ఆత్మలతో శృంగారం.. అందుకే గర్భస్రావం! | Aliens DNA And Reptilians US Viral Video Odd Beliefs Of Doctor | Sakshi
Sakshi News home page

అమెరికా డాక్టర్‌ విచిత్ర వ్యాఖ్యలు.. విమర్శలు

Published Wed, Jul 29 2020 10:26 AM | Last Updated on Wed, Jul 29 2020 1:05 PM

Aliens DNA And Reptilians US Viral Video Odd Beliefs Of Doctor - Sakshi

వాషింగ్టన్‌: ‘‘ఎవరూ అనారోగ్యం బారిన పడే అవకాశం లేదు. కరోనా వైరస్‌కు మందుకు ఉంది. అది మరేదో కాదు హైడ్రాక్సీక్లోరోక్విన్. కాబట్టి మాస్కులు ధరించాల్సిన పనిలేదు. అలాగే లాక్‌డౌన్‌ కూడా కొనసాగించాల్సిన పనిలేదు‌’’అంటూ హూస్టన్‌కు చెందిన ఫిజీషియన్‌ స్టెల్లా ఇమాన్యుయేల్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అమెరికన్‌ ఫ్రంట్‌లైన్‌ డాక్టర్స్‌’ పేరిట ఏర్పడిన ఓ గ్రూప్‌లో యాంటీ మలేరియా డ్రగ్‌ హెచ్‌సీక్యూ గురించి ప్రమోట్‌ చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. దీనిని రీట్వీట్‌ చేయడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌ చిక్కుల్లో పడ్డారు.

ఈ క్రమంలో మహమ్మారి కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో "తప్పుదోవ పట్టించే , హానికరమైన సమాచారాన్ని" పోస్ట్‌ చేశారంటూ ట్విటర్‌ ఆయన ఖాతాను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో స్టెల్లా సోషల్‌ మీడియా అకౌంట్లు, వీడియెలు పరిశీలించగా.. ఆమె రైట్‌వింగ్‌ భావజాలం గలవారని తేలినట్లు ఓ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. గతంలో కూడా అనేకమార్లు ఆమె ఇలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంది. (కరోనా: రెండున్నర నెలల్లో ఇదే అత్యధికం)

వివరాలు.. స్టెల్లా ఇమాన్యుయేల్‌ 1965లో జన్మించారు. నైజీరియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కలబార్‌ నుంచి మెడికల్‌ డిగ్రీ పొందిన ఆమె ఫిజీషియన్‌గా ప్రాక్టీసు చేస్తున్నారు. కాగా మహమ్మారి కరోనా వ్యాపించిన తొలినాళ్లలో వైరస్‌ను కట్టడి చేయడంలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ సానుకూల ఫలితాలనిస్తుందని పలువురు వైద్య నిపుణులు తేల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. కరోనా కూడా సాధారణ ఫ్లూ వంటిదేనని, తాను ఈ డ్రగ్‌ను వాడుతున్నానని చెప్పుకొచ్చారు. అయితే కొన్నాళ్ల తర్వాత ఆయన మాట మార్చారు. అదే విధంగా వైద్య నిపుణులు సైతం హెచ్‌సీక్యూ వాడకం వల్ల తలెత్తే దుష్ప్రభవాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ.. కరోనా పేషెంట్లకు దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తేల్చారు.

350 మంది కోలుకున్నారు
ఈ నేపథ్యంలో ఇటీవల ఈ డ్రగ్‌ వాడకం గురించి మరోసారి ప్రస్తావించిన స్టెల్లా.. 350 మంది కోవిడ్‌ రోగులకు తాను హెచ్‌సీక్యూ ఇచ్చానని, విషమ పరిస్థితుల్లో ఉన్న వాళ్లు కూడా త్వరగా కోలుకున్నారని పేర్కొన్నారు. కాబట్టి మాస్కులు, లాక్‌డౌన్‌ అవసరం అంతగా లేదని, ఇదొక్క మందు వాడితే చాలు అంటూ ఆర్థిక వ్యవస్థలో పునరుద్ధరణలో భాగంగా ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా సమర్థించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్రంప్‌ కుమారుడు షేర్‌ చేయడంతో అందరి దృష్టి ఆమె వైపు మళ్లింది. ఈ క్రమంలో స్టెల్లా గురించి ఆరా తీయగా.. పదకొండు రోజుల క్రితమే అమెరికా ఫ్రంట్‌లైన్‌ డాక్టర్స్‌ అనే వెబ్‌సైట్‌ను క్రియేట్‌ చేశారని, మంగళవారం దానిని తొలగించినట్లు తెలిసింది. 

అదే విధంగా గతంలోనూ స్టెల్లా చేసిన విచిత్ర వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని ఆత్మలు మహిళలతో శృంగారంలో పాల్గొనడం వల్లే.. గర్భస్రావం జరుగుతుందని, జననేంద్రియాలలో సమస్యలు తలెత్తి ఒత్తిడి లోనవుతారని ఆమె చెప్పిన మాటలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాకుండా ఏలియన్ల డీఎన్‌ఏతో అనారోగ్యం బారిన పడినవారికి చికిత్స చేయడం వల్ల మానవ జాతి, రాక్షస జాతి కలిసిపోయిందని, అదే విధంగా స్వలింగ సంపర్క వివాహాలు పెద్దలు- పిల్లల మధ్య పెళ్లికి దారి తీస్తాయంటూ తలాతోకా లేకుండా మాట్లాడిన తీరును పలువురు విమర్శిస్తున్నారు. వైద్యురాలి‌గా బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న స్టెల్లా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ హితవు పలుకుతున్నారు. అలాగే ఇలాంటి వాళ్ల వీడియోలు షేర్‌ చేసి.. ఇప్పటికే వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాక ఆందోళనలో ఉన్న ప్రజలను మరింత ఒత్తిడికి గురిచేయవద్దని ట్రంప్‌ కుమారుడిని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తన పేజీని పునరుద్ధరించకపోతే ఫేస్‌బుక్‌ను ఆ దేవుడు నామరూపాల్లేకుండా చేస్తాడని స్టెల్లా తాజాగా బెదిరింపులకు దిగడం కొసమెరుపు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement