ఖాదీ, గ్రామీణ పరిశ్రమల విస్తరణతో ఆర్థిక స్వావలంబన
వెంగళరావునగర్: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో న్యూ ఖాదీ ఆఫ్ న్యూ ఇండియా కొత్త నమూనాను ఏర్పాటు చేస్తున్నట్టు ఖాదీ, గ్రామీణ పరిశ్రమల శాఖ చైర్మన్ మనోజ్ కుమార్ తెలిపారు. యూసుఫ్‌గూడలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (నిమ్స్‌మే) కేంద్ర శిక్షణ సంస్థ ప్రాంగణంలో గురువారం కేవీఐఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖాదీ మహోత్సవంలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ మార్గదర్శకంలో కొత్త నమూనాతో పాటు వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్ ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయని, మహిళల ఆర్థిక స్వాలంబన కోసం, నిరుపేదల గృహాల్లో వెలుగులు నింపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే గ్రామోద్యోగ్ వికాస్ యోజన పథకం కింద నిరుద్యోగులకు వీల్ పాటరీ, సెల్‌ఫోన్ రిపేర్ తదితరాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో తెలంగాణలో 2,370 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. శిక్షణ పొందిన వారు ఆయా సర్టిఫికెట్ల ద్వారా బ్యాంకు రుణాలతో వ్యాపారాలు చేసి ఉన్నతస్థితికి ఎదగాలని ఆయన సూచించారు. తొలుత శిక్షణ పూర్తి చేసుకున్న వారు తయారు చేసిన వస్తువులను ఆయన పరిశీలించి అనంతరం వారికి సర్టిఫికెట్లు, కిట్స్ పంపిణీ చేశారు. నిమ్స్‌మే డైరెక్టర్ జనరల్ గ్లోరీ స్వరూప పాల్గొన్నారు.
శిక్షణ సర్టిఫికెట్లు అందజేస్తున్న మనోజ్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment