సర్టిఫి‘కేటుగాళ్లకు’ సంకెళ్లు
సాక్షి, సిటీబ్యూరో: మహిళ వేషధారణ గొంతుతో ‘జబర్దస్త్’ ఫేమ్‌గా మారిన వ్యక్తి గుంటూరుకు చెందిన అయ్యప్ప. ఇతడిని నకిలీ పత్రాలతో హైదరాబాద్‌కు చెందిన గట్టు తన్మయిశ్రీగా మార్చి పాస్‌పోర్టు ఇప్పించారు. ప్యాట్నీలోని ఆర్‌ఎస్ ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్ కేంద్రంగా సాగిన నకిలీ సర్టిఫికెట్ల దందాకు చిన్న ఉదాహరణ ఇది. దీని యజమాని వై.రాజ్‌కుమార్ నేతృత్వంలోని బృందం గడిచిన కొన్నాళ్లుగా 28 వేల నకిలీ డాక్యుమెంట్లు, గుర్తింపు కార్డులు సృష్టించింది. ఈ వ్యవహారం గుట్టురట్టు చేసిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం ఆరుగురు నిందితులను పట్టుకున్నారు. ఇన్‌స్పెక్టర్ కె.సైదులుతో కలిసి బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వైవీఎస్ సుదీంద్ర వివరాలు వెల్లడించారు.
నకిలీ ఓటర్ ఐడీతో..
కళాసిగూడకు చెందిన రాజ్‌కుమార్ తన ఆర్‌ఎస్ ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్ కేంద్రంగా నకిలీ డాక్యుమెంట్లు, గుర్తింపు కార్డుల దందా చేస్తున్నాడు. దీనికోసం ఆర్.విజయలక్ష్మి, కె.పల్లవిలను ప్రత్యేకంగా నియమించుకున్నాడు. నేపాల్ సహా మరికొన్ని దేశాల నుంచి నగరానికి అక్రమంగా వలస వచ్చిన వారికి ఎలాంటి గుర్తింపు కార్డులు ఉండవు. వీళ్లు ఐడీ కార్డుల కోసం రాజ్‌కుమార్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇతగాడు ఫొటో షాప్ ద్వారా వేరే వారికి చెందిన ఓటర్ ఐడీలో వీరి పేరు చేరుస్తాడు. దీని ఆధారంగా ఆధార్ కార్డుకు దరఖాస్తు చేస్తాడు. ఇలా ఆధార్ రావడంతో వాళ్లు స్థానికులుగా మారిపోతున్నారు. కొందరికి నేరుగా ఆధార్ ఇప్పిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనికోసం ఆధార్ కార్డులు జారీ చేసే యూఐడీఐఏ ఇచ్చిన ఓ వెసులుబాటును వినియోగించుకున్నాడు. మైనర్‌గా ఉన్న వ్యక్తి తొలిసారిగా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకుంటే వేలిముద్రలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దీంతో ఆధార్ కోసం వచ్చిన వారిని మైనర్లుగా పేర్కొంటూ తొలుత రిజిస్టర్ చేసి కార్డు తీసి ఇస్తున్నాడు. ఆపై వయస్సు తప్పు పడిందంటూ కరెక్షన్ కోసం దరఖాస్తు చేసి సదరు వ్యక్తి అసలు వయసు చేరుస్తున్న రాజ్‌కుమార్ దాన్ని అధికారిక ఆధార్‌గా మార్చేస్తున్నాడు.
ఇతర ధ్రువీకరణ పత్రాలు సైతం..
రాజ్‌కుమార్ కేవలం ఆధార్, ఓటర్ ఐడీలు మాత్రమే కాకుండా ఇతర సర్టిఫికెట్లు కూడా తప్పుడు మార్గాల్లో ఇప్పిస్తున్నాడు. ఆధార్ కార్డుల కోసం ఇతగాడికి సర్వ శిక్షా అభయాన్ ప్రాజెక్టులో పని చేస్తున్న మహబూబ్ సహకరిస్తుండగా.. బర్త్, క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇప్పించడంలో సికింద్రాబాద్ జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న జి.అనిల్‌కుమార్ సహకరిస్తున్నారు. పాస్‌పోర్టు ఏజెంట్‌గా పని చేస్తున్న బండి శంకర్ తమ వద్దకు వచ్చిన వారిలో వివిధ ధ్రువీకరణలు అవసరమైన వారిని రాజ్‌కుమార్ వద్దకు తీసుకువెళ్తున్నాడు. కొన్ని పత్రాలకు అటెస్టేషన్ చేయాల్సి వస్తుంది. దీనికోసం రాజ్‌కుమార్ కళాసీగూడ ప్రభుత్వ స్కూలు హెడ్‌మాస్టర్, హైదరాబాద్ జిల్లా ఆరోగ్య శాఖ జిల్లా సర్వైలెన్స్ ఆఫీసర్, గాంధీ ఆస్పత్రి ఆర్‌ఎండీ, ఉస్మానియా మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల పేరుతో నకిలీ రబ్బర్ స్టాంపులు సృష్టించాడు. వీరి సంతకాలను గ్రీన్ ఇంక్‌తో వరలక్ష్మి చేస్తోంది. ప్రతి సర్టిఫికెట్‌ను ఎదుటి వారి అవసరాన్ని బట్టి రూ.వందల నుంచి రూ.వేలకు విక్రయించి అంతా పంచుకున్నారు.
వందల నకిలీ కార్డుల డేటా ధ్వంసం...
రాజ్‌కుమార్‌కు దాదాపు పదేళ్లుగా ఈ దందా చేస్తున్నాడు. అయితే ఇతడికి ఏజెంట్‌గా పని చేసిన శ్రావణ్‌కుమార్‌ను 2023 జూన్‌లో నేరేడ్‌మెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో భయపడిన రాజ్‌కుమార్ అప్పటికి తొమ్మిదేళ్లుగా తన కంప్యూటర్‌లో ఉన్న డేటా ధ్వంసం చేశాడు. మిగిలిన డేటాను విశ్లేషించిన నేపథ్యంలోనే ఈ కేంద్రం నుంచి 50 వేల ఓటర్‌ఐడీ కార్డులు జారీ అయినట్లు తెలిసింది. వీరి దందాపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆరుగురినీ పట్టుకుని మహంకాళి పోలీసులకు అప్పగించారు.
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ వైవీఎస్ సుదీంద్ర
ఆర్‌ఎస్ ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్ కేంద్రంగా దందా
ఓటర్ ఐడీ, ఆధార్, క్యాస్ట్, బర్త్ సర్టిఫికెట్లు విక్రయం
విదేశీయులకు ఆధార్ కార్డులు ఇప్పించిన ముఠా
గుట్టు రట్టు చేసిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు
ఇప్పటి వరకు 28 వేల నకిలీ పత్రాలు ఇచ్చినట్లు గుర్తింపు
Comments
Please login to add a commentAdd a comment