అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం
వంటగ్యాస్ సిలిండర్ లీకేజీతో ఘటన
● మంటలను ఆర్పిన ఫైర్ సిబ్బంది
● త్రుటిలో తప్పిన పెను ముప్పు
గచ్చిబౌలి: ఓ స్టవ్‌పై పిండి వంటలు చేస్తూ మరో సిలిండర్‌ను ఓపెన్ చేయడంతో గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కొండాపూర్‌లోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలోని సి బ్లాక్‌లోని 907 ఫ్లాట్‌లో మంగళవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం.. గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లోని ఫ్లాట్ నంబర్ 907లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సునీల్, పృథ్వీ దంపతులు, వారి కుమారుడు వెంకట సృజన్‌తో పాటు ఓ వయోధికుడు ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం డిసెంబర్ 31 వేడుకల్లో భాగంగా ఫుడ్‌స్టాల్ పెట్టేందుకు పిండి వంటలు చేస్తున్నారు. ఒక స్టవ్‌పై పృథ్వీ పిండి వంటలు చేస్తోంది. మరో సింగిల్ బర్నర్ స్టవ్‌పై వంటలు చేసేందుకు సిలిండర్ సీల్ తీసింది. ఒక్కసారిగా గ్యాస్‌పైకి ఎగిసిపడటంతో మరో స్టవ్‌కు ఉన్న మంట సిలిండర్‌కు అంటుకుంది. వెంటనే మరో గదిలో ఉన్న భర్త సునీల్‌ను పిలిచింది. ఇద్దరు కలిసి దుస్తులతో మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. అయినా మంటలు ఎగిసిపడటంతో లిఫ్ట్ వద్ద ఉన్న ఫిక్స్ ఫైర్‌తో ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. ఈ క్రమంలో సునీల్ చేతికి స్వల్పంగా గాయాలయ్యాయి. అప్పటికే సెక్యూరిటీని పిలిచేందుకు కొడుకు సృజన్‌ను కిందికి పంపారు. మరో సీనియర్ సిటిజన్‌ను ఇంటి నుంచి బయటకు పంపించారు. సిలిండర్ కిందపడటంతో మంటలు మరింత ఎక్కువగా ఎగిసిపడ్డాయి. దీంతో భయభ్రాంతులకు గురైన దంపతులు కిందికి పరుగు తీశారు.
కాలిపోయిన ఫ్లాట్, ఇంటి సామగ్రి
అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి దాదాపు గంటకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇంట్లో రెండు సిలిండర్‌లు ఉండటంతో సునీల్ ఫ్లాట్ పూర్తిగా దగ్ధమైందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. నాలుగు సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, బెడ్‌లు, ఏసీలు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్‌తో సామగ్రి కాలిబూడిదయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు వివిధ ఫ్లాట్లలో చిక్కుకుపోయిన 10 మందిని రెస్క్యూ చేశామని మాదాపూర్ ఫైర్ ఆఫీసర్ ఎం.డి. అబుధల్ ఫజల్ పేర్కొన్నారు. ప్రమాదం జరగడంతో గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీ వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment