హద్దు మీరితే అంతే సంగతులు | - | Sakshi
Sakshi News home page

హద్దు మీరితే అంతే సంగతులు

Published Tue, Dec 31 2024 8:37 AM | Last Updated on Tue, Dec 31 2024 8:37 AM

హద్దు మీరితే అంతే సంగతులు

హద్దు మీరితే అంతే సంగతులు

సాక్షి, సిటీబ్యూరో: ‘డిసెంబర్‌ 31’ని జీరో ఇన్సిడెంట్‌, యాక్సిడెంట్‌ నైట్‌గా చేయడానికి నగర పోలీసు విభాగం కసరత్తు పూర్తి చేసింది. న్యూ ఇయర్‌ పార్టీల విషయంలో సభ్యత, భద్రత మరవద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇతరులకు ఇబ్బంది కలుగకుండా వేడుకలు నిర్వహించుకోవాలని చెబుతున్నారు. బౌన్సర్లు, నిర్వాహకులు సహా ఎవరు హద్దు మీరినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత సమయం తర్వాత ఏ కార్యక్రమం కొనసాగకూడదని స్పష్టం చేస్తున్నారు. డిసెంబర్‌ 31 రాత్రి పార్టీలకు సంబంధించి పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం...కార్యక్రమాలకు వచ్చే ఆర్టిస్టులు, డీజేలకూ నిబంధనలున్నాయి. వీరి వస్త్రధారణ, హావభావాలు, పాటలు తదితరాల్లో ఎక్కడా అశ్లీలం, అసభ్యతలకు తావుండకూడదు. అక్కడ ఏర్పాటు చేసే సౌండ్‌ సిస్టం నుంచి వచ్చే ధ్వని తీవ్రత 45 డెసిబుల్స్‌ మించకూడదు. ఇళ్లు, అపార్ట్‌మెంట్స్‌లో వ్యక్తిగత పార్టీల నిర్వహిస్తున్న వాళ్లూ పక్కవారికి ఇబ్బంది లేకుండా సౌండ్‌ సిస్టమ్‌ పెట్టుకోవాలి. న్యూ ఇయర్‌ కార్యక్రమాల్లో ఎక్కడా మాదకద్రవ్యాల వినియోగానికి తావు లేకుండా చూడాలి. వీటిని సేవించి వచ్చే వారినీ హోటల్స్‌, పబ్స్‌ నిర్వాహకులు అనుమతించకూడదు. యువతకు సంబంధించి ఎలాంటి విశృంఖలత్వానికి తావు లేకుండా, మైనర్లు పార్టీలకు రాకుండా నిర్వాహకులు చూసుకోవాలి. బౌన్సర్లు అతిగా ప్రవర్తించినా, ఆహూతులకు ఇబ్బందులు కలిగించినా వారితో పాటు ఏర్పాటు చేసిన సంస్థల పైనా చర్యలు తప్పవు. నిబంధనల పర్యవేక్షణ, నిఘా కోసం 150 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. వీరు కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో తనిఖీలు చేయడం, వాటిని చిత్రీకరించడంతో పాటు ఆడియో మిషన్ల సాయంతో శబ్ధతీవ్రతనూ కొలుస్తారు.

‘సాగర్‌’ చుట్టూ నో ఎంట్రీ...

మద్యం సేవించి వాహనాలు నడపడం, దురుసుగా డ్రైవింగ్‌ చేయడం, మితిమీరిన వేగం, పరిమితికి మించి వాహనాలపై ప్రయాణించడం చేయకూడదని పోలీసులు పేర్కొన్నారు. శాంతి భద్రతల విభాగం అధికారులతో పాటు ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని, ఉల్లంఘనలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరించారు. ట్యాంక్‌బండ్‌పైన ఇతర కీలక ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుస్సేన్‌్‌ సాగర్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు విధించారు. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌రోడ్‌, అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ప్రత్యామ్నాయాలు లేని బేగంపేట, లంగర్‌హౌస్‌, డబీర్‌పుర ఫ్లైఓవర్లు మినహా మిగిలిన అన్ని ఫ్లైఓవర్లను మంగళవారం రాత్రి మూసి ఉంచుతారు.

వెస్ట్‌జోన్‌లో స్పెషల్‌ యాక్షన్స్‌...

నగరంలోని మిగతా నాలుగింటితో పోలిస్తే పశ్చిమ మండలం పూర్తి విభిన్నమైంది. మాదకద్రవ్యాల విక్రయం, వినియోగం సైతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు న్యూ ఇయర్‌ వేడుకలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వివిధ సందర్భాలు, సమయాల్లో సిటీలోని పబ్స్‌ కపుల్‌ ఎంట్రీలను మాత్రమే అనుమతిస్తుంటాయి. జంటగా వచ్చేవారు మినహా మిగతా వారిని పబ్స్‌లోకి రానివ్వరు. దీనిపై పలు సందర్భాల్లో కొందరు యువకులు గుంపులుగా వచ్చి పబ్స్‌ వద్ద హల్‌చల్‌ చేస్తుంటారు. స్టాగ్‌ గ్యాంగ్స్‌గా పిలిచే వీరు గతంలో చేసిన హంగామాలను బట్టి పోలీసులు ఓ బ్లాక్‌లిస్ట్‌ తయారు చేస్తున్నారు. ఇలాంటి వారి కదలికలు, వ్యవహారాలపై డేగకన్ను వేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు కానున్నాయి. నగర వ్యాప్తంగా ఎక్కడా శాంతి భద్రతల సమస్యలు రాకుండా చూసేందుకు క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్స్‌ (క్యూఆర్టీ), ఈవ్‌టీజింగ్‌ కంట్రోలింగ్‌కు ప్రత్యేక షీ–టీమ్స్‌ బృందాలు మోహరిస్తున్నారు. ఆయా కార్యక్రమాలు, వెన్యూల వద్ద ఉండే బౌన్సర్లు అతిగా ప్రవర్తించినా, ఆహూతులకు ఇబ్బందులు కలిగించినా వారితో పాటు ఏర్పాటు చేసిన సంస్థల పైనా చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు.

‘డ్రింక్సే’ కాదు డ్రగ్సూ పట్టేస్తారు...

కేవలం డ్రంక్‌ డ్రైవింగే కాకుండా ‘డ్రగ్‌ డ్రైవింగ్‌’కు చెక్‌ చెప్పాలని అధికారులు నిర్ణయించారు. డ్రగ్స్‌ తీసుకుని వాహనాలు నడిపే వారితో పాటు కొన్ని సందర్భాల్లో ఇతర అనుమానితులకు గుర్తించడానికి డ్రగ్‌ డిటెక్టర్స్‌ సమీకరించుకున్నారు. జర్మనీ నుంచి ఖరీదు చేసిన ఈ అత్యాధునిక పరికరాల్లో 75 పరికరాలను తెలంగాణ స్టేట్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (టీఎస్‌ ఏఎన్‌బీ) అధికారులు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండలకు అందించారు. వీటి ఆధారంగా అధికారులు రహదారులపైనే కాకుండా పబ్స్‌, ఫామ్‌హౌస్‌లతో పాటు మరికొన్ని సున్నిత ప్రాంతాల్లోనూ తనిఖీలు చేయనున్నారు. స్నిఫర్‌ డాగ్స్‌తోనూ తనిఖీలు చేపడతారు.

‘కొత్త’ వేడుకలు శ్రుతిమించితే కఠిన చర్యలు

డ్రంక్‌తో పాటు డ్రగ్‌ డ్రైవింగ్‌పైనా తనిఖీలు

రంగంలోకి దిగనున్న 150 ప్రత్యేక బృందాలు

నేటి రాత్రి నగరంలోని అనేక ఫ్లైఓవర్లు బంద్‌

వెస్ట్‌జోన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement