సంక్షేమం నుంచి సంక్షోభం వైపు..! | - | Sakshi
Sakshi News home page

సంక్షేమం నుంచి సంక్షోభం వైపు..!

Published Wed, Jan 1 2025 2:02 AM | Last Updated on Wed, Jan 1 2025 2:02 AM

సంక్ష

సంక్షేమం నుంచి సంక్షోభం వైపు..!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన సంక్షోభం వైపు సాగుతోంది. గతంలో వైస్సార్‌సీపీ హయాంలో సంక్షేమ పాలన ప్రజలకు అందింది. మాయమాటలతో ఓటర్లను నమ్మించి గద్దెనెక్కిన కూటమి సర్కార్‌ మాత్రం ఇప్పుడు రాష్ట్రాన్ని సంక్షోభం వైపు నడిపిస్తోంది. గత ఐదేళ్లలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రజలందరికీ కులమతాలకు అతీతంగా అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు అందించారు. తర్వాత మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి పాలనలో సంక్షేమం మాట అటుంచితే సంక్షోభంలోకి ప్రజలు చేరుకుంటున్నారు.

సాక్షి ప్రతినిధి, గుంటూరు: అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్‌ పెంచిన కూటమి ప్రభుత్వం లబ్ధిదారులను ఎలా తగ్గించాలనే అంశంపై దృష్టి పెట్టింది. మిగిలిన పథకాలన్నింటికీ తిలోదకాలు ఇచ్చింది. సూపర్‌ సిక్స్‌ పేరిట హామీలతో ఊదరగొట్టి అధికారంలోకి రాగానే వాటి ఊసే ఎత్తడం లేదు. విద్యార్థులకు ఇచ్చే అమ్మ ఒడి దగ్గర నుంచి ఏ పథకం ఇప్పటివరకూ అమలులోకి రాలేదు. దీంతో ప్రజల్లో ఆర్థికంగా చేయూత లేకపోవడంతో కొనుగోలు శక్తి క్షీణించింది. మార్కెట్‌లో వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాజధాని పేరుతో చేస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మినహా మరే వ్యాపారం సాగడం లేదు. దీంతో ఏడాది కూడా గడవకముందే కూటమి పాలనపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉంది.

పండుటాకులపైనా ప్రతాపం

సంక్షేమం వైపు ఏ మాత్రం దృష్టి పెట్టని చంద్రబాబు ప్రభుత్వం... పేదల నోటి దగ్గర కూడు కూడా లాక్కొనేందుకు సిద్ధమైంది. పండుటాకులపై తన ప్రతాపం చూపించడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా పింఛన్ల వెరిఫికేషన్‌ పేరుతో పింఛన్లు తొలగించే ప్రయత్నాలు ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ ఐదు నెలల్లో 6,798 పింఛన్లు వివిధ పేర్లతో తొలగించారు. తాజాగా పైలెట్‌ వెరిఫికేషన్‌ పేరుతో ప్రతి జిల్లాలో ఒక సచివాలయం పరిధిలో పింఛన్లు తనిఖీ చేశారు. పింఛన్‌ దారుల పూర్తి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నప్పటికీ మరోసారి వారి వివరాలు సేకరించి యాప్‌లో నమోదు చేశారు. ఆరు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ వివరాలు సేకరించారు. వీటిలో తేడాలు ఉన్నాయంటూ వాటిని రద్దు చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు. సామాన్య ప్రజలపై దౌర్జన్యాలు, ప్రతిపక్ష పార్టీ నేతలపై తప్పుడు కేసులు, రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలుపై పెడుతున్న దృష్టిని ప్రజల సంక్షేమంపై మాత్రం పెట్టడం లేదు.

అమలు కాని హామీలు

ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, లోకేష్‌లు జిల్లాలో పర్యటించి పలు హామీలు ఇచ్చారు. అవి ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. తల్లికి వందనం కింద విద్యార్థులకు ఏటా రూ. 15 వేలు, నిరుద్యోగులకు భృతిగా నెలకు రూ. 3 వేలు, అన్నదాతకు ఏటా రూ. 20 వేలు, ప్రతి మహిళకు నెలకు రూ. 1,500, మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణం.. ఇలా నోటికి వచ్చినట్లు ఊదరగొట్టారు. వీటిలో ఒక్కటీ అమలు చేయలేదు.

గుంటూరులో భూగర్భ డ్రైనేజీని పూర్తి చేస్తామని కూటమి నేతలు చెప్పారు. ఇప్పటివరకు దీనిపై చంద్రబాబు సమీక్షించిన పాపాన పోలేదు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో కూడా దీనిపై నిర్ణయం తీసుకోలేదు. గుంటూరు అమరావతి రాజధానిలో భాగం. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లకు తోడుగా సైబరాబాద్‌ను నిర్మించి ఒక మహానగరానికి శ్రీకారం చుట్టానని చెప్పడం చంద్రబాబుకు అలవాటు. ఈ క్రమంలో హైదరాబాద్‌ ఔటర్‌ రింగురోడ్డు 163 కి.మీ మాత్రమేనని... అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు 180 కి.మీ.తో ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఈ ప్రక్రియ కూడా ప్రకటనలకే పరిమితం అయ్యింది. ముస్లింలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరస్తాన్‌లకు స్థలాలు కేటాయిస్తామన్నారు. హజ్‌ యాత్రకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. నూర్‌బాషా కార్పొరేషన్‌ పెట్టి ఏడాదికి రూ.వంద కోట్లు ఆర్థిక సాయం చేస్తామని పేర్కొన్నారు. మైనారిటీ, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ల ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇచ్చే బాధ్యత తనదంటూ గుంటూరు పర్యటనలో చంద్రబాబు ఇచ్చిన హామీలు నేటికీ నీటి మూటలుగానే మిగిలాయి. ఈ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. గుంటూరులోనే ఐటీ టవర్లు కట్టి వర్క్‌ ఫ్రం హోం విధానం తీసుకొస్తామని చెప్పారు. తాడికొండ ప్రధాన రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు పరిహారం అందిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో ప్రధానమైన తాగునీటి సమస్యను పరిష్కరించి ఇంటింటికీ తాగునీరు అందిస్తామన్నారు. తాడికొండ కొండపై వేంచేసియున్న కొండ మల్లికార్జున స్వామి ఆలయానికి ప్రస్తుతం ఉన్న ఘాట్‌ రోడ్డును సిమెంట్‌ రోడ్డు గా మారుస్తామని హామీ ఇచ్చారు. ఆచరణలో మాత్రం ఏ ఒక్కటీ సాధ్యపడటం లేదు. మంగళగిరిలో అధికారం వచ్చిన రెండు సంవత్సరాలలోపు ఇరిగేషన్‌ కొండపోరంబోకు, ఫారెస్ట్‌ చెరువులు, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండే వారికి పట్టాలు ఇస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు. ఇదీ నెరవేరలేదు.

అవినీతికి అండగా...

సంక్షేమం గాలికి వదిలేయడంతోపాటు అభివృద్ధి చేయకపోగా అవినీతికి గేట్లెత్తేశారు. గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అవినీతి అధికారులను తీసుకొచ్చి పెట్టారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటీవల 21 మంది గుంటూరు కార్పొరేషన్‌కు వచ్చారు. వీరంతా రూ.కోట్ల మేరకు డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ప్లానింగ్‌తోపాటు స్థానిక ప్రజాప్రతినిధులకు ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోస్టింగ్‌లకు వచ్చిన వారిలో అవినీతి అనకొండలే ఎక్కువగా ఉన్నారని సమాచారం. ఒక అధికారిపై రెండుసార్లు ఏసీబీ రైడింగ్‌లు కూడా జరిగాయి. అదే టౌన్‌ప్లానింగ్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఏకంగా అసిస్టెంట్‌ సిటీప్లానర్‌ ఇన్‌చార్జిగా రెండు జోన్లు అప్పగించడమే కాకుండా ఏకంగా నగరంలోని సగానికి పైగా డివిజన్లు అప్పగించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అన్నదాతలకు కన్నీరు

జిల్లాలోని రైతులను కూటమి పాలకులు రోడ్డున పడేశారు. ఈ ఏడాది తుపాన్లు, వర్షాలకు రైతన్నలు పూర్తిగా నష్టపోయారు. రైతులకు పెట్టుబడి సాయం కూడా అందలేదు. జిల్లాలో 1.41 లక్షల ఎకరాల్లో ఈసారి వరి సాగు చేశారు. ఇబ్బందులు వచ్చినా సగటున 35 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. ఈసారి బయట మార్కెట్‌లో ధరలు చాలా తక్కువ ఉండటంతో రైతులు ప్రభుత్వం వైపు ఆశగా చూశారు. జిల్లాలో 156 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వం.. కేవలం పది వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి చేతులు దులుపుకొంది. నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయాయి. కందిపప్పు, నూనెల ధరలతో పాటు ఉల్లి కూడా ఘాటెక్కింది. సామాన్యులకు సంక్షేమ పథకాలు అందకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్త సంవత్సరం వేళ కాస్త సంతోషం కూడా లేకుండా పోయిందని ప్రజలు వాపోతున్నారు.

మోసపు మాటలతో

అధికారంలోకి కూటమి

ఓటర్లను నమ్మించి నట్టేట

ముంచిన పాలకులు

ఉన్న సంక్షేమ పథకాలు

కోల్పోయిన ప్రజలు

కొత్త సంవత్సరం వేళ

ఆనందం కూడా కరువు

No comments yet. Be the first to comment!
Add a comment
సంక్షేమం నుంచి సంక్షోభం వైపు..! 1
1/2

సంక్షేమం నుంచి సంక్షోభం వైపు..!

సంక్షేమం నుంచి సంక్షోభం వైపు..! 2
2/2

సంక్షేమం నుంచి సంక్షోభం వైపు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement