ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న నగర కమిషనర్
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): కౌన్సిల్ సభ్యులను అవమానించడమే కాకుండా కౌన్సిల్ జరగకుండా అడ్డుపడుతున్న నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు ధ్వజమెత్తారు. పది రోజులుగా కమిషనర్ వ్యవహార శైలిపై నిరసన వ్యక్తం చేస్తున్న మేయర్ మనోహర్ గురువారం ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబుతో కలిసి బ్రాడీపేటలోని ఓ హోటల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. మేయర్ మాట్లాడుతూ ఈ నెల 4న జరిగిన నగరపాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశంలో ఓ సభ్యుడు లేవనెత్తిన అంశంపై కమిషనర్ వాకౌట్ చేసి వెళ్లిపోవడం దురదృష్టమని పేర్కొన్నారు. తన తప్పులు బయటపడతాయనే భయంతోనే ఆయన బయటకు వెళ్లిపోయారని విమర్శించారు. ఓ అధికారి వాకౌట్ చేసి వెళ్లిపోవడం అంటే కౌన్సిల్‌ను అవమానించడమేనని పేర్కొన్నారు. కౌన్సిల్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. ఆయన వెళ్లిపోయినా కౌన్సిల్ నిర్వహణకు సహకరించాలని తాను రెండుసార్లు ఫోన్ చేసినా కమిషనర్ స్పందించలేదని వివరించారు. వాయిదా పడిన కౌన్సిల్ సమావేశాన్ని ఈనెల 17న నిర్వహించాలని ఇప్పటికే రెండుసార్లు కమిషనర్‌కు లేఖ రాసినా స్పందన లేదని పేర్కొన్నారు. కమిషనర్ వ్యవహార శైలి సరిగా లేదని, ఏదేమైనా శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కౌన్సిల్ సమావేశానికి తాము హాజరవుతామని మేయర్ కావటి స్పష్టం చేశారు.
మేయర్ మనోహర్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి,
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment