సమాజ శ్రేయస్సు కోరిన కాళోజీ సోదరులు
విద్యారణ్యపురి: కాళోజీ సోదరులు జీవించినంత కాలం రాజ్యం నిరంకుశ పోకడలను నిరసించి ప్రజల పక్షం వహించి సమాజ శ్రేయస్సును ఆకాంక్షించారని ప్రముఖ కవి, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం అన్నారు. బుధవారం రాత్రి హనుమకొండలోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాలలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అధ్యక్షతన జరిగిన కాళోజీ సోదరుల యాది సభ, స్మారక పురస్కారాల ప్రదానం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పీడిత ప్రజల పక్షాన పని చేయడమే కాకుండా నిద్రాణమైన తెలంగాణ సమాజాన్ని తమ కవిత్వంతో మేలుకొలిపిన గొప్ప కవులు కాళోజీ సోదరులు అన్నారు. కాళోజీ ఫౌండేషన్ కార్యదర్శి వి.ఆర్.విద్యార్థి.. 30 సంవత్సరాలుగా కాళోజీ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాల నివేదిక సమర్పించారు. అనంతరం కాళోజీ ఫౌండేషన్ కోశాధికారి పందిళ్ల అశోక్ కుమార్ పురస్కార గ్రహీతలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ ఎన్‌వీఎన్ చారి సైటేషన్ చదువుతుండగా షాద్ రామేశ్వర్ రావు స్మారక పురస్కారాన్ని వహీద్ గుల్షన్‌కు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్మారక పురస్కారాన్ని దారు శిల్పి మర్రి గోపాల్ రెడ్డికి ప్రదానం చేశారు. కార్యక్రమానికి సంయోజకులుగా కాళోజీ ఫౌండేషన్ కార్యనిర్వహక కార్యదర్శి డాక్టర్ ఆగపాటి రాజ్‌కుమార్ వ్యవహరించగా సాహితీవేత్తలు, పరిశోధక విద్యార్థులు, కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు.
రచయితల సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం
Comments
Please login to add a commentAdd a comment