వాయుగండం
రేపల్లె రూరల్: వరుస తుపానులు, అల్పపీడనాలు రైతులను వణికిస్తున్నాయి. పంట చేతికొచ్చే దశలో వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతన్న కంటి మీద కునుకు లేకుండా పోతోంది. తెగుళ్లు లేకపోవటంతో పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో వచ్చే అవకాశం ఉండడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. నియోజకవర్గంలోని రేపల్లె మండలం నల్లూరుపాలెం, తుమ్మల, పోటుమెరక, పేటేరు, బొందలగరువు, కై తేపల్లి, నిజాంపట్నం మండలం కూచినపూడి, పల్లపట్ల, నగరం మండలం నగరం, దూళిపూడి, ఈదుపల్లి, చెరుకుపల్లి మండలం చెరుకుపల్లి, గుళ్లపల్లి, కావూరు, కనగాల, రాంబొట్లపాలెం గ్రామాలలో అధికశాతం పంట కోత దశలో ఉండటంతోపాటు, కోతలు పూర్తయి ఓదెలపై ఉంది. మంగళవారం ఉదయం నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవటంతో రైతులు పంటను కాపాడుకునేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నాడు. ఇప్పటికే కోతకు సిద్ధమైన పంటతోపాటు కోత కోసి ఓదెలపై ఉన్న పంటను కాపాడుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. కోతలు కోసి ఓదెలపై ఉన్న పంటను కట్టలు కట్టి కుప్పలు వేస్తున్నారు. మరికొంతమంది పంటను రోడ్లపై ఆరబెట్టి నూర్పిళ్లు చేస్తున్నారు.
కూలీలకు డిమాండ్
సాధారణ రోజుల్లో కట్టివేతకు ఎకరాకు రూ.4వేల నుంచి రూ.5వేలు తీసుకునే కూలీలు ప్రస్తుతం రూ.7వేల నుంచి రూ.8వేలు వరకు డిమాండ్ చేస్తున్నారు. చేసేది లేక కూలీలు అడిగినంత చెల్లిస్తున్నారు.
ఓదెలపై వరి పంట కట్టివేత పనుల్లో రైతులు నిమగ్నం పంట కాపాడుకునేందుకు పరుగులు
Comments
Please login to add a commentAdd a comment