పట్టణీకరణ వైపు పరుగులు
సాక్షిప్రతినిధి, వరంగల్:
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతోపాటు పట్టణీకరణపైన ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటాను జోడించి నిధులను సద్వినియోగం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో తెలంగాణలో కొత్త మున్సిపాలిటీలు, అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో వీలైనన్నీ మేజర్ గ్రామ పంచాయతీలు అప్‌గ్రేడై మున్సిపాలిటీలుగా మారనున్నాయి. అదే విధంగా కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) పరిధి కూడా విస్తరించనుంది. ఈ క్రమంలోనే ఆగస్టు మాసంలో ‘కుడా’ విస్తరణతోపాటు ఉమ్మడి జిల్లాలో ఐదు రెవెన్యూ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చాలంటూ ప్రజాప్రతినిధులు చేసిన ప్రతిపాదనలకు పురపాలకశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే మున్సిపాలిటీలు, కుడాలో విలీనమయ్యే గ్రామ పంచాయతీల తీర్మానాలు, ప్రజల అభిప్రాయాల సేకరణ ఇటీవలే పూర్తి కాగా.. పురపాలక శాఖ ఆ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. దీంతో ఉమ్మడి వరంగల్‌లో ఒక నగరపాలక సంస్థ (గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్), 14 మున్సిపాలిటీలు కానున్నాయి.
281 గ్రామాలు, 2800 చ.కి.మీటర్లకు
‘కుడా’ విస్తరణ..
కాకతీయ పట్టణాభివద్ధి సంస్థ (కుడా) విస్తరణ ప్రక్రియ అధికారికంగా తుదిదశకు చేరింది. ఆదాయ మార్గాలు పెంచుకోవడంతోపాటు అభివృద్ధి, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని చేసిన కుడా విస్తరణ ప్రతిపాదనలకు పచ్చ జెండా ఊపింది. ప్రస్తుతం కుడా పరిధి 1,805 చదరపు కిలోమీటర్లు ఉండగా, దానిని 2,800 చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది. ప్రస్తుతం ‘కుడా’ పరిధిలో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని 19 మండలాలు,181 గ్రామాలుండగా, పరకాల, భూపాలపల్లి, నర్సంపేట జనగామ పట్టణాలతో పాటు సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లోని హుస్నాబాద్, హుజూరాబాద్‌ను కూడా తీసుకువస్తున్నట్లు చేసిన ప్రతిపాదనలకు కూడా ప్రభుత్వం ఓకే చెప్పినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు విలీనానికి అనుకూలంగా తీర్మానాలు చేసి పంపించాలని గ్రామ పంచాయతీలకు కలెక్టర్ కార్యాలయం నుంచి జారీ అయిన సర్క్యులర్లకు సానుకూల స్పందన రాగా... హుస్నాబాద్, వర్ధన్నపేట, భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, జనగామ ఎమ్మెల్యేలు కూడా ‘కుడా’ విస్తరణపై జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. పరిధి పెంపు వల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయం పెరగనుండగా.. తమ ఆదాయం తగ్గిపోతుందని విలీనాన్ని కొన్ని జీపీలు మొదట వ్యతిరేకించాయి. గ్రామ పంచాయతీల కాలపరిమితి ముగిసిన తర్వాత ఈ ప్రక్రియను పూర్తి చేయడం అధికారులకు సులువుగా మారి.. ‘కుడా’ విస్తరణకు మార్గం సుగమమైంది.
కొత్తగా ఐదు మున్సిపాలిటీలు
1. ఆత్మకూరు: తిరుమలగిరి, ఆత్మకూరు, గూడెప్పాడ్, కామారంతోపాటు నీరుకుళ్ల, పెంచికలపేట, దుగ్గొండి మండలంలోని కేశవాపురం గ్రామాలు.
2. నెక్కొండ: వరంగల్ జిల్లాలోని నెక్కొండ, గుండ్రపల్లి, అమీర్‌పేట, నెక్కొండ తండా పరిపాక టీకే తండా.
3. కేసముద్రం: కేసముద్రం టౌన్, కేసముద్రం విలేజ్. అమీనాపురం, ధనసరి గ్రామాలు.
4. స్టేషన్‌ఘన్‌పూర్: ఛాగల్లు, స్టేషన్‌ఘన్‌పూర్ శివునిపల్లి గ్రామ పంచాయతీలు.
5. ములుగు: ములుగు, బండారుపల్లి, జీవంత రావుపల్లి గ్రామాలు.
ఇప్పుడున్న పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు, భూపాలపల్లి, జనగామ మున్సిపాలిటీలకు తోడు కొత్తగా ఐదింటితో మున్సిపాలిటీల సంఖ్య 14కు చేరనుంది.
మరో ఐదు మున్సిపాలిటీలకు గ్రీన్‌సిగ్నల్
ఉమ్మడి వరంగల్‌లో 14కు
చేరనున్న సంఖ్య
‘కుడా’ విస్తరణ ఫైలుకు పచ్చజెండా.. 2,800 చ.కి.మీటర్లకు పరిధి
పురపాలకశాఖకు
పంచాయతీల లేఖలు..
మున్సిపాలిటీల ఏర్పాటుకు
పూర్తయిన ప్రక్రియ
Comments
Please login to add a commentAdd a comment