క్యారమ్స్ క‘మనీ’యం
గుంటూరు వెస్ట్: క్యారమ్స్ అంటే అతి సాధారణ క్రీడగా కొందరు భావిస్తారు. అయితే రాణిస్తే ఇందులోనూ పేరు ప్రఖ్యాతులతోపాటు రూ.కోట్లు పొందవచ్చు. తమిళనాడుకు చెందిన ఎ.మరియ ఇరుదయంకు ఇదే క్రీడలో అర్జున అవార్డు(1996) లభించింది. గత ఏడాది అమెరికాలో జరిగిన 6వ ప్రపంచ కప్ క్యారమ్స్ చాంపియన్‌షిప్‌లో తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల ఖాజీమా మహిళా విభాగంలో ప్రపంచ విజేతగా నిలిచారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు రూ.కోటి బహుమతి ఇచ్చింది.
డీపీసీఎల్ సిద్ధం
క్యారమ్స్‌లోనూ ఐపీఎల్ తరహా టోర్నీ డెక్కన్ ప్రీమియర్ క్యారమ్స్ లీగ్(డీపీఎల్) 2022 నుంచి జరుగుతోంది. ఈ ఏడాది సీజన్–3 జరగనుంది. దేశంలోని అత్యుత్తమ ప్లేయర్స్‌ను ఒకే వేదికపైకి తెచ్చి వారి ప్రతిభకు చక్కని నజరానా అందించే టోర్నీ ఇది. సీజన్–3ని వజ్రా స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహించనుంది. ప్రముఖ క్యారమ్స్ క్రీడాకారులను వేలంలో కొనుగోలు చేసి వారిని బృందాలుగా విభజించి పోటీలు నిర్వహిస్తుంది. టోర్నీలో రూ.12 లక్షలకుపైగానే విజేతలకు బహుమతుల ద్వారా అందించనున్నారు. వీరికి ఆంధ్రా క్యారమ్స్ అసోసియేషన్ అన్ని విధాలుగా సహకరిస్తోంది. క్యారమ్స్‌కు అంతర్జాతీయ ఖ్యాతితోపాటు కార్పొరేట్ హోదా తీసుకొచ్చేందుకు నాలుగేళ్ల నుంచి ఆంధ్రా క్యారమ్స్ అసోసియేషన్ పెద్దలు కృషి చేస్తున్నారు.
మూడోసారి పోటీలు..
ఈ మెగా టోర్నీని మూడోసారి నిర్వహిస్తున్నారు. తొలుత విశాఖలో 2022లో నిర్వహించగా అప్పుడు ప్రైజ్ మనీగా రూ.4 లక్షలు అందించారు. దీనిని హైదరాబాద్‌కు చెందిన గోల్కొండ వారియర్స్ గెలుచుకుంది. రెండోసారి 2023లో నిజామాబాద్‌లో రూ.7 లక్షల ప్రైజ్‌మనీతో ఏర్పాటు చేయగా టెకౌట్ డీజీ చాంప్స్ గెలుపొందింది. ఇప్పుడు మూడోసారి విశాఖలోని అత్యాధునిక ఎస్3 స్పోర్ట్స్ ఎరీనా స్టేడియంలో ఈ నెల 17 శుక్రవారం నుంచి నిర్వహించనున్నారు.
జట్ల ప్రత్యేకతలు
దేశంలోని ప్రఖ్యాత క్యారమ్స్ ప్లేయర్స్ పాల్గొనే ఈ సమరంలో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ఒక్కొక్క జట్టులో ఆరుగురు పురుషులు, ఒక మహిళతో సహా ఏడుగురు ప్లేయర్స్ ఉంటారు. ఇటీవల నిర్వహించిన వేలంలో వీరిలో కొందరికి రూ.లక్ష వరకు చెల్లించి జట్లు ఎంపిక చేసుకున్నాయి. గ్రీన్ కలర్ క్యారమ్ బోర్డుపై మిల్క్ వైట్ కాయిన్స్‌తో క్రీడాకారులు తలపడతారు. జట్టు ఎంట్రీ ఫీజు రూ.3 లక్షలు. రౌండ్ రాబిన్ లీగ్‌తో ప్రారంభమై టాప్ 4 జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి. అక్కడి నుంచి ఓటమి పొందే జట్లు టోర్నీ నుంచి తప్పుకుంటాయి. చివరకు విజేతను నిర్ణయిస్తారు. దీని కోసం ఆంధ్రా క్యారమ్స్ అసోసియేషన్ అంతర్జాతీయ రిఫరీలను నియమించింది. కొన్ని చానళ్లలో మ్యాచ్‌ల లైవ్‌కు ఏర్పాట్లు చేస్తోంది.
ఐపీఎల్ తరహాలో డీపీసీఎల్ దేశంలోని అత్యుత్తమ ప్లేయర్స్ సమరం బహుమతుల విలువ రూ.12 లక్షలు పైమాటే నేటి నుంచి విశాఖలో టోర్నీ ప్రారంభం
ప్రజలకు చేరువ చేసేందుకే
క్యారమ్స్ క్రీడలో భారత్‌కు మంచి పేరుంది. దీనిని మరింత పెంచడంతోపాటు ప్రజలకు చేరువ చేసేందుకు ఇటువంటి మెగా టోర్నమెంట్ ఉపయోగపడుతుంది. టోర్నమెంట్ నిర్వహించేందుకు ముందుకు వచ్చిన వజ్రా స్పోర్ట్స్‌కు ధన్యవాదాలు. దేశంలోని ప్రముఖ, ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారులు పాల్గొనడంతో ఔత్సాహికులకు నేర్చుకునేందుకు ఎంతో అవకాశం లభిస్తుంది.
–డాక్టర్ నీరజ్ కుమార్ సంపతి, రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రా క్యారమ్స్ అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment