సరి చేయకుంటే.. సమస్యలెన్నో!
రేషన్ కార్డుల సర్వేలో పారదర్శకత పాటించాలి
సాక్షి, సిటీబ్యూరో: రేషన్ కార్డుల జారీ కోసం ఇంటింటి సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మెహిదీపట్నం మండలం విజయనగర్ కాలనీ, హుమాయున్ నగర్ కాలనీలో ఇంటింటి సర్వేను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వేలో తప్పులు లేకుండా బాధ్యతతో నిర్వహించాలని సూచించారు. అర్హులను ఎవరినీ మిస్ చేయవద్దని, రిమార్కులు సరిగా రాయాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి రమేష్ ఉన్నారు.
సాక్షి, సిటీబ్యూరో:
అఫ్జల్గంజ్లోని రోషన్ ట్రావెల్స్ వద్ద గురువారం రాత్రి చోటుచేసుకున్న కాల్పుల ఉదంతం పోలీసు విభాగంలో ఉన్న కొన్ని లోపాలు ఎత్తి చూపింది. వీటిని సరి చేయకుంటే భవిష్యత్‌లో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేస్తోంది. మొదటి సమస్య సీసీ కెమెరాలది కాగా... రెండోది ‘ఫ్రెండ్లీ’ పేరుతో ఆయుధాలకు దూరమైన పోలీసులకు సంబంధించింది. నేరగాళ్లు నానాటికీ అప్‌గ్రేడ్ అవుతూ, ఆధునిక ఆయుధాలను సమకూర్చుకుంటున్న ప్రస్తుత రోజుల్లో పోలీసు విభాగంలో ఉన్న లోపాలు సరి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ ‘నేత్రాల’తో ఫలితం అంతంతే..
ఏ వేదికపై అవకాశం దొరికినా అధికారుల నుంచి నేతల వరకు అంతా రాజధానిలో ఉన్న సీసీ కెమెరాల అంశాన్ని ఊదరగొడతారు. లక్షల్లో కెమెరాలు ఉన్నాయని, ప్రపంచంలో ఆ స్థానం ఆక్రమించాం... దేశంలో ఈ స్థానంలో ఉన్నాం అంటూ గొప్పలు చెబుతుంటారు. వాస్తవ పరిస్థితులు మాత్రం మరోలా ఉన్నాయి. 2015 నుంచి రాష్ట్రంలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ జోరందుకుంది. వివిధ స్కీంల కింద కొన్నేళ్ల క్రితం నగరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ప్రస్తుతం అనేకం పని చేయట్లేదు. మరోపక్క పని చేస్తున్న కెమెరాలు సైతం నాసిరకంగా ఉన్నాయి. ఈ కారణంగానే రాత్రి వేళల్లో, లైట్ల వెలుతురులో వాహనాల నంబర్లను ఇవి గుర్తించలేకపోతున్నాయి. ఈ కారణంగానే అఫ్జల్‌గంజ్ నుంచి సికింద్రాబాద్‌కు దుండగుల్ని తీసుకువెళ్లిన ఆటోను గుర్తించడానికి పోలీసులు దాదాపు పది గంటలు శ్రమించాల్సి వచ్చింది. ఈలోపు దుండగులు నగరం నుంచి ఉడాయించారు.
ఆ సాంకేతికత ఉన్నట్లా.. లేనట్టా?
బంజారాహిల్స్ రోడ్ నెం.12 రూ.వందల కోట్ల ప్రజాధనం వెచ్చించి తెలంగాణ స్టేట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించారు. ఈ అద్దాల భవనం ప్రతిపాదన, శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సమయంలో అత్యాధునిక టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్ అంటూ ప్రచారం చేశారు. నగరంలోకి అడుగుపెట్టిన నేరగాళ్లు నేరం చేయకముందే చిక్కుతారని, ఓ వాహనం ఏ సమయంలో, ఏ ప్రాంతంలో, ఎన్నిసార్లు తిరిగిందో కేవలం కొన్ని నిమిషాల్లోనే కనిపెట్టేస్తామని.. ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. సీన్ కట్ చేస్తే.. ‘అఫ్జల్‌గంజ్ ఆటో’ను కనిపెట్టడానికి దాదాపు పది గంటల సమయం పట్టింది. ఈ ఏడాది సీసీ కెమెరాలకు మరమ్మతులు, కొత్త కెమెరాల ఏర్పాటు, అనుసంధానానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికారులు గతంలో ప్రకటించారు. దీంతో పాటు టెక్నాలజీ అంశాన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఆయుధం ఉంటే ‘ఫ్రెండ్’ కాదా?
నగర పోలీసులే కాదు... రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని విభాగాలు కొన్నేళ్లుగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ముసుగు వేసుకుని పని చేస్తున్నారు. ఓపక్క జరగాల్సిన దారుణాలన్నీ జరిగిపోతున్నా... తాము మాత్రం ప్రజలతో సత్సంబంధాల కోసం స్నేహపూర్వక పోలీసింగ్ చేస్తున్నామని అంటున్నారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే పోలీసులు ఎవరూ తమ వద్ద తుపాకులు ఉంచుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. అందరి వద్దా ఉన్న ఆయుధాలను హఠాత్తుగా దాచేశారు. ఇప్పుడు శాంతిభద్రతల విభాగం మాట అటుంచితే.. చివరకు టాస్క్‌ఫోర్స్ బృందాల వద్దా అవసరమైన ఆధాయుధాలు ఉండట్లేదు. ఓపక్క సిటీలో గన్ కల్చర్ పెరుగుతుండటం, మరోపక్క గతంలో ‘సూర్యాపేట’, తాజాగా ‘అఫ్జల్‌గంజ్’ ఉదంతాల నేపథ్యంలో కనీసం ప్రత్యేక బలగాలైనా ఆయుధాలు ధరించకపోతే ప్రజల మాట అటుంచి పోలీసులకే రక్షణ లేకుండాపోయే ప్రమాదం కనిపిస్తోంది.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఉన్న వాటిలోనూ నాణ్యత లేని ఫీడ్ రికార్డు
‘ఫ్రెండ్లీ’ పేరుతో తుపాకులకూ దూరంగా..
మారకపోతే భవిష్యత్‌లో పెను సవాళ్లే
ఎంజీబీఎస్ మార్గం
దుండగులు ఈ మార్గం నుంచే ఆటోలో రోషన్ ట్రావెల్స్ వద్దకు వచ్చారు
హక్కులకు విలువ ఇచ్చే దేశాల్లోనూ..
ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులతో స్నేహపూర్వకంగా ఉండటానికి, మానవ హక్కులకు భంగం కలగకూడదనే ఆయుధాలను దూరంగా ఉంచుతున్నామని కొందరు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇక్కడ వీళ్లు గమనించాల్సిన కీలకాంశం ఏమిటంటే... అనేక పాశ్చాత్య దేశాల్లో మానవ హక్కులు, నిబంధనలు, మానవ జీవితాలకు ఎంతో విలువ ఇస్తారు. అలాంటి చోట్ల కూడా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే పోలీసులు తమ వెంట కచ్చితంగా ఆయుధాలు ఉంచుకుంటారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులతో పాటు స్వీయరక్షణ కోసమూ తుపాకులు వినియోగిస్తుంటారు. ఆయా దేశాల్లో సత్వర న్యాయం, కఠిన చట్టాలు అమలులో ఉన్నా పోలీసులు తుపాకులతో తిరుగుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు దూరంగా ఉంచారన్నది అంతుచిక్కని విషయమే. ఈ లోపాలను ఉన్నతాధికారులు వీలైనంత త్వరగా సరి చేసుకోకుంటే భవిష్యత్‌లో పెను సవాళ్లు ఉత్పన్నమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment