ఉత్తరం వైపు ఊరట!
సాక్షి, సిటీబ్యూరో: నార్త్‌సిటీ వైపు డబుల్‌డెక్కర్ మెట్రో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్యారడైజ్ నుంచి డెయిరీఫామ్ వరకు డబుల్ డెక్కర్‌కు గతంలోనే ప్రతిపాదించారు. అప్పట్లో మెట్రోపై స్పష్టత లేకపోవడంతో వాయిదా పడింది. మేడ్చల్ వరకు తాజాగా మెట్రో రైలుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిన దృష్ట్యా డబుల్‌డెక్కర్ పద్ధతిలో చేపట్టనున్నారు. ప్యారడైజ్ నుంచి డెయిరీఫామ్‌కు, ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ ఓఆర్‌ఆర్ వరకు ఎలివేటెడ్ కారిడార్‌లకు హెచ్‌ఎండీఏ కార్యాచరణ చేపట్టింది. ఈ కారిడార్‌లపైనే మెట్రో లైన్‌లు నిర్మిస్తే తక్కువ వ్యయంతో రోడ్డు, రైలు మార్గాలు అందుబాటులోకి రానున్నాయి. మూడు నెలల్లో మెట్రో కారిడార్‌లకు డీపీఆర్ సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించిన దృష్ట్యా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోరైల్ లిమిటెడ్ డబుల్‌డెక్కర్ మెట్రోపై దృష్టి సారించినట్లు సమాచారం. దీనివల్ల మెట్రో నిర్మాణ భారం కూడా తగ్గనుంది. రెండో దశలో 74.6 కిలోమీటర్లకు సుమారు రూ.24,000 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఇప్పుడు రెండో దశ ‘బి’ కింద డబుల్‌డెక్కర్ పద్ధతితో 45 కిలోమీటర్ల నార్త్‌సిటీ కారిడార్‌లకు భూసేకరణ, పిల్లర్ల వ్యయం తగ్గనుంది. దీంతో సుమారు రూ.8,000 కోట్లతో మెట్రో అందుబాటులోకి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
డెయిరీఫామ్ నుంచి..
ప్యారడైజ్ నుంచి మేడ్చల్ 23 కిలోమీటర్‌లు, జేబీఎస్ నుంచి శామీర్ పేట్ వరకు 22 కిలోమీటర్ల మార్గంలో మెట్రో కారిడార్లను నిర్మించనున్నారు. మేడ్చల్ రూట్‌లో తాడ్‌బండ్, బోయిన్‌పల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ వరకు మెట్రో రానుంది. ఇదే మార్గంలో డెయిరీఫామ్ వరకు 5.32 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ రానుంది. అక్కడి వరకు డబుల్ డెక్కర్ పద్ధతిలో రోడ్డు, మెట్రో నిర్మిస్తే డెయిరీ ఫామ్ నుంచి మరో 17.68 కిలోమీటర్లు భూమిపైనే ఎలివేటెడ్ మెట్రో నిర్మాణం చేపట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డెయిరీఫామ్ వరకు 55 ఎకరాలకుపైగా భూసేకరణకు హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది. ఇది మినహాయిస్తే.. సుచిత్ర, కొంపల్లి నుంచి మేడ్చల్ ఓఆర్‌ఆర్ వరకు మెట్రో కోసం ప్రత్యేకంగా కారిడార్‌ను నిర్మించాల్సి ఉంటుంది. రోడ్డు మార్గంలో పెద్దగా భూసేకరణ అవసరం లేకుండానే పిల్లర్లపై వయా డక్ట్‌లు వేయవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రెండో దశ మెట్రోకు కిలోమీటర్‌లకు సుమారు రూ.310 కోట్లకు పైగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. భూసేకరణ భారం తగ్గడం వల్ల ఈ రూట్‌లో ఖర్చు తగ్గనుంది.
జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ ఓఆర్‌ఆర్ వరకు..
మెట్రో రెండో దశలో ‘బి’ విభాగం కింద చేపట్టనున్న నార్త్‌సిటీ కారిడార్‌లలో జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ ఓఆర్‌ఆర్ వరకు 22 కిలోమీటర్ల మరో మార్గం కూడా ఎంతో కీలకమైంది. ఇప్పుడున్న జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూముకుంట, ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్ పేట్ వరకు నిర్మించనున్నారు. ఇదే మార్గంలో ప్యారడైజ్ నుంచి ఓఆర్‌ఆర్ వరకు 18.124 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది. ఈ రూట్‌లో 163.33 ఎకరాల భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో మెట్రోరైల్ కోసం మరోసారి భూసేకరణ అవసరం లేకుండా ఇంచుమించు 18 కిలోమీటర్ల వరకు డబుల్ డెక్కర్ నిర్మాణం చేపట్టవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. మిగతా రూట్‌లో ఎలివేటెడ్ పద్ధతిని అనుసరించవచ్చు. ప్రస్తుతం ఈ రెండు రూట్లలో భూసేకరణకు సుమారు రూ.2000 కోట్ల వరకు భూసేకరణ కోసం పరిహారం చెల్లించవలసి ఉంటుందని హెచ్‌ఎండీఏ అంచనా వేసింది. మేడ్చల్ వైపు మినహాయించి శామీర్‌పేట్ వైపు మెట్రో కోసం పెద్దగా భూసేకరణ అవసరం ఉండదు. అంటే రెండు రకాల నిర్మాణాల కోసం ఒకేసారి భూసేకరణ చేపట్టినట్లవుతుంది. అలాగే పిల్లర్ల నిర్మాణ వ్యయం సహా ఇతర ఖర్చులను హెచ్‌ఎండీఏ, హెచ్‌ఏఎంఆర్‌ఎల్ సమంగా చెల్లించడం వల్ల ఖర్చు తగ్గనుంది.
ప్రయాణికులకు ఎంతో మేలు..
● ఈ రెండు కారిడార్‌లలో రోడ్డు, మెట్రో సదుపాయాలు వినియోగంలోకి వస్తే శామీర్‌పేట్, మేడ్చల్ ప్రాంతాల నుంచి నగరంలోని అన్ని వైపులకు మెట్రో కనెక్టివిటీ ఏర్పడుతుంది. ప్రయాణికులు నేరుగా ఎయిర్‌పోర్టు వరకు రాకపోకలు సాగించవచ్చు. ఐటీ వర్గాలు నార్త్‌లో ఏ ప్రాంతం నుంచైనా ఐటీ సంస్థలకు చేరుకోవచ్చు. ● రెండో దశ వల్ల 2028 నాటికి మెట్రో ప్రయాణికులు 8 లక్షలు దాటవచ్చని ఇప్పటికే అంచనా వేశారు. కొత్తగా నార్త్‌సిటీకి కూడా మెట్రో అందుబాటులోకి వస్తే సుమారు 12 లక్షల మందికి చేరే అవకాశం ఉంది.
నార్త్ సిటీకి డబుల్ డెక్కర్ మెట్రో
ఇప్పటికే ఎలివేటెడ్ కారిడార్‌లకు హెచ్‌ఎండీఏ కార్యాచరణ
ప్యారడైజ్ నుంచి డెయిరీఫాం వరకు ప్రణాళికలు
తగ్గనున్న భూసేకరణ భారం
ఉత్తరం నుంచి అన్ని వైపులకు కనెక్టివిటీ
లక్షలాది మందికి భారీ ఉపశమనం
Comments
Please login to add a commentAdd a comment