‘ఫ్యూచర్‌’ వైపువెలుగు రేఖలు.. | - | Sakshi
Sakshi News home page

‘ఫ్యూచర్‌’ వైపువెలుగు రేఖలు..

Published Tue, Dec 31 2024 8:37 AM | Last Updated on Tue, Dec 31 2024 8:37 AM

‘ఫ్యూచర్‌’ వైపువెలుగు రేఖలు..

‘ఫ్యూచర్‌’ వైపువెలుగు రేఖలు..

సాక్షి, సిటీబ్యూరో:

2025!

కాలగమనంలో ఒక మైలురాయి..

రేపటి నుంచి ప్రారంభం కానున్న కొత్త సంవత్సరంలో రాష్ట్ర రాజధాని నగరంలో రూ.వేల కోట్ల పనులు ప్రారంభం కానున్నాయి. ఓల్డ్‌సిటీ, న్యూసిటీ, సైబర్‌సిటీల తర్వాత ఫోర్త్‌సిటీగా ఫ్యూచర్‌సిటీ పనులు వేగం కానున్నాయి. హైదరాబాద్‌ను న్యూయార్క్‌, టోక్యోల మాదిరిగా అభివృద్ధి చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఆశయాలకనుగుణంగా ప్రభుత్వ కార్యాచరణలో ఫ్యూచర్‌ సిటీది కీ రోల్‌. మురికి కూపం నుంచి పేద ప్రజలకు విముక్తితో పాటు మూసీ పరిసర ప్రాంతాల్ని సాంస్కృతిక, వారసత్వ, పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుదీ ముఖ్య భూమికే. వీటికి సంబంధించిన పనులు కొత్త సంవత్సరంలో ముమ్మరం కానున్నాయి. మీర్‌ఖాన్‌పేట కేంద్రంగా రూపుదిద్దుకోనున్న ఫ్యూచర్‌ సిటీలో స్కిల్‌ యూనివర్సిటీ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. మరోవైపు, ప్యారడైజ్‌ నుంచి శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌ వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ (రూ.3619 కోట్లు), ఎన్‌హెచ్‌44ను కలుపుతూ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌(రూ.1487కోట్లు) పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

మురికి నుంచి ఆకర్షణీయంగా మూసీ

మూసీ ప్రక్షాళన, పునరుజ్జీవం, మూసీ పరిసరాల అభివృద్ధితో ఆదాయం లక్ష్యంగా ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అందుకుగాను నగరం మధ్య నదులున్న లండన్‌లోని థేమ్స్‌, సియోల్‌లోని చెయోంగ్‌జిచియోన్‌లను సందర్శించి వచ్చారు. సియోల్‌కు అధికారులు, మీడియా ప్రతినిధులను సైతం పంపించారు. మూసీ క్లీనింగ్‌కు చర్యలు త్వరలో ప్రారంభం కానున్నాయి. సైకిల్‌ ట్రాక్‌లు, జాగింగ్‌ ట్రాక్‌లు, పాదచారుల జోన్‌లు, పీపుల్స్‌ ప్లాజాలు, హెరిటేజ్‌ జోన్‌లు, గ్రీన్‌ స్పేస్‌లు, హాకర్‌ జోన్‌లు, వంతెనలు, వినోదం, తదితర అంశాలతో ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ రెడీ అయింది. దశలవారీగా పనులు జరగనున్నాయి.

అందుబాటులోకొచ్చే సదుపాయాలు...

ఆరాం గా..

● ఈ పాటికే ప్రారంభం కావాల్సిన ఆరాంఘర్‌ ఫ్లై ఓవర్‌ కొత్త సంవత్సరంలో అందుబాటులోకి రానుంది.

● శిల్పా లేఔట్‌ రెండో దశ (రూ.183 కోట్లు), నల్గొండ చౌరస్తా– ఒవైసీ జంక్షన్‌ ఫ్లై ఓవర్‌ (రూ.467కోట్లు), ఉప్పల్‌ జంక్షన్‌ రెండో లెవెల్‌ ఫ్లై ఓవర్‌ (రూ.311కోట్లు)పనులు కొత్త సంవత్సరంలో పూర్తికానున్నాయి.

● దాదాపు రూ.120 కోట్లతో చేపట్టిన ఫలక్‌నుమా, శాస్త్రిపురం ఆర్‌ఓబీలు అందుబాటులోకి రానున్నాయి. – దాదాపు 75 జంక్షన్లలో అభివద్ధి, సుందరీకరణ పనులు చేయనున్నారు.

హై సిటీ కోసం

హై సిటీ (హైదరాబాద్‌ సిటీ ఇన్నోవేటివ్‌ అండ్‌ ట్రాన్స్‌ఫార్మేటివ్‌ ఇన్‌ఫ్రాస్ట్రకక్చర్‌) పనుల్లో భాగంగా రూ.7032 కోట్ల పనులకు ఇటీవలే సీఎం శంకుస్థాపన చేశారు. ఇందులోని కేబీఆర్‌ పార్కు చుట్టూ రూ.1200 కోట్లతో ఫైఓవర్లు, అండర్‌పాస్‌ల పనులకు బహుశా ఈ వారంలోనే టెండర్లు పిలవనున్నారు. కేబీఆర్‌ పార్కు వద్ద పీపీపీ విధానంలో మల్టీలెవెల్‌ పార్కింగ్‌ పనులు సైతం ప్రారంభం కానున్నాయి. ఎస్‌ఎన్‌డీపీ–2 కింద రూ.667 కోట్లతోపాటు ఎన్‌డీఎంఎఫ్‌ (నేషనల్‌ డిజాస్టర్‌ మిటిగేషన్‌ ఫండ్‌) కింద రూ.291.80 కోట్లతో వరద కాలువల ఆధునీకరణ, చెరువుల పటిష్టతకు సంబంధించిన పనులు చేపట్టనున్నారు.

జీహెచ్‌ఎంసీ విభజనపై స్పష్టత

జీహెచ్‌ఎంసీని మూడు లేదా నాలుగు కార్పొరేషన్లు చేస్తారో, లేదో ఈ సంవత్సరం స్పష్టత రానుంది. ఆ తర్వాతే పాలకమండలి ఎన్నికలు జరగనున్నాయి. శివారు ప్రాంతాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేట్లయితే..ఈ సంవత్సరం అక్కడ జరగాల్సిన పంచాయతీలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఇక జరగవు.

ముఖ్యమైన అభివృద్ధి పనులు.. వాటికి నిధులు ఇలా..

● రేతిబౌలి, నానల్‌నగర్‌ దగ్గర ఫ్లై ఓవర్లు: రూ.398 కోట్లు.

● ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ వద్ద ఫస్ట్‌లెవెల్‌ ఫ్లై ఓవర్‌, టీవీ9 జంక్షన్‌ దగ్గర అండర్‌పాస్‌ పనులకు రూ.210 కోట్లు.

● ఖాజాగూడ, ఐఐఐటీ, విప్రో జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్లు: రూ.837 కోట్లు.

● మియాపూర్‌ క్రాస్‌రోడ్‌– ఆల్విన్‌ క్రాస్‌రోడ్‌ ఫ్లై ఓవర్‌, లింగంపల్లి– గచ్చిబౌలి అండర్‌పాస్‌: రూ.530 కోట్లు.

● శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్‌ ఆర్‌ఓబీ: రూ.124 కోట్లు.

● కూకట్‌పల్లి వైజంక్షన్‌ వద్ద అమీర్‌పేట వైపు, మియాపూర్‌ వైపు ఫ్లై ఓవర్లు:రూ.180 కోట్లు.

● ఫాక్స్‌సాగర్‌ సర్‌ప్లస్‌ నాలా పైప్‌లైన్‌ రోడ్‌పై స్టీల్‌ బ్రిడ్జి: రూ.56 కోట్లు.

● రసూల్‌పురా ఫ్లై ఓవర్‌: రూ.150 కోట్లు

● పాటిగడ్డ ఆర్‌ఓబీ: రూ.80 కోట్లు

● ఆర్‌కేపురం ఆర్‌ఓబీ: రూ.210 కోట్లు

● ఆర్‌కేపురం ఆర్‌యూబీ: రూ.35 కోట్లు

● చిలకలగూడ ఆర్‌యూబీ: రూ.30 కోట్లు

● ఏఓసీ సెంటర్‌ చుట్లూ ప్రత్యామ్నాయ రోడ్లు: రూ.960 కోట్లు

● టీకేఆర్‌ కాలేజ్‌, గాయత్రినగర్‌, మందమల్లమ్మ జంక్షన్ల మీదుగా ఫ్లై ఓవర్‌ :రూ.416 కోట్లు.

● ఒవైసీ ఫ్లై ఓవర్‌కు సంతోష్‌నగర్‌ వైపు డౌన్‌ర్యాంప్‌, హఫీజ్‌ బాబానగర్‌ జంక్షన్‌ –బాలాపూర్‌ చర్చిరోడ్‌ జంక్షన్‌ వరకు ఫ్లై ఓవర్‌, బండ్లగూడ–ఎర్రకుంట జంక్షన్‌ ఫ్లైఓవర్‌ పనులకు: రూ.339 కోట్లు.

● మైలార్‌దేవ్‌పల్లి, శంషాబాద్‌, కాటేదాన్‌ జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గేందుకు ఫ్లైఓవర్‌: రూ.200 కోట్లు.

● ఆరాంఘర్‌ జంక్షన్‌ వద్ద రెండు ఆర్‌యూబీలు: రూ.59 కోట్లు..తదితరమైనవి ఉన్నాయి.

మూసీ సుందరీకరణ అనంతరం ఇలా...(నమూనా చిత్రం)

కొత్త ఏడాదిలో అభివృద్ధిపై కొంగొత్త ఆశలు

2025లో మూసీకీ ప్రాధాన్యం..

ఎలివేటెడ్‌ రహదారులు..రూ.వేల కోట్ల పనులు

ఫ్యూచర్‌ సిటీతో మారనున్న మహానగర రూపురేఖలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement