బాపట్ల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ @ 160
బాపట్ల: ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం 160వ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. 1865 జనవరి 1న బాపట్లలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభమైన సందర్భంగా బుధవారం సబ్ రిజిస్ట్రార్ ఎన్.జాన్‌మోహన్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాపట్లకు తరతరాల ఘన చరిత్ర ఉందని తెలిపారు. పెద్ద నగరాలలో లేని ప్రభుత్వ కార్యాలయాలు ఆనాడే ఇక్కడ ఉండేవని చెప్పారు. రిజిస్ట్రార్ కార్యాలయంలో పనుల నిమిత్తం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వల్ల బాపట్ల పట్టణానికి బహుళ ప్రాచుర్యం కలిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఫోరం కార్యదర్శి పి.సి.సాయిబాబు, వెలుగు ఏపీఎం దగ్గుబాటి సురేష్, సీనియర్ అసిస్టెంట్ జానీ, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి
బాపట్ల: నూతన సంవత్సరంలో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి సూచించారు. నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం జిల్లా అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్‌ను కలసిన వారిలో జేసీ ప్రఖర్‌జైన్, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, ఆర్డీఓ గ్లోరియా తదితరులు ఉన్నారు.
వైభవంగా ధనుర్మాస మహోత్సవాలు
తాడేపల్లి రూరల్ : శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ధనుర్మాస వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. బుధవారం మంగళగిరి బాపూజీ విద్యాలయంలో 17వ రోజు 17వ పాశురాన్ని భక్తులకు ఆయన వివరించారు. అనంతరం గోదా అమ్మవారికి అష్టోత్తరం, తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌స్వామి స్వయంగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మనిషి ప్రవృత్తి, విధి విధానాలు, భగవంతునిపై ఉండవలసిన నిష్ట, ఏ విధంగా ఆచరణలో పెట్టాలో వివరించారు. 14 ప్రాంతాల నుంచి సుమారు 340 మంది భక్తులు గోదా అమ్మవారికి సారె సమర్పించారు. తర్వాత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కూచిపూడి నృత్యాలు భక్తులను అలరించాయి.
యార్డులో 44,245 బస్తాల మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 40,208 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 44,245 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి రూ. 14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి 16,500 వరకు లభించింది. ఏసీ కామన్ రకం మిర్చి రూ. 7,500 నుంచి రూ. 13,500 వరకు లభించింది. ఏసీ ప్రత్యేక రకం రూ. 7,800 నుంచి రూ. 16,500 వరకు ధర పలికింది. తాలు రకం మిర్చికి రూ.4,000 నుంచి రూ.11,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 47,476 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి వి.ఆంజనేయులు తెలిపారు.
సాగునీటి సమాచారం
తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల) : కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద బుధవారం 1,416 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు., బ్యాంక్ కెనాల్‌కు 168, తూర్పు కెనాల్‌కు 180, నిజాంపట్నం కాలువకు 34, కొమ్మమూరు కాలువకు 840 క్యూసెక్కులు వంతున వదిలారు.
Comments
Please login to add a commentAdd a comment