డ్రైవింగ్ శిక్షణ తరగతులు ప్రారంభం
పట్నంబజారు: డ్రైవర్లు విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలని ఏపీఎస్ ఆర్‌టీసీ రీజియన్ మేనేజర్ ఎం.రవికాంత్ చెప్పారు. గుంటూరు జిల్లా పరిధిలోని హెవీమోటారు వెహికల్ డ్రైవింగ్ స్కూల్ 18 బ్యాచ్‌కు శిక్షణ తరగతులు గురువారం బస్టాండ్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ.. హెవీ డ్రైవింగ్ స్కూల్‌లో సీనియర్ డ్రైవర్ల చేత నాణ్యమైన శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిపో –2 మేనేజర్, డ్రైవింగ్ స్కూల్ ప్రిన్సిపల్ షేక్ అబ్దుల్‌సలాం పాల్గొన్నారు.
కంప్యూటర్, ట్యాలీ కోర్సులో ఉచిత శిక్షణ
గుంటూరు ఎడ్యుకేషన్: ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు బెంగుళూరులో కంప్యూటర్, ట్యాలీ నైపుణ్యంపై ఉచిత శిక్షణతో పాటు నూరు శాతం ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధి హరిప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బెంగుళూరులో 35 రోజుల పాటు ఉచిత భోజన, వసతితో కూడిన శిక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 90004 87423 ఫోను నంబర్లో సంప్రదించాలని సూచించారు.
బైకును ఆటో ఢీకొని ఒకరు మృతి
మేడికొండూరు: రోడ్డుపై వేగంగా వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టడంతో బైకుపై వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన మండలంలోని సత్తెనపల్లి రోడ్డులోని గుళ్ళపాలెం అడ్డరోడ్డు వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగింది. కొరప్రాడు గ్రామానికి చెందిన పెరుగు నాగ వెంకట అనంత మోహన కుమార్, గోపి నీలం సుదర్శన్‌లు ద్విచక్ర వాహనంపై కొరప్రాడు నుంచి గుంటూరుకు బయలుదేరారు. గుళ్ళపాలెం అడ్డరోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న ఆటో వీరి వాహనాన్ని ఢీకొట్టింది. పెరుగు నాగ వెంకట అనంత మోహన్ కుమార్(23) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. నీలం గోపి సుదర్శన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆటో డ్రైవర్ పరారయ్యాడు. మేడికొండూరు పోలీసులు ప్రమాద సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నీలం గోపి సుదర్శన్‌ను మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య
ప్రేమ వివాహమైన 6 నెలలకే విషాదం
తాడికొండ: వివాహం జరిగిన 6 నెలలకే యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడికొండ మండలం ముక్కామల గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన షేక్ షన్ను(22)కు రావెల యశోదరావుతో గతేడాది మే నెలలో ప్రేమ వివాహం జరిగింది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో ముక్కామలలోని ఇంటిలో ఆమె ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ జీత్యా నాయక్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వాసు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment