మల్లన్న సాగర్‌ నుంచే గోదావరి రెండో దశ? | - | Sakshi
Sakshi News home page

మల్లన్న సాగర్‌ నుంచే గోదావరి రెండో దశ?

Published Fri, Jan 3 2025 8:51 AM | Last Updated on Fri, Jan 3 2025 8:51 AM

మల్లన్న సాగర్‌ నుంచే గోదావరి రెండో దశ?

మల్లన్న సాగర్‌ నుంచే గోదావరి రెండో దశ?

సాక్షి, సిటీబ్యూరో: మహా నగర తాగునీటి అవసరాల కోసం గోదావరి రెండో దశ ప్రాజెక్టును మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ నుంచే ప్రభుత్వం చేపట్టనుంది. సుమారు రూ.7,300 కోట్ల అంచనా వ్యయంతో రెండు పైపులైన్ల ద్వారా 20 టీఎంసీల నీటి తరలింపుపై శుక్రవారం సీఎం అధ్యక్షతన జరిగే జలమండలి పాలకమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. గతేడాది ఆగస్టులోనే గోదావరి రెండో దశను మల్లన్న సాగర్‌ నుంచి చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినప్పటికీ.. కొండపోచమ్మ కాదని మల్లన్నసాగర్‌ నుంచి జలాల తరలింపుపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో రెండింటి నుంచి జలాల తరలింపు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో వ్యాప్కోస్‌ సంస్థ కొండపోచమ్మ, మల్లన్న సాగర్‌ ప్రాజెక్టుల నీటి లభ్యత, తరలింపు వ్యయం తదితర అంశాలపై సమగ్ర సర్వే చేసి తాజాగా నివేదిక సమర్పించింది. అందులో గోదావరి రెండో దశను మల్లన్న సాగర్‌ నుంచే చేపట్టడమే సబబు అని సిఫార్సు చేసింది.

ఇదీ పరిస్థితి...

గోదావరి జలాల్లో హైదరాబాద్‌ నగర తాగునీటి అవసరాలకు 30 టీఎంసీల నీటి కేటాయింపులుండగా, ప్రస్తుతం గోదావరి మొదటి దశ కింద శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 10 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. మరో 20 టీఎంసీలు తరలించేందుకు వెసులుబాటు ఉంది. మహా నగరానికి రోజురోజుకూ తాగునీటి అవసరాలు పెరుగుతుండడంతో పాటు నాగార్జునసాగర్‌, ఎల్లంపల్లి, సింగూర్‌, మంజీరా, ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జలాశయాల నుంచి సుమారు 555 ఎంజీడీల నీరు సరఫరా చేస్తున్నా.. సరిపడని పరిస్థితి నెలకొంది. దీంతో గోదావరి రెండో దశను చేపట్టేందుకు జలమండలి సిద్ధమైంది.

తెరపైకి మల్లన్న సాగర్‌..

తాజాగా కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ తెరపైకి వచ్చింది. అయిదేళ్ల క్రితం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో రెండో అతిపెద్ద జలాశయమైన కొండపోచమ్మ సాగర్‌ నుంచి హైదరాబాద్‌ మహా నగరానికి నీటి తరలింపు కోసం ప్రణాళిక సిద్ధమైనా.. భూ సేకరణ వివాదాలతో ముందుకు సాగలేదు. మరోవైపు కొండ పోచమ్మ రిజర్వాయర్‌ నిల్వ సామర్థ్యం కూడా 15 టీఎంసీల మాత్రమే ఉండటంతో, 50 టీఎంసీల సామర్థ్యమున్న మల్లన్న సాగర్‌పై జలమండలి దృష్టి సారించింది. నగరానికి సమీంపలోని మల్లన్నసాగర్‌ నుంచి గోదావరి జలాలను శామీర్‌పేట ఘన్‌పూర్‌ మీదుగా హైదరాబాద్‌కు తరలించే విధంగా ప్రతిపాదనలను సిద్ధం చేసి జలమండలి ప్రభుత్వానికి సమర్పించింది. గతేడాదిలో రాష్ట్ర మంత్రి వర్గం కూడా మల్లన్న సాగర్‌ నుంచి గోదావరి జలాల తా గునీటి సరఫరా పథకం–2కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

పెరిగిన ప్రాజెక్టు అంచనా వ్యయం

గోదావరి రెండో దశ ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగినట్లయింది. తొలుత దాదాపు 15 టీఎంసీల నీటి తరలింపు కోసం సుమారు రూ.5,560 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు సమగ్ర నివేదిక రూపకల్పన జరగ్గా.. తాజాగా సుమారు 7,300 కోట్ల అంచనా వ్యయంతో రెండు పైపులైన్ల ద్వారా 20 టీఎంసీల ద్వారా తరలించేలా వ్యాప్కోస్‌ సంస్థ డీపీఆర్‌ సిద్ధం చేసి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. పాలక మండలిలో గ్రీన్‌ సిగ్నల్‌ లభిస్తే రెండేళ్లలో పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.

మల్లన్న సాగర్‌ (ఫైల్‌)

రెండు పైపులైన్ల ద్వారా 20 టీఎంసీల నీటి తరలింపు

పెరిగిన ప్రాజెక్టు అంచనా వ్యయం

ప్రభుత్వానికి సిఫార్సు చేసిన వ్యాప్కోస్‌ సంస్థ

నేడు జలమండలి పాలక మండలి సమావేశం

పుష్కర కాలం తర్వాత జలమండలి పాలక మండలి సమావేశం శుక్రవారం జరగనుంది. సమావేశంలో గోదావరి నీటి సరఫరా పథకం రెండో దశపై నిర్ణయం, సుమారు రూ.301 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న జోన్‌–2 సమగ్ర మురుగునీటి మాస్టర్‌ ప్లాన్‌ ప్రాజెక్టు, 39 అమృత్‌ ఎస్టీపీలు, జంట జలాశయాలపై నాలుగు ఎస్టీపీల నిర్మాణాలు తదితర అంశాలు చర్చించి ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాలకమండలి చైర్మన్‌, సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో ఎక్స్‌– అఫీషియో డైరెక్టర్లు మున్సిపల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, తెలంగాణ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ చైర్మన్‌, ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, డైరెక్టర్లు జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌, డైరెక్టర్‌ (టెక్నికల్‌), డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)లు పాల్గొననున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement