ఇక ‘గ్రీన్ ఫీల్డ్’ జర్నీ!
శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగర అభివృద్ధికి అనుగుణంగా పార్కులు, రహదారుల అభివృద్ధి, అవసరమైన చోట్ల ఎలివేటెడ్ కారిడార్‌లు, చెరువుల పరిరక్షణ, సుందరీకరణ ప్రాజెక్టులను కొత్తసంవత్సరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నట్లు హెచ్‌ఎండీఏ పేర్కొంది. కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ ప్రకారం హైదరాబాద్ సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను కూడా వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి అమలు చేయనున్నారు. ఈ మేరకు ప్రజారవాణాతో పాటు, అన్ని రకాల మౌలిక సదుపాయాలను విస్తరించేవిధంగా హెచ్‌ఎండీఏ కార్యాచరణ ఉంటుందన్నారు. ఈ కార్యాచరణలో భాగంగానే ఔటర్‌రింగ్ రోడ్డు రావిర్యాల నుంచి రీజనల్ రింగ్‌రోడ్డు వరకు అంటే ఆమన్‌గల్ వరకు 41.50 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి హెచ్‌ఎండీఏ ప్రాథమిక పనులు చేపట్టింది. రెండు దశల్లో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు.
మొదటి దశలో..
ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ రోడ్డులో భాగంగా మొదటిదశలో రావిర్యాల నుంచి మీర్‌ఖాన్‌పేట్ వరకు 18 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మిస్తారు. ఇందుకోసం అధికారులు క్షేత్రస్థాయి సర్వేలు పూర్తి చేశారు. భూసేకరణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ రోడ్డు పూర్తిగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి లక్ష్యంగా చేపట్టనున్నారు. 100 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. దీనికి రెండు వైపులా 3 మీటర్ల వెడల్పుతో సైకిల్ ట్రాక్‌లు, 2 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లు ఉంటాయి. వాహనదారులు, పాదచారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా రాకపోకలు సాగించేవిధంగా ఎక్స్‌ప్రెస్‌హైవేగా నిర్మించనున్నారు. మొదటి దశ ప్రాజెక్టు కోసం రూ.1665 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. 447.29 ఎకరాల భూమి సేకరించవలసి ఉంటుంది. భూసేకరణ కోసమే రూ.246 కోట్ల వరకు వెచ్చించవలసి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫోర్త్‌సిటీ నిర్మాణాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దృష్ట్యా కొత్త సంవత్సరంలోనే మొదటిదశ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
రెండో దశలో....
మీర్‌ఖాన్‌పేట్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు అంటే ఆమన్‌గల్ వరకు 23.50 కిలోమీటర్ల మార్గాన్ని రెండో దశలో చేపట్టనున్నారు. రెండోదశ ప్రాజెక్టు కోసం రూ.2365 కోట్లు ఖర్చుకానున్నట్లు అంచనా. ఇందుకోసం 589.63 ఎకరాల భూమిని సేకరించనున్నారు. రైతుల నుంచి సేకరించనున్న భూమికి పరిహారంగా రూ.345 కోట్ల వరకు చెల్లించవలసి ఉంటుందని అంచనా. రెండో దశ భూసేకరణ కోసం జనవరి నెలలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భూములతోపాటు సుమారు 208 ఎకరాల అటవీ భూములను కూడా గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం సేకరించనున్నారు.
పరిహారం వద్దు..భూమి కావాలి...
ఇలా ఉండగా, గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం రైతులు, స్థలాల యజమానుల నుంచి సేకరించనున్న భూమికి పరిహారం ఇచ్చేందుకు హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది. భూములు కోల్పోనున్న బాధితులు మాత్రం అందుకు నిరాకరిస్తున్నారు. మార్కెట్ ధర కంటే తక్కువ మొత్తంలో చెల్లించడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మెట్రో రైల్ నిర్మాణం కోసం సేకరించిన తరహాలోనే రైతుల నుంచి సేకరించే భూమికి పరిహారంగా భూమినే బదులు ఇవ్వాలని కోరుతున్నారు.
ఫ్యూచర్ సిటీకి రాచమార్గం నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు
ఫ్యూచర్ సిటీకి రాచమార్గం నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ సన్నాహాలు చేపట్టింది. ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు వరకు ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వే పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియను చేపట్టింది. కొత్త సంవత్సరంలో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్లు హెచ్‌ఎండీఏ కమిషనర్
సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. – సాక్షి, సిటీబ్యూరో
ఇదీ స్వరూపం..
ప్రతిపాదిత మార్గం: రావిర్యాల నుంచి ఆమన్‌గల్ వరకు 41.50 కి.మీలు
మొదటి దశలో రావిర్యాల నుంచి మీర్‌ఖాన్‌పేట్ వరకు 18 కి.మీ
మొదట 6 లేన్‌లు నిర్మించి ఆ తరువాత 8 లేన్‌లకు విస్తరిస్తారు.
నిర్మాణంవ్యయం: 1665 కోట్లు : సేకరించాల్సిన భూమి : 447.29 ఎకరాలు. చెల్లించాల్సిన పరిహారం: రూ.246 కోట్లు.
రెండో దశలో మీర్‌ఖాన్‌పేట్ –ఆమన్‌గల్: 23.50 కి.మీ
నిర్మాణ వ్యయం: రూ.2356 కోట్లు
సేకరించాల్సిన భూమి: 589.63 ఎకరాలు. పరిహారం రూ.345 కోట్లు.
ఔటర్ నుంచి రీజినల్ రింగు రోడ్డు వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారులు
మొదటి దశ నిర్మాణం కోసం మొదలైన భూసేకరణ ప్రక్రియ
పరిహారంపైన బాధితుల ఆందోళన
భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment