హన్మకొండ అర్బన్: రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు తాము ఆసక్తిగా ఉన్నామంటూ వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. ప్రస్తుతం వీరి దరఖాస్తులను జిల్లా అధికారులు పరిశీలిస్తున్నారు. జిల్లాలో మొత్తం 206 మంది మాతృశాఖ రెవెన్యూకు రావడానికి ఆసక్తి కనబర్చారు. కాగా.. గత ప్రభుత్వం 2018లో వీఆర్‌ఓల వ్యవస్థను రద్దు చేసింది. వీర్‌ఓల వల్లనే రెవన్యూ వ్యవస్థ నాశనం అయ్యిందని ఆరోపిస్తూ వారిని వివిధ ప్రభుత్వ శాఖల్లోకి బలవంతంగా పంపించారు. ఆతర్వాత గ్రామస్థాయిలో వీఆర్‌ఏల వ్యవస్థను కూడా పూర్తిగా రద్దు చేసిన ప్రభుత్వం వారిని కూడా ఇతర శాఖలకు పంపించింది. వీరిలో కొందరు సుదూర ప్రాంతాలకు బదిలీ అయినవారున్నారు. ఇప్పటికీ వారంతా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రస్తుత ప్రభుత్వం ధరణి స్థానంలో కొత్త వ్యవస్థను తీసుకొస్తోంది. దీంతో గ్రామస్థాయిలో రెవెన్యూ సిబ్బంది అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం జూనియర్ రెవెన్యూ అధికారులను నియమించాలని నిర్ణయించింది. అయితే కొత్త వారితో కాకుండా.. గతంలో రెవెన్యూ శాఖలో పని చేసి ఇతర శాఖలకు వెళ్లిన వారిలో ఎవరైనా సొంత శాఖకు వచ్చి పని చేసేందుకు ఆసక్తి ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఆన్‌లైన్ దరఖాస్తులు..
ప్రభుత్వం ఆసక్తి ఉన్నవారిని ఆన్‌లైన్ ద్వారా గూగుల్ షీట్‌లో వివరాలు పూర్తి చేసి సంబంధిత పత్రాలు, ఇతర వివరాలు అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది. ఈనెల 24 నుంచి 28 వరకు ఈప్రక్రియ సాగింది. ప్రస్తుతం వారి దరఖాస్తుల్ని జిల్లా అధికారులు పరిశీలిస్తున్నారు. లోపాలు ఉన్నట్‌లైతే సవరించి ప్రభుత్వానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
206 మంది దరఖాస్తు..
గతంలో జిల్లా నుంచి వీఆర్‌ఓలు 138 మంది, వీఆర్‌ఏలు 308 మంది పదోన్నతులు, వ్యవస్థ రద్దు కారణంగా ఇతర శాఖల్లో సర్దుబాటు చేశారు. ప్రస్తుతం వారిలో 206 మంది తాము మాతృ శాఖకు వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎక్కువమంది ఇరిగేషన్ శాఖకు లష్కర్లు, హెల్పర్లుగా వెళ్లినవారు ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇంటర్ విద్యార్హత కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా నుంచి వెళ్లిన జాబితాపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
206 మంది ఆన్‌లైన్‌లో అర్జీలు
వివరాలు పరిశీలిస్తున్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment