ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభించిన సీపీ
వరంగల్ క్రైం: వరంగల్ కమిషనరేట్ పోలీసులకు నిర్వహిస్తున్న క్రీడల్లో భాగంగా శనివారం కాజీపేటలోని సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ మైదానంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభించారు. సెంట్రల్ జోన్, అర్మూడ్ రిజర్వ్‌డ్ విభాగాల మధ్య జరిగిన పోటీలను సీపీ ప్రారంభించారు. ఆటగాళ్లను పరిచయం చేసుకోని వారిలో ఉత్సాహం నింపారు.
కేయూ తెలుగు విభాగం
ఇన్‌చార్జ్ అధిపతిగా సురేశ్‌లాల్
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం ఇన్‌చార్జ్ అధిపతిగా యూనివర్సిటీ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్, ఎకనామిక్స్ విభాగం ఆచార్యుడు బి. సురేశ్‌లాల్ నియమితులయ్యారు. ఈ మేరకు రిజిస్ట్రార్ పి. మల్లారెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. కేయూ తెలుగు విభాగం అధిపతి, బీఓఎస్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్ ఏటూరుజ్యోతి ఇటీవల మృతి చెందడంతో ఆ రెండు పదవులు ఖాళీ అయ్యాయి. అయితే తెలుగు విభాగంలో రెగ్యులర్ అధ్యాపకులు ఎవరూ లేరు. నలుగురు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. ఆ నలుగురూ పదవులు ఆశిస్తున్నారు. అంతేగాకుండా ఒకరిపై మరొకరు వివిధ ఆరోపణలు చేసుకుంటుండగా అందులో ఎవరిని విభాగం అధిపతిగా, బీఓఎస్‌గా నియమించాలని అధికారులు ఎటుతేల్చుకోలేకపోతున్నారు. దీనిపై కమిటీని నియమించి రిపోర్టు ఆధారంగా ఆ పదవుల్లో ఇద్దరు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించాలని అధికారులు యోచిస్తున్నారని తెలిసింది. అప్పటివరకు ఇన్‌చార్జ్ విభాగం అధిపతిగా యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ బి. సురేశ్‌లాల్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. బోర్డు ఆఫ్‌స్టడీస్ చైర్మన్ పదవిలో ఇంకా ఎవరినీ నియమించలేదు.
హెచ్‌ఎంకు షోకాజ్ నోటీస్
విద్యారణ్యపురి : కాజీపేట మండలం తరాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి.అరుణకు షోకాజ్ నోటీస్ జారీచేసినట్లు హనుమకొండ డీఈఓ వాసంతి తెలిపారు. సంక్రాంతి సెలవుల అనంతరం శనివారం నుంచి పదోతరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళలో ప్రత్యేక తరగతులు నిర్వహించాల్సి ఉంది. కానీ ఉదయం పూట 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించలేదనే ఫిర్యాదు మేరకు సదరు హెచ్‌ఎంకు షోకాజ్ నోటీస్ జారీచేసినట్లు డీఈఓ వెల్లడించారు. ఈనెల 18వ తేదీనుంచి ఉదయం, సాయంత్రం పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఇదివరకే ఆదేశించామని తెలిపారు. హెచ్‌ఎంపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని డీఈఓ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment