కొత్తగా మరో 101 వాహనాల కేటాయింపు
సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్ సరఫరాలో సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం కొత్తగా మరో 101 ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (అంబులెన్స్ తరహా) వాహనాలను సమకూర్చేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాట్లు చేసింది. వచ్చే నెల 1 నుంచి ఈ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల 10 వాహనాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా మరో 101 వాహనాలను సిద్ధం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగదారులకు సత్వర, నాణ్యమైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు డిస్కం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న వాహనాల స్థానంలో/వాటికి అదనంగా మెట్రో జోన్‌కు 50, రంగారెడ్డి జోన్‌కు 21, మేడ్చల్ జోన్‌కు 19, రూరల్ జోన్‌కు 11 చొప్పున మొత్తం 101 వాహనాలను కేటాయిస్తూ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో డివిజన్‌కు ఒక వాహనం చొప్పున అందుబాటులోకి రానుంది. వాహనంలో షిఫ్ట్ విధానంలో ఒక అసిస్టెంట్ ఇంజినీర్, ముగ్గురు నైపుణ్యం కలిగిన సిబ్బంది, వాకీటాకీ, థర్మో విజన్ కెమెరాలతో పాటు, అత్యాధునిక భద్రతా పరికరాలైన హెల్మెట్, ఎర్త్ రాడ్, గ్లౌజులు, సేఫ్టీ బెల్ట్, కండక్టర్, ఎల్టీ/హెచ్‌టీ కేబుల్, స్పానర్ కిట్, 14 అడుగుల ఎత్తు నిచ్చెన, గొడ్డలి, రోఫ్, ఎల్టీ, హెచ్‌టీ ఫ్యూజ్‌వైర్, ఇన్సులేటర్, వుడ్ కట్టర్ వంటివి అందుబాటులో ఉంటాయి. వాహనంలో నలుగురు సిబ్బంది సహా, 100 కేవీఏ సామర్థ్యంతో కూడిన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌ను సైతం తరలించడానికి అనుకూలంగా ఉంటుందని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment