చనిపోయిన వారు ఉపాధి పనులకు!
హసన్‌పర్తి: చనిపోయిన వారు ఉపాధి హామీ పనులు చేసినట్లు చూపి, డబ్బులు డ్రా చేశారనే ఆరోపణలపై అన్నాసాగరం గ్రామస్తులు గ్రీవెన్స్‌లో ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం డీఆర్‌డీఏ అధికారులు గ్రామంలో విచారణ చేపట్టారు. విచారణ అధికారులు ఏపీడీ శ్రీనివాస్, ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్‌కు స్థానికుడు రామంచ మధుకర్ అక్రమాలపై ఫిర్యాదు చేశాడు. చనిపోయిన రామంచ వజ్రమ్మ, రామంచ భాస్కర్ ఉపాధి పనులకు వెళ్లినట్లుగా డబ్బులు డ్రా చేశారని చెప్పాడు. గ్రామంలో లేని కేతమ్మ, ఓప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న వారు కూడా కూలికి వెళ్లినట్లు మస్టర్లు ఉన్నాయని విచారణాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఫీల్డ్‌అసిస్టెంట్ తన ఇంటి పనులు చేయించుకుని ఉపాధి హామీ పథకం కింద పనులు చేసినట్లు మస్టర్లు రాశాడని పేర్కొన్నాడు. ఈ విషయమై సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలని కోరాడు. చనిపోయిన వారు ఎలా కూలి పనులు పనిచేస్తారు, వారికి డబ్బులు ఎలా చెల్లిస్తారని స్థానికులు విచారణాఽఽధికారులను ప్రశ్నించారు. ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ఆరోపణలపై గ్రామసభ నిర్వహిస్తామని తెలిపారు. అక్రమాలు జరిగినట్లు తేలితే సదరు ఫీల్డ్ అసిస్టెంట్, ఇతర అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీఓ విజయలక్ష్మి పంచాయతీ కార్యదర్శి కల్పన పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment