేపట్టనున్నట్లు జిల్లా బ్యాంక్ విశ్రాంత ఉద్యోగుల కో–ఆర్డినేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేవీబీ మురళీకృష్ణారావు పేర్కొన్నారు. స్థానిక బ్రాడీపేటలోని బ్యాంక్ ఉద్యోగుల భవనంలో ఆదివారం జరిగిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘ కాలంగా ఉన్న పెన్షన్ విధానాన్ని పునఃసమీక్షించాలని కోరారు. పెన్షన్ చెల్లింపుల్లో స్పెషల్ అలవెన్స్‌లను పరిగణలోకి తీసుకోవడంతో పాటు మెడికల్ ఇన్స్యూరెన్స్‌లో చెల్లిస్తున్న ప్రీమియంను తగ్గించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తాము చెల్లించే ప్రీమియంలో బ్యాంక్ తన వాటాను చెల్లించాలని, పెన్షన్‌దారులు తీసుకున్న రుణాలు 10 ఏళ్లలోపు కట్టినా కానీ కోర్టుల ఆదేశాలను లెక్కచేయకుండా 15 ఏళ్ల వరకు రికవరీ చేయడం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ బ్యాంక్ ఉద్యోగులతో జరిపే చర్చలలో యునైటెడ్ బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ సభ్యులను భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ మహాధర్నా తర్వాత కూడా బ్యాంకుల యాజమాన్యాలు, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నట్లు ఆయన హెచ్చరించారు. సమావేశంలో ఫెడరేషన్ల నాయకులు కె.హరిబాబు, వై.కోటేశ్వరరావు, శ్యామ్, వై.హనుమంతరావు, పుల్లయ్య, వెంకయ్య, శివాజీ, విజయ ప్రకాష్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment