సోదర సోదరీమణుల మధ్య బంధాలు, అనుబంధాలు... అప్యాయత అనురాగాలు కలకాలం విలసిల్లాలని జరుపుకునే పండగే రక్షాబంధన్. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా, అక్కకి తమ్ముడు, తమ్ముడికి అక్క జీవితాంతం భరోసాగా ఉంటామని చెప్పే రక్షాబంధన్ రోజు. తమ అన్నయ్యలు, తమ్ముళ్లకు మంచి మంచి డిజైన్‌లలో ఉన్న రాఖీలను ఏరికోరి కొనుక్కొచ్చి కడతారు తోబుట్టువులు. రాఖీ పండగ రోజు తమ సోదరులు ఎక్కడ ఉంటే అక్కడికి స్వీట్లు, రాఖీలు పట్టుకుని వెళ్లి ఎంతో ప్రేమగా కడతారు. ఇదంతా గత కొన్నేళ్లుగా మనదేశంలో పాటిస్తోన్న సంప్రదాయమే.
శ్రావణ పౌర్ణమి రాఖీ వేడుకలపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. పండుగ ఎప్పుడు అన్నదానిపై చాలా మందిలో సంధిగ్థత నెలకొంది. బుధవారం జరుపుకోవాలని కొందరు.. కాదు కాదు గురువారం జరుపుకోవాలని మరికొందరు చెబుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో విస్తృతంగా ఎవరికి తోచినట్టు వారు పోస్టింగ్ లు పెడుతున్నారు.
గురువారమే సరైన ముహూర్తం : భద్రకాళి ఆలయ సిద్ధాంతి
రాఖీ పౌర్ణమిని ఈ నెల 31వ తేదీ గురువారం జరుపుకోవాలని వరంగల్ భద్రకాళి దేవస్థాన ఆస్థాన పండితులు అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి తెలిపారు. కాజీపేట పట్టణంలోని స్వయంభు శ్రీశ్వేతార్కమూల గణపతి దివ్య క్షేత్రంలో మల్లయ శర్మ సిద్ధాంతి విలేకరులతో మాట్లాడుతూ 30న పౌర్ణమి తిథి ఉదయం 10.23 నిమిషాల తదుపరి ప్రవేశమై 31న ఉదయం 7.55 నిమిషాల వరకు ఉంటుందన్నారు. 6.02 నిమిషాలకే సూర్యోదయం అవుతున్న నేపథ్యంలో 31న రాఖీ వేడుకలను జరుపుకోవాలని కోరారు.
ఉదయమే నుంచే పౌర్ణమి వేడుకలు : అర్చక సంఘం
రాఖీ పండుగపై వస్తున్న అపోహాలను నమ్మవద్దని జిల్లా అర్చక పురోహిత సంఘం ప్రకటించింది. రాఖీ పౌర్ణమి గురువారం రోజున ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు రాఖీలు కట్టుకోవచ్చునన్నారు. ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు జంజరములు వేసుకోవచ్చునని అర్చక సంఘం జిల్లా నాయకులు మురళీ కృష్ణమాచార్యులు, శ్రీనివాస్ ఆచార్యులు ప్రకటనలో పేర్కొన్నారు.
సరికొత్త సంప్రదాయానికి నాంది పలికిన బల్కంపేట ఆలయం
హైదరాబాద్/ సనత్‌నగర్: బల్కంపేట ఎల్లమ్మ–పోచమ్మ దేవస్థానం పాలక మండలి సభ్యులు మునుపెన్నడూ లేని సరికొత్త సంప్రదాయానికి నాంది పలికారు. పురాణాల ప్రకారం బల్కంపేట ఎల్లమ్మ తల్లికి సోదరుడైన కొమురవెల్లి మల్లన్నకు రాఖీ అందించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారికి వెండి రాఖీని, పట్టువస్త్రాలను సమర్పించారు. అంతకముందు రాఖీని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ముందు ఉంచి పూజలు జరిపి తీసుకువెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment