![వడివడిగా ‘ప్రాదేశిక’ం వైపు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/voterfingure_mr-1739332265-0.jpg.webp?itok=IrPhCYnm)
వడివడిగా ‘ప్రాదేశిక’ం వైపు
హన్మకొండ: ప్రాదేశిక ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. అధికార యంత్రాంగమంతా స్థానిక సంస్థల ఎన్నికల పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఈక్రమంలో మంగళవారం పోలింగ్ బూత్‌ల ముసాయిదా డ్రాఫ్ట్‌ను జిల్లా ఎన్నికల అధికారులు విడుదల చేశారు. పోలింగ్ బూత్‌లపై ఏవైనా అభ్యంతరాలుంటే ఆయా మండల ఎంపీడీఓలకు ఈనెల 13లోగా తెలియజేయాలి. 14న అభ్యంతరాలు పరిశీలిస్తారు. 15వ తేదీన పోలింగ్ బూత్‌ల తుది జాబితాను ప్రకటిస్తారు.
జిల్లాలో ఇలా..
హనుమకొండ జిల్లాలో మొత్తం 129 మండల ప్రజాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, 12 జిల్లా ప్రజాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలున్నాయి. గ్రామ పంచాయతీలు 210 ఉన్నాయి. మొత్తం పోలింగ్ బూత్‌లు 631 ఏర్పాటు చేశారు. ఇందులో 500లోపు ఓటర్లున్న పోలింగ్ బూత్‌లు 95 కాగా.. 500లకు పైగా ఓటర్లున్న పోలింగ్ బూత్‌లు 536 ఉన్నాయి. జిల్లాలో 4,34,617 మంది జనాభా ఉండగా.. ఓటర్లు 3,72,646 మంది ఉన్నారు.
శిక్షణ.. సన్నద్ధం
నామినేషన్ల స్వీకరణకు 46 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. మండలాల వారీగా ఎంపీటీసీల సంఖ్యను బట్టి 2 నుంచి 6 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. అతి తక్కువగా పరకాల మండలంలో 2 క్లస్టర్లు ఏర్పాటు చేయగా.. కమలాపూర్ మండలంలో అత్యధికంగా 6 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు మండలానికి ఒకటి చొప్పున 12 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు 58 మంది చొప్పున రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు. జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు 13 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు. ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లకు నియమించిన రిటర్నింగ్ ఆఫీసర్లు, జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు చేసిన 46 క్లస్టర్లకు 46 మంది రిటర్నింగ్, 46 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు అవసరం ఉండగా.. ముందు జాగ్రత్తలో భాగంగా అదనంగా 122 మంది చొప్పున ఎంపిక చేశారు. జెడ్పీటీసీ నామినేషన్లకు అదనంగా ఒకరిని రిటర్నింగ్ అధికారిగా ఎంపిక చేశారు. వీరికి ఈనెల 12న శిక్షణ ఇస్తున్నారు. హనుమకొండ జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు హనుమకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు, మధ్యాహ్నం 3 గంటలకు పరకాల రెవెన్యూ డివిజన్ పరిధి రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇస్తారు. ఇప్పటికే 12 మంది మాస్టర్ ట్రైనర్లను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. మాస్టర్ ట్రైనర్స్ వీరికి శిక్షణ ఇస్తారు.
పోలింగ్ బూత్‌ల డ్రాఫ్ట్ విడుదల
ఈనెల 13 వరకు
అభ్యంతరాల స్వీకరణ
15న పోలింగ్ స్టేషన్ల జాబితా
తుది ప్రకటన
వరంగల్ జిల్లాలో 646 పోలింగ్ స్టేషన్లు
వరంగల్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం వరంగల్ జిల్లాలోని 11 మండలాల్లో 3,85,163 మంది ఓటర్లకు 646 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తూ జెడ్పీ సీఈఓ రాంరెడ్డి ముసాయిదాను విడుదల చేశారు. చెన్నారావుపేట మండలంలో 55, దుగ్గొండి 65, గీసుకొండ 48, ఖానాపురం 48, నర్సంపేట 36, నల్లబెల్లి 53, నెక్కొండ 81, పర్వతగిరి 69, రాయపర్తి 78, సంగెం 66, వర్ధన్నపేటలో 47 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment