గిట్టుబాటు ధర కల్పనలో బోర్డు పాత్ర ప్రధానం
కొరిటెపాడు(గుంటూరు): వ్యవసాయం సజావుగా సాగేలా చూడటం, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, ఎగుమతులను ప్రోత్సహించడంలో పొగాకు బోర్డు ప్రధాన పాత్ర పోషిస్తోందని పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్‌బాబులు స్పష్టం చేశారు. గుంటూరు చుట్టుగుంటలోని రైతు భవన్‌లో పొగాకు బోర్డు వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను బుధవారం నిర్వహించారు. అనంతరం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత ప్రభుత్వ నియంత్రణలో పొగాకు పరిశ్రమ సమగ్ర అభివృద్ధి కోసం 1976 జనవరి 1వ తేదీన పొగాకు బోర్డు చట్టం 1975 ద్వారా పొగాకు బోర్డు స్థాపించడం జరిగిందన్నారు. ప్రపంచంలోనే పొగాకు ఉత్పత్తిలో చైనా తర్వాత భారతదేశం రెండో స్థానంలో, వర్జీనియా పొగాకు ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉందని వెల్లడించారు. బ్రెజిల్ తర్వాత ముడి పొగాకు ఎగుమతి చేసే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందని, పొగాకు ఎగుమతుల ద్వారా భారత ఖజానాకు గణనీయమైన విదేశీ మారకవ్రవ్యాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. 2023–24లో భారత పొగాకు ఎగుమతుల విలువ రూ.12,005.89 కోట్లుగా నమోదైందని చెప్పారు. దేశంలో పొగాకు పరిశ్రమ సుస్థిరత కోసం పొగాకు బోర్డు అనేక కార్యక్రమాలను చేపడుతోందన్నారు. దేశీయ అవసరాలు, అంతర్జాతీయ ఎగుమతి డిమాండ్‌కు అనుగుణంగా వర్జీనియా (ఎఫ్‌సీవీ) పంట ప్రణాళిక తయారు చేయుట, ఉత్పత్తి నియంత్రణ చేపడుతున్నట్లు వివరించారు. బ్యాంకుల ద్వారా రైతులకు అవసరమైన ఆర్ధిక సహాయం అందించడంలో సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. పొగాకు బేళ్లను ఎలక్ట్రానిక్ వేలం ద్వారా నిర్వహించి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా కృషి చేస్తున్నామన్నారు. 2023–24లో కిలో పొగాకుకు సగటు ధర రూ.288.65లు లభించిందని తెలిపారు. 2023–24లో పొగాకు రైతులు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్నప్పటికీ, రైతుల సంకల్పం కృషి ఫలితంగా రికార్డు స్థాయిలో 215.35 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయిందన్నారు. 2023–24 సీజన్‌లో పొగాకు రైతులు రూ.6,313.58 కోట్లు ఆర్జించడం జరిగిందన్నారు. గత ఏడాది సగటు ధర రూ.225.73తో పోలిస్తే ఈ సీజన్‌లో కిలోకు సగటున రూ.62.92 పెరిగిందని గుర్తుచేశారు. అదనంగా పండించిన 76.84 మిలియన్ కిలోల పొగాకు అమ్మకాలకు జరిమానాలను మాఫీ చేయడం వల్ల 38,751 మంది రైతులకు రూ.184 కోట్ల మేర లబ్ధి చేకూరిందని వెల్లడించారు. 2024–25 సీజన్‌లో కూడా మెరుగైన ధర రాబట్టేందుకు శతవిధాలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించి, రైతులు, అధికారులు, వ్యాపారుల సలహాలు, సూచనలు స్వీకరించి, అందుకు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేసి ముందుకు వెళ్తామని వారు పేర్కొన్నారు. అనంతరం జరిగిన బోర్డు వ్యవస్థాపక దినోత్సవంలో పలువురు ఉత్తమ రైతులు, అధికారులను సత్కరించారు.
పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment