చిరుద్యోగులపై కూటమి కక్ష సాధింపు
చేబ్రోలు: కొత్త సంవత్సరం రోజున కూటమి ప్రభుత్వం చిరుద్యోగులపై ప్రతాపం చూపింది. సర్కార్ తీరుపై బాధితులు నిరసన వ్యక్తం చేసిన సంఘటన చేబ్రోలులో బుధవారం జరిగింది. చేబ్రోలు మేజర్ గ్రామ పంచాయతీలో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారిలో 12 మందిని బుధవారం నుంచి విధుల్లోకి రావద్దని పంచాయతీ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. గ్రీన్ అంబాసిడర్స్, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, నైట్ వాచ్‌మెన్, వాటర్ వర్కర్‌గా పనిచేస్తున్న మొత్తం 12 మంది టెండర్ వర్కర్స్‌కు ఉద్వాసన పలుకుతూ ఆదేశాలు ఇచ్చారు. అధికార పార్టీకి చెందిన నాయకుల రాజకీయ ఒత్తిళ్ల కారణంతోనే ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. చేబ్రోలు గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న 12 మంది కార్మికులను పనుల్లోకి రావాల్సిన అవసరం లేదని పంచాయతీ కార్యదర్శి కారసాల శ్రీనివాసరావు ఆదేశాలు ఇవ్వటంతో మేస్త్రి వారిని బుధవారం నిలిపివేశారు. గ్రామ పంచాయతీ కార్మికులు గత 20 సంవత్సరాలుగా పార్టీలకతీతంగా, కరోనా విపత్కర సమయంలో కూడా ప్రజలకు సేవ చేశారు. అలాంటి వారిని విధుల నుంచి తీసివేయడంపై విమర్శలు వస్తున్నాయి. కార్మికులు ఉదయం విధులకు వెళ్లకుండా చేబ్రోలు మెయిన్ రోడ్డులోని లైబ్రరీ సెంటర్‌లో నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీగా వెళ్లి తహసీల్దారు కె. శ్రీనివాసశర్మకు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. కార్మికులను పనుల నుంచి తొలగించటం అన్యాయమన్నారు. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చింతల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కార్మికులకు టెండర్ విధానాన్ని రద్దు చేయాలని, వేధింపులకు పాల్పడటం దారుణమన్నారు. ిసీఐటీయూ మండల కార్యదర్శి సీహెచ్ హనుమంతరావు, పొన్నూరు మండల కార్యదర్శి రమేష్ బాబు, సీపీఎం నాయకులు పల్లా ఆదిశేషు, పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు హరిబాబు, నారాయణ, యాకసిరి శ్రీను, రాఘవమ్మ, బి.అన్నపూర్ణ, బి.కరుణమ్మ, నక్క శైలజ, దీపిక, బూసి సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. గురువారం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లనున్నట్లు నాయకులు తెలిపారు.
చేబ్రోలు పంచాయతీ ఉద్యోగులకు రాజకీయ వేధింపులు కొత్త సంవత్సరం తొలి రోజునే 12 మందికి ఉద్వాసన
విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నందునే వేటు
దీనిపై పంచాయతీ కార్యదర్శి కే శ్రీనివాసరావును ‘సాక్షి’ వివరణ కోరగా.. విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటూ సరిగా పనిచేయకపోవటంతోనే 12 మంది వర్కర్స్‌ను తొలగించినట్లు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు, నైట్ వాచ్‌మెన్‌లు, వాటర్ వర్కర్స్, గ్రీన్ అంబాసిడర్స్ వీరిలో ఉన్నారన్నారు. ఇప్పుడు ఉన్న వారిని కూడా సరిగా పనిచేయకపోతే తొలగిస్తామన్నారు. గత ఏడాది వర్కర్స్ కాలపరిమితి ముగిసిందని, అయినప్పటికీ కొనసాగుతున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment