కంటోన్మెంట్‌కు 303 కోట్లు
కోట్లు
● మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం
కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో రూ.303.62 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఏయూడీ) ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.దాన కిశోర్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్‌ల కోసం కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన 24.6 ఎకరాలను సేకరిస్తున్నందుకు బదులుగా ఈ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కంటోన్మెంట్ పరిధిలోని భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సీవరేజీ బోర్డు ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో ఆధునికీకరించనున్నట్లు తెలిపారు. కంటోన్మెంట్ పరిధిలోని ఎన్‌ట్రెంచ్‌మెంట్ రోడ్డు నుంచి శేషాచల కాలనీ, ఎల్‌ఐసీ కాలనీ, జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ప్యాట్నీ కాంపౌండ్ వరకు ఉన్న పికెట్ నాలా, బోయిన్‌పల్లిలోని ప్రోగ్రెసివ్ కాలనీ, రాయల్ ఎన్‌క్లేవ్, పార్క్‌వ్యూ ఎన్‌క్లేవ్, సెయిల్ కాలనీ, భావనా కాలనీ, చిన్నతోకట్టా, బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్యాట్నీ నాలా వరకు ఉన్న హస్మత్‌పేట నాలాలను జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
భూమికి బదులు పనుల ప్రతిపాదన
కంటోన్మెంట్ పరిధిలోని జాతీయ రహదారి –44, రాష్ట్ర రహదారి –1 మార్గాల్లో చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్‌ల కోసం సుమారు 150 ఎకరాల రక్షణ భూముల కేటాయింపునకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ స్థలాలకు బదులుగా సమాన విలువ కలిగిన భూములను రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖకు కేటాయించనుంది. ఇందులో 24.6 ఎకరాల కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన స్థలానికి మాత్రం, భూమికి బదులుగా రూ.303.62 కోట్లు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మొత్తాన్ని కేంద్రం అధీనంలోని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా (సీఎఫ్‌ఐ)లో జమ చేయాలని నిర్ణయించారు. ఈ మొత్తాన్ని నేరుగా కంటోన్మెంట్‌కు అప్పగించే వీలులేనందున, అంతే విలువ కలిగిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి అనుమతి ఇవ్వాలంటూ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ రక్షణ శాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ పరిధిలోని భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణతో పాటు పికెట్ నాలా, హస్మత్‌పేట్ నాలాలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రూ.
Comments
Please login to add a commentAdd a comment