సాక్షిప్రతినిధి, వరంగల్: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకునేందుకు రైతులు ఈసారి అరిగోస పడుతున్నారు. ఓ వైపు పత్తి రైతులను ‘తేమ’ గండం వెంటాడుతుంటే.. మరోవైపు వరి సాగు చేసిన రైతులకు కొనుగోలు కేంద్రాల నిర్వహణ సరిగ్గా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనగామ, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం భారీగా తరలివస్తుండగా.. జేఎస్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోనూ వరికోతలు ఊపందుకున్నాయి. సీజన్ ఆరంభంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) శాతం (ఔట్ టర్న్)ను 67 నుంచి 58 శాతానికి తగ్గిస్తేనే ధాన్యం దించుకుంటామని రైస్ మిల్లర్లు అభ్యంతరాలు చెప్పారు. ఆయా జిల్లాల అడిషనల్ కలెక్టర్లు రైస్‌మిల్లర్ల సంక్షేమ సంఘాలతో చర్చలు జరిపినా చాలాచోట్ల మిల్లర్లు ఇంకా ముందుకు రావడం లేదు.
ఆ మెలిక అలాగే..
ఉమ్మడి జిల్లాలో సాగైన 9,02,233 ఎకరాలకుగాను ఈసారి రైతులు సుమారు లక్ష ఎకరాల్లో మాత్రమే దొడ్డు రకాలు వేయగా.. 90 శాతం వరకు సన్నరకాలే వేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో వాతావరణ ప్రభావం కారణంగా క్వింటాకు 67 శాతం బియ్యం సీఎంఆర్ ఇవ్వలేమని మొదటి నుంచి చెబుతున్న రైస్ మిల్లర్ల పేచీ ఇంకా అలాగే సాగుతోంది. దీనికి తోడు ఈసారి మిల్లింగ్ నిబంధనలు సడలించి క్వింటాకు కొంత పరిహారం కస్టోడియన్, మిల్లింగ్, రవాణా చార్జీలు పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా సోమవారం కూడా పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌కు వరంగల్ రైస్‌మిల్లర్ల సంక్షేమ సంఘం లేఖ రాసింది. మిల్లుల్లో ధాన్యం దిగుమతి చేసుకుంటున్నా.. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని రా రైస్, పారాబాయిల్డ్ రైస్‌మిల్లుల సంక్షేమ సంఘం హనుమకొండ, వరంగల్ జిల్లాల కమిటీలు కోరాయి. ఇప్పటికే పలు దఫాలు వానాకాలం ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ తరలింపులపై రైస్‌మిల్లర్ల సంఘాలతో ఆయా జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లతో పాటు పౌరసరఫరాల సంస్థ అధికారులు సంప్రదింపులు జరిపారు. తాజా డిమాండ్లను కమిషనర్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్న హామీతో మిల్లర్లు ధాన్యాన్ని దింపుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
వరి సాగు విస్తీర్ణం (అంచనా): 8.10 లక్షల ఎకరాలు
సాగైన విస్తీర్ణం: 9,02,233
ధాన్యం కొనుగోలు లక్ష్యం: 12.25 లక్షల మె.టన్నులు
ప్రతిపాదిత కొనుగోలు కేంద్రాలు: 1,128
ఇప్పటి వరకు ప్రారంభించినవి: 672
కొనుగోలు చేసిన ధాన్యం: 2.32 లక్షల మె.టన్నులు
ఉమ్మడి జిల్లాలో 1,128
ధాన్యం కొనుగోలు కేంద్రాలు
వాటిలో ప్రారంభించినవి 672
ఇప్పటివరకు సేకరించిన
ధాన్యం 2.32 లక్షల మెట్రిక్ టన్నులే..
Comments
Please login to add a commentAdd a comment