అరుణాచలానికి బస్సు ప్రారంభం
హన్మకొండ: కార్తీక పౌర్ణమి గిరి ప్రదర్శనకు వెళ్తున్న భక్తుల సౌకర్యార్థం హనుమకొండ నుంచి అరుణాచలం నడిచే బస్సును ఆర్టీసీ డిప్యూటీ ఆర్‌ఎంలు మాధవరావు, కేశరాజు భానుకిరణ్ బుధవారం ప్రారంభించారు. మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా బస్ స్టేషన్ నుంచి సూపర్ లగ్జరీ బస్ భక్తులతో బయల్దేరగా.. వారు జెండా ఊపి ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి నెలా పౌర్ణమికి రెండు రోజుల ముందు ఆర్టీసీ బస్సు నడుపుతున్నట్లు వారు తెలిపారు. భక్తులు ఈసౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వరంగల్–2 డిపో మేనేజర్ జ్యోత్స్న, అసిస్టెంట్ మేనేజర్లు శ్రీనివాసులు, చిమ్మని సంతోశ్ పాల్గొన్నారు.
వైభవంగా తులసీధాత్రి,
నారాయణ స్వామి కల్యాణం
హన్మకొండ కల్చరల్ : శ్రీరుద్రేశ్వరస్వామివారి వేయిస్తంభాల దేవాలయంలో కార్తీకశుద్ధ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని బుధవారం రావిచెట్టు వద్ద ఏర్పాటు చేసిన వేదికపై ధాత్రినారాయణస్వామిని (ఉసిరిక చెట్టు), లక్ష్మీస్వరూపమైన (తులసిచెట్టు)ను ప్రతిష్ఠించి కల్యాణోత్సవం నిర్వహించారు. కృష్ణయజుర్వేద పండితులు గుదిమెళ్ల విజయకుమారాచార్యులు కల్యాణ క్రతువు నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీరుద్రేశ్వరమహాశివలింగానికి పెరుగన్నంతో మహా అన్నపూజ నిర్వహించారు. ఆలయ ఈఓ వెంకటయ్య ఏర్పాట్లను పర్యవేక్షించారు. కమ్మ సేవా సంఘం రాష్ట్ర నాయకుడు తాళ్లూరి వెంకటేశ్వరరావు, మంజుల దంపతుల ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలు జరిగాయి. నేడు స్వామివారికి లక్ష బిల్వార్చన, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహిస్తున్నట్లు అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.
అలరించిన సంగీత
నృత్య కళార్చన
హన్మకొండ కల్చరల్: విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో కళార్చన నెలవారీ సాంస్కృతిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బుధవారం సాయంత్రం భద్రకాళి ఆలయంలో హిందుస్థానీ గాత్రం, సితార్, కర్టాటక, వయోలిన్, కూచిపూడి నృత్యం, పేరిణి నృత్య విభాగాధిపతుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డిప్లమా, సర్టిఫికెట్ సంగీత, నృత్య కోర్సు విద్యార్థులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈసందర్భంగా విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ నాడ్గౌడ సుధీర్‌కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ద్వారా విద్యార్థులకు హిందుస్థానీ గాత్రం, పేరిణి, కూచిపూడి నృత్యం, సితార్, వయోలిన్, కర్ణాటక గాత్రం అందిస్తున్నామని తెలిపారు. కళాశాల సిబ్బంది శంకర్, విద్యార్థులు, తల్లిదండ్రులు, సంగీతాభిమానులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment