‘ఎల్‌ఆర్‌ఎస్’పై నిర్లక్ష్యం వద్దు
● మేయర్ గుండు సుధారాణి
● అధికారులతో సమీక్ష
వరంగల్ అర్బన్: ‘ఆరంభ శూరత్వం’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మేయర్ గుండు సుధారాణి స్పందించారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులపై నిర్లక్ష్యం తగదని ప్రతీ ఉద్యోగి రోజుకు 20 ఫైల్స్ క్లియర్ చేయాలని అధికారులను హెచ్చరించారు. శనివారం బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. 90 వేల పైచిలుకు దరఖాస్తుల్లో చాలా తక్కువ మొత్తంతో దరఖాస్తులు పరిశీలించడం సరికాదని, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సిబ్బంది సమన్వయ లోపం కారణంగా అనుకున్నంత స్థాయిలో దరఖాస్తుల పరిష్కారం జరగడం లేదన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులను ఆయా శాఖల సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ.. దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండు జిల్లాల కలెక్టర్లు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై సీరియస్‌గా ఉన్నారని గుర్తు చేశారు. దరఖాస్తుదారుల సమస్య పరిష్కారానికి హెల్ప్‌డెస్క్‌పై అవగాహన కల్పించాలన్నారు. కాగా.. నగరంలో కొనసాగుతున్న, చేపట్టబోయే పనుల వివరాలను మేయర్ ఆరా తీశారు. సమీక్షలో ఎస్‌ఈ ప్రవీణ్‌చంద్ర, ఇన్‌చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, ఈఈలు శ్రీనివాస్ మహేందర్, ఐటీ మేనేజర్ రమేశ్, డీఈలు ఏసీపీలు, ఏఈలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment