జాతీయ భద్రతా మాసోత్సవాలు ప్రారంభం
నరసరావుపేట: జిల్లాలో గురువారం నుంచి జాతీయ భద్రతా మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. పోలీసు, కలెక్టరేట్ కార్యాలయాల్లో ఎస్పీ కంచి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గనోరే రోడ్డు భద్రతా బ్యానర్లు, బ్రోచర్లు ఆవిష్కరించి మాసోత్సవాలను ప్రారంభించారు. ఈ మాసోత్సవాలు ఈనెల 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహిస్తున్నామని జిల్లా రవాణాశాఖ అధికారి జి.సంజీవకుమార్ పేర్కొన్నారు. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈనెల 10 నుంచి 16 వరకు ప్రైవేటు బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అధిక చార్జీలు వసూలు చేసినందుకు 38 బస్సులపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. మరికొన్ని వాహనాలపై 74 కేసులు నమోదు చేశామన్నారు. కార్యక్రమంలో మోటారు వాహన తనిఖీ అధికారి ఎన్.శివనాగేశ్వరరావు, సహాయ మోటారు తనిఖీ అధికారులు ఎం.మనీషా, ఎంఎల్.వంశీకృష్ణ, ఎం.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఎన్‌సీసీ క్యాడెట్ల
ట్రెక్కింగ్ శిబిరం
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు ఎన్‌సీసీ గ్రూప్, 10 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఆధ్వర్యంలో తొలిసారిగా ట్రెక్కింగ్ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు గుంటూరు ఎన్‌సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ ఎస్.ఎం.చంద్రశేఖర్ తెలిపారు. అఖిల భారత మహిళా ట్రెక్కింగ్–3 పేరుతో గురువారం నుంచి ఈనెల 23 వరకు శిబిరంలో భాగంగా కొండవీడు, ఫిరంగిపురం కొండ, కోటప్పకొండలలో ఎన్‌సీసీ క్యాడెట్లు ట్రెక్కింగ్ నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ఇందు కోసం ఆంధ్ర, తెలంగాణ పరిధిలోని తొమ్మిది ఎన్‌సీసీ గ్రూపులకు చెందిన దాదాపు 600 మంది విద్యార్థినులు గురువారం గుంటూరులోని ప్రభుత్వ మహిళా కళాశాలకు చేరుకున్నారని చెప్పారు.
ఉరుసు సందర్భంగా
ట్రాఫిక్ మళ్లింపు
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): ఈనెల 17 నుంచి 21 వరకు జరగనున్న హజరత్ కాలే మస్తాన్‌షా వలియా దర్గా ఉరుసు ఉత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ మళ్లించినట్టు ట్రాఫిక్ డీఎస్పీ ఎం.రమేష్ తెలిపారు. చుట్టుగుంట వైపు నుంచి మున్సిపల్ ట్రావెల్స్ బంగ్లా (ఎంటీబీ) సెంటర్ వైపు వచ్చే కార్లు, అంతకంటే భారీ వాహనాలు ఐటీసీ కంపెనీ, నగరంపాలెం పోలీసు స్టేషన్, ఎస్‌బీఐ సెంటర్ మీదుగా ఎంటీబీ సెంటర్‌కు చేరుకోవాలని సూచించారు. చుట్టుగుంట నుంచి వచ్చే ద్విచక్రవాహనాలు, ఆటోలు చక్కల బజారు, మూడు బొమ్మల సెంటర్ మీదుగా ఎంటీబీ సెంటర్‌కు వెళ్లాలని తెలిపారు. గుంటూరు నగరం నుంచి చుట్టుగుంట వైపు వెళ్లే వాహనాలు యథావిధిగా వెళ్లవచ్చని సూచించారు.
20 నుంచి ఇంటర్
ప్రీ–ఫైనల్స్ పరీక్షలు
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు ప్రీ–ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలలతో పాటు హైస్కూల్ ప్లస్‌లలో చదువుతున్న విద్యార్థులకు ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి ప్రశ్నపత్రాలు పంపిణీ చేయనున్నారు. జిల్లాలోని నాలుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు ఆరు ఎయిడెడ్, ఐదు కాంపోజిట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రశ్నపత్రాలు సరఫరా చేయనున్నట్లు ఆర్‌ఐవో జీకే జుబేర్ తెలిపారు. ఇంటర్‌బోర్డు నిబంధల మేరకు ప్రీ–ఫైనల్స్ పరీక్షల నిర్వహణపై ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు మార్గదర్శకాలు జారీ చేసినట్లు చెప్పారు. అదే విధంగా ప్రైవేటు జూనియర్ కళాశాలల పరిధిలో ప్రీ–ఫైనల్ పరీక్షల నిర్వహణకు కళాశాలల యాజమాన్యాలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
60,180 బస్తాల మిర్చి రాక
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 60,180 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 59,267 బస్తాల అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.7,500 నుంచి రూ.15,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.7,500 నుంచి రూ.16,000 వరకు ధర లభించింది.
Comments
Please login to add a commentAdd a comment