విదేశంలో వైద్య సీటు ఇప్పిస్తామని మోసం
గుంటూరు రూరల్: తక్కువ ఖర్చుతో విదేశాల్లో ఉన్నత విద్య అందిస్తామని రూ.21.59 లక్షల మేరకు మోసగించిన ముఠాలోని ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు సౌత్ డీఎస్పీ మల్లికార్జునరావు తెలిపారు. బుధవారం నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఫిలిప్పీన్స్‌లోని మెడికల్ కాలేజీల్లో సీటు ఇప్పిస్తామని నగదు తీసుకుని మోసం చేసిన రైట్ ఛాయిస్ జేఎస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సల్టెన్సీ సంస్థకు చెందిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ముగ్గురు వ్యక్తులను వట్టిచెరుకూరు పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. పల్నాడు జిల్లా గురజాల గ్రామానికి చెందిన శీలంనేని శ్రీనివాసరావు తన కుమారుడు అనిల్‌కుమార్‌ను మెడిసిన్ చదివించాలని కన్సల్టెంట్స్‌ను సంప్రదించారని తెలిపారు. ఈ క్రమంలో గుంటూరు నగరంలోని అరండల్‌పేట 6/2లో గల రైట్ ఛాయిస్ సంస్థ ఫౌండర్ డైరెక్టర్ కన్నా రవితేజను కలిశారన్నారు. బాధితుడి నుంచి రవితేజ సుమారు రూ.21.59 లక్షల నగదు కట్టించుకున్నారని తెలిపారు. కళాశాలకు ఆ మొత్తం చెల్లించకపోవడంతో శ్రీనివాసరావు నిలదీశారని చెప్పారు. నిందితులు ఆయనతోపాటు కుమారుడిని కూడా భయపెట్టారని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వట్టిచెరుకూరు పోలీసులు కేసు దర్యాప్తు చేశారని చెప్పారు. ఏడుగురు నిందితులు ఈ మోసానికి పాల్పడ్డారని గుర్తించామని తెలిపారు. నిందితులను వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన కన్నా బాల రవితేజ, కన్నా బాల శౌరయ్య, పెరమలపల్లి లోహిత, వీరులపాడు మండలం జగన్నాథపురానికి చెందిన పార రవి కుమార్, మురుపాల గీతిక, నారాయణ పవన్‌కళ్యాణ్, పొలిమేర శివలుగా గుర్తించామని వెల్లడించారు. వీరిలో ముగ్గురు నిందితులు ఫిలిప్పీన్‌లో ఉంటూ కార్యకలాపాలు నిర్వహిస్తారని తెలిపారు. కన్న బాల రవితేజ, కన్నా బాల సౌరయ్య, పార రవి కుమార్‌లను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. పెరమలపల్లి లోహిత హైదరాబాద్ బ్రాంచ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఫిలిప్పీన్‌కు వెళ్లొస్తున్నట్లు గుర్తించామని వివరించారు. ఫిలిప్పీన్‌లో ఉంటున్న మురుపాల గీతిక, నారాయణ పవన్ కళ్యాణ్, పొలిమేర శివలపైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. ఫీజుల పేరిట తీసుకున్న నగదును నిందితులు సొంతానికి వాడుకుంటూ, విద్యార్థుల పాస్‌పోర్ట్, వీసాలను వారి వద్దే ఉంచుకుంటున్నారని విచారణలో వెల్లడైందని డీఎస్పీ పేర్కొన్నారు. దీనిపై నిలదీస్తే తప్పుడు కేసులు పెడతామని విద్యార్థులు, వారి తల్లిదండ్రులను నిందితులు బెదిరిస్తున్నారని తెలిపారు. నిందితుల నుంచి ల్యాప్‌టాప్, మూడు సెల్ ఫోన్లు, ఒక పాస్‌పోర్ట్‌ను సీజ్ చేశామని వివరించారు. నిందితులను అరెస్టుచేసిన వట్టిచెరుకూరు సీఐ రామానాయక్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు శేఖర్, ప్రకాష్ బాబు, ప్రసాద్, పోతురాజులను డీఎస్పీ అభినందించారు.
రూ.21.59 లక్షలు తీసుకుని బెదిరింపులు కన్సల్టెన్సీకి చెందిన ముగ్గురు నిందితుల అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment