‘చర్లపల్లి’కి గ్రహణం వీడేనా!
నవంబర్‌లోనే టెర్మినల్‌ను ప్రారంభిస్తామన్న కేంద్రమంత్రి
సాక్షి, సిటీబ్యూరో: చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు గ్రహణం వీడటం లేదు. పనులు పూర్తయి నెలలు గడిచినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. స్టేషన్‌కు రాకపోకలు సాగించేందుకు చేపట్టిన అనుబంధ రహదారుల పనుల్లో జాప్యం కారణంగా ప్రారంభం ఆలస్యమవుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెలలోనే చర్లపల్లి టెర్మినల్‌కు ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నట్లు ఇటీవల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సైతం తెలిపారు. కానీ ఆ దిశగా ఇప్పటి వరకు దక్షిణమధ్య రైల్వే ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో నవంబర్‌లో చర్లపల్లి ప్రారంభంపై సందిగ్ధం నెలకొంది. ఒకవైపు అనుబంధ రోడ్ల నిర్మాణ పనుల దృష్ట్యా ఆలస్యమవుతుండగా, మరోవైపు ప్రధాని మోదీ చేతుల మీదుగా చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించాలని భావిస్తున్నారు. దీంతో ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం కూడా ఎదురు చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత లోక్‌సభ ఎన్నికల నాటికే టెర్మినల్ ప్రాజెక్టు పూర్తయింది. ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలకు కూడా రెండోదశ లైన్‌లు అందుబాటులోకి వచ్చాయి. కానీ ప్రయాణికులు స్టేషన్‌కు నలువైపులా రోడ్డు మార్గాల్లో చేరుకొనేందుకు అనుకూలమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం సమస్యగా మారింది.
సికింద్రాబాద్ స్టేషన్‌పై ఒత్తిడి..
● సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి వినియోగంలోకి తేవాలనే లక్ష్యంతో పనుల్లో వేగం పెంచారు. దీంతో సికింద్రాబాద్ నుంచి రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు తతెత్తుతున్నాయి. ప్రయాణికులు కూడా స్టేషన్‌కు చేరుకొనేందుకు, ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతిరోజూ సుమారు 1.83 లక్షల మంది రాకపోకలు సాగిస్తుండగా.. పండుగలు, ప్రత్యేక సెలవు రోజుల్లో 2.2 లక్షల మందికి పైగా రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో రైళ్ల నిర్వహణ దృష్ట్యా ఒత్తిడి నెలకొంటోంది. ఇటీవల దీపావళి సందర్భంగా ఉత్తరాది రాష్ట్రాలకు ప్రయాణికుల రాకపోకలు అనూహ్యంగా పెరిగాయి.
● రద్దీ నియంత్రణ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి వచ్చింది. కొన్ని రైళ్లను చర్లపల్లి స్టేషన్‌కు తరలించి ఉంటే ఒత్తిడిని కొంతమేరకు తగ్గించే అవకాశం ఉండేది. మరోవైపు వాహనాల పార్కింగ్‌కు కూడా సరైన వసతులు లేవు. రానున్న రోజుల్లో ఈ ఇబ్బందులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. సికింద్రాబాద్ పునరభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకొనే చర్లపల్లి టెర్మినల్ నుంచి 25 జతల రైళ్లను నడపాలని భావించారు. ఈ మేరకు రైల్వే బోర్డు నిర్ణయం కూడా తీసుకుంది. కనీసం 50 వేల మంది ప్రయాణికులు చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించే అవకాశం ఉంది. కానీ టెర్మినల్ ప్రారంభం కాకపోవడమే ప్రధాన ఆటంకం కావడం గమనార్హం.
పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాని రోడ్లు
కనెక్టివిటీకి కటకట.. నత్తనడకన సాగుతున్న నిర్మాణాలు
సమస్యగా మారిన మౌలిక సదుపాయాల ఏర్పాట్లు
ప్రధానితో ఈ నెలలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు
అన్ని వసతులు ఉన్నా..
చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. రూ.430 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశారు. ప్రయాణికుల కోసం ఎయిర్‌పోర్ట్ తరహాలో ఎగ్జిక్యూటివ్ లాంజ్, వెయిటింగ్ హాళ్లు, స్లీపింగ్ పాడ్‌లు, కెఫెటేరియాలు, రెస్టారెంట్లు ఉన్నాయి. అలాగే టికెట్ బుకింగ్ కౌంటర్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, ఈవీ చార్జింగ్ పాయింట్లు, తదితర సదుపాయాలను ఏర్పాటు చేశారు. మొత్తం 19 లైన్ల సామర్థ్యంతో 9 కొత్త లైన్లను అభివృద్ధి చేశారు. ఇది వినియోగంలోకి వస్తే సికింద్రాబాద్‌తో పాటు నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌లపైనా ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణికులు ఔటర్ మీదుగా రాకపోకలు సాగించవచ్చు. నగరంలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాల నుంచి చర్లపల్లికి చేరుకొనేందుకు ఔటర్‌రింగ్ రోడ్డును వినియోగించుకొనే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment